సహాయక చర్యల్లో థాయిలాండ్ నేవీ, బ్రిటిష్ గజ ఈతగాళ్లు. (ఇన్‌సెట్‌లో) మృతిచెందిన డైవర్ సమన్
మే సాయ్: థాయ్‌లాండ్‌లో గుహలో చిక్కుకున్న చివరి ఐదుగురిని సహాయక బృందాలు మంగళవారం క్షేమంగా బయటకు తీసుకొచ్చాయి. దీంతో మూడు రోజులుగా థాయ్‌లాండ్ నౌకాదళ సిబ్బందితో కలసి వివిధ దేశాల నిపుణులు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. 18 రోజుల నరక యాతన తర్వాత మొత్తం 13 మంది గుహ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఓ ఫుట్‌బాల్ జట్టుకు చెందిన 12 మంది బాలురు, వారి కోచ్ జూన్ 23న థాయ్‌లాండ్‌లోని థామ్ లువాంగ్ గుహలోకి వెళ్లి, భారీ వర్షాల కారణంగా బయటకు వచ్చే దారి మొత్తం పూర్తిగా నిండిపోవడంతో, గుహ ప్రవేశ ద్వారం నుంచి లోపలికి రెండున్నర మైళ్ల దూరంలో చిక్కుకుపోయారు.
మొత్తం 13 మందిలో ఆదివారం నలుగురిని, సోమవారం మరో నలుగురిని సహాయక బృందాలు గుహ నుంచి బయటకు తీసుకుకొచ్చారు. మిగిలిన నలుగురు పిల్లలతోపాటు వారి కోచ్‌ను మంగళవారం రక్షించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కోచ్, పిల్లలంతా క్షేమంగా∙ఉన్నారని అధికారులు చెప్పారు. వివిధ దేశాలకు చెందిన నిపుణులు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, సాంకేతిక రంగ నిపుణుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్ తదితర ప్రముఖులు పిల్లలను రక్షించేందుకు అవసరమైన సాయం చేస్తామని ప్రకటించారు.
కేవలం పిల్లలను కాపాడేందుకే ఎలన్ మస్క్ ఏకంగా ఓ చిన్నపాటి జలాంతర్గామిని తయారు చేయించి పంపారు. ట్రంప్ సహా ఎంతోమంది ప్రముఖులు సహాయక బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. గుహ నుంచి బయటపడతారో లేదో కూడా తెలియకపోయినా మనోధైర్యం కోల్పోకుండా ఇన్నాళ్లూ గుహలోనే కాలం గడిపిన బాలురను పలువురు ప్రశంసిస్తున్నారు. మరోవైపు బాలురను కాపాడేందుకు గుహలోకి వెళ్లిన వైద్యుడు, డైవర్లంతా క్షేమంగా బయటపడినట్లు థాయ్‌లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. సాధ్యమవుతుందని కూడా ఎవరూ ఊహించని దానిని తాము చేసి చూపించామని ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన చియాంగ్ రాయ్ గవర్నర్ నరోంగ్సక్ ఒసటనకోర్న్ అన్నారు.
పకడ్బందీ వ్యూహంతో విజయం
చిన్నారులను కాపాడేందుకు థాయ్ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహాన్ని రచించింది. తొలుత ఈ ఆపరేషన్‌ను వర్షాలు తగ్గాకే చేపట్టాలని భావించారు. గుహలోని నీటిని పెద్దపెద్ద మోటార్ల ద్వారా బయటకు తోడేందుకు ప్రయత్నించినా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. గుహలో ఆక్సిజన్ సిలిండర్లు అమర్చడానికి వెళ్లిన డైవర్ సమన్ గుణన్ శుక్రవారం మృతి చెందడం ప్రమాద తీవ్రతను తెలియజేసింది.
అనేక మార్గాలను అన్వేషించిన అనంతరం చివరకు నీటిలోనే పిల్లలను బయటకు తీసుకురావాలని ప్రభుత్వం తీర్మానించింది. పక్కా ప్రణాళికను సిద్ధం చేసి గజ ఈతగాళ్లను రంగంలోకి దించింది. ఆదివారం నుంచి డైవర్లు పిల్లలను బయటకు తీసుకురావడం ప్రారంభించారు. క్షణక్షణం ఉత్కంఠను రేపుతూ మొత్తం మూడు రోజుల పాటు ఈ మిషన్ కొనసాగింది. అమెరికా, బ్రిటన్, డెన్మార్క్ వంటి వివిధ దేశాలకు చెందిన మొత్తం 13 మంది సుశిక్షితులైన డైవర్లు ఈ మిషన్‌లో పాల్గొన్నారు. వారికి రక్షణగా మరో అయిదుగు థాయ్ నేవీ సీల్స్ (నౌకాదళ సిబ్బంది) ఉన్నారు.
నీటిలో భయపడకుండా మందులు
నీటిలోనూ పిల్లలను బయటకు తీసుకొస్తున్న సమయంలో పిల్లలెవరూ భయపడకుండా ఉండేందుకు డైవరు ఏర్పాట్లు చేశారు. ఇరుకు దారుల్లో ఈదేటపుడు ఆందోళన చెందకుండా ప్రత్యేక మందులిచ్చామని, అవి మత్తుమందులు కావని అధికారులు తెలిపారు. డైవర్లు ప్రతీ బాలుడి ముఖానికి మాస్క్ తొడిగారు. ఈదేటపుడు వెట్ సూట్ వేశారు. బూట్లు వేసి, హెల్మెట్ పెట్టారు. ఒక్కో బాలుడి వెంట ఇద్దరు డైవర్లు ఉన్నారు. ఒక డైవర్ ఆక్సిజన్ ట్యాంక్‌ని పట్టుకుంటే అతని వెనుక భాగాన బాలుడిని కట్టారు.
మరో డైవర్ బాలుడి వెనకాల ఇంకో ఆక్సిజన్ ట్యాంక్ పట్టుకుని పిల్లాడు ఎలా ఉన్నాడో జాగ్రత్తగా గమనించారు. పిల్లలు చిక్కుకున్న ప్రదేశం నుంచి గుహ వెలుపలి వరకు 8 మిల్లీ మీటర్ల మందమున్న తాడు కట్టారు. డైవర్లు ఆ తాడు వెంబడి ఈదుతూ పిల్లలను బయటకు తీసుకొచ్చారు. చీకట్లో వర్షపు నీరు, బురద, రాళ్ల మధ్య ఇరుకైన దారుల్లో ఈదుకుంటూ పిల్లల్ని తీసుకొచ్చారు. ఇరుకుప్రాంతాల్లో డైవర్లు తమ ఆక్సిజన్ ట్యాంక్‌ని బయటకు తీసి పిల్లల్ని సన్నటి దారిగుండా లాగి తీసుకొచ్చారు.
కొన్ని చోట్ల పిల్లలు దాదాపు పావుగంటపాటు నీటిలోనే ఉండాల్సి వచ్చింది. ఒక్కో బాలుడిని బయటకు తేవడానికి డైవర్లకు అయిదుగంటల సమయం పట్టింది. బాలురను రక్షించేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎలన్ మస్క్ తయారు చేయించిన చిన్నపాటి జలాంతర్గామి సాంకేతికత పరంగా బాగున్నప్పటికీ ఆచరణలో అది పనికి రాదని, రక్షించేందుకు దాన్ని వాడలేమని సహాయక పర్యవేక్షక నిపుణులు స్పష్టంచేశారు.
18 రోజుల్లో ఏం జరిగింది?
(గుహలో చిక్కుకున్న వైల్డ్‌బోర్స్ ఫుట్‌బాల్ జట్టు సభ్యులు, కోచ్(ఎడమ) (ఫైల్))
♦ జూన్ 23: ఉదయంపూట కోచ్‌తో కలిసి గుహలోకి విహారయాత్రకు వెళ్లారు. లోపలికెళ్లగానే అప్పుడే భారీ వర్షం మొదలై గుహద్వారం మొత్తం నీటితో నిండిపోవడంతో గుహలోనే చిక్కుకున్నారు. చీకటి పడినా పిల్లలెవ్వరూ ఇళ్లకు రాకపోవడం, ఎక్కడున్నారో తెలీకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుహ ప్రవేశ ద్వారం వద్ద వారి సైకిళ్లు కనిపించడంతో అర్ధరాత్రి నుంచే గాలింపు చేపట్టారు.
♦జూన్ 25: పిల్లల పాదముద్రలు, చేతిముద్రలను గుర్తించిన సహాయక బృందం.
♦ జూన్ 26: గుహలోకి ప్రవేశించిన దాదాపు 12 మంది థాయ్ నౌకాదళ సిబ్బంది. బురదనీటితో గుహ దారి నిండిపోవడం వల్ల వాళ్లు లోపలికి వెళ్లడం కష్టంగా ఉందన్న హోం మంత్రి.
♦ జూన్ 27: భారీ వర్షంతో గాలింపు చర్యలకు అంతరాయం. గుహ దారుల్లో పెరిగిన నీటి ప్రవాహం. థాయ్ సహాయక బృందానికి జతకలిసిన అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల సిబ్బంది.
♦ జూన్ 28: నీటిని బయటకు తోడడం, గుహలోకి చేరుకునేందుకు ఇతర మార్గాల కోసం అన్వేషణ ప్రారంభం.
♦ జూన్ 30: వర్షాలు తగ్గడంతో మళ్లీ ఊపందుకున్న గాలింపు చర్యలు. పిల్లలను బయటకు తెచ్చేందుకు సాయమందించడం కోసం ఆస్ట్రేలియా, చైనాల నుంచి కూడా వచ్చిన పలువురు నిపుణులు.
♦ జూలై 2: బాలురు, వారి కోచ్ ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, పిల్లలతో మాట్లాడి వీడియో రికార్డ్ చేసుకొచ్చిన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు. తాము ఆరోగ్యంగానే ఉన్నామన్న పిల్లలు.
♦ జూలై 4: ఆహారం, ఔషధాలతో బాలుర వద్దకు చేరుకున్న ఏడుగురు నౌకాదళ సిబ్బంది, ఓ వైద్యుడు. వారిని బయటకు తెచ్చేందుకు అనువైన పరిస్థితులపై చర్చ.
♦ జూలై 5: నీటిని బయటకు తోడే ప్రక్రియ విస్తృతం. డైవింగ్ ఎలా చేయాలో పిల్లలకు శిక్షణనిచ్చిన సహాయక సిబ్బంది.
♦ జూలై 6: గుహలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతుండటంపై ఆందోళన. ఆక్సిజన్ అందక సహాయక బృందంలోని ఓ డైవర్ మృతి. మళ్లీ భారీ వర్షాలు మొదలైతే పిల్లలు మరిన్ని రోజులు గుహలోనే ఉండాల్సి వస్తుందనీ, వారిని త్వరగా బయటకు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్న అధికారులు.
♦ జూలై 8: ఎట్టకేలకు పిల్లలను బయటకు తెచ్చే ప్రక్రియ మొదలు. వరద నీటితో నిండిన ఇరుకైన దారుల గుండా నలుగురు పిల్లలను సురక్షితంగా గుహ నుంచి బయటకు తెచ్చిన డైవర్లు.
♦ జూలై 9: మరో నలుగురు బాలురను బయటకు తెచ్చిన సహాయక బృందం
♦ జూలై 10: మిగిలిన నలుగురు బాలురు, కోచ్‌ను కూడా రక్షించిన సిబ్బంది. 18 రోజుల యాతన నుంచి వారికి విముక్తి.
(పిల్లలను రక్షించిన తరువాత స్థానిక మీడియా కేంద్రంలో స్థానికుల సందడి )
Comments
Please login to add a commentAdd a comment