రోబోటిక్ శుద్ధి యంత్రంతో రీవాక్స్ ప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ కట్టడికి హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న రీవాక్స్ ఫార్మా ఓ వినూత్నమైన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆస్పత్రుల్లోని ఐసీయూ వార్డుల్లో ఉండే పడకలను కరోనా వైరస్ రహితంగా మార్చేందుకు ఓ రోబోటిక్ శుద్ధి యంత్రాన్ని సిద్ధం చేసింది. 5 నిమిషాల్లోనే ఓ పడకను తనంతట తానే అన్ని వైపుల నుంచి శుద్ధి చేయడం ఈ యంత్రం విశేషం. యూవీ–బీఆర్ అని పిలుస్తున్న ఈ యంత్రంలో బ్యాక్టీరియా/వైరస్‌లోని డీఎన్‌ఏను నాశనం చేయగల స్థాయిలో అతినీలలోహిత కిరణాలను ప్రసారం చేస్తుంది. ఐసీయూ పడకలను శుద్ధి చేసేందుకు ప్రస్తుతం రసాయనాలను వాడుతున్నారని యూవీ–బీఆర్ మాత్రం వాటితో పనిలేకుండా కరోనా వైరస్ మాత్రమే కాకుండా దాదాపు 11 రకాల వైరస్‌లను, 14 రకాల బ్యాక్టీరియాను 99.99 శాతం చంపేయగలవని రీవాక్స్ ఫార్మా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జి.ప్రణయ్‌రెడ్డి తెలిపారు.
అతినీలలోహిత కిరణాలతో వైరస్‌లను నాశనం చేసే పరికరాలు కొన్ని ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నా.. యూవీ–బీఆర్ వాటికంటే శక్తిమంతమైందని, 254 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యపు కిరణాలను విడుదల చేస్తుందని వివరించారు. యూవీ–ఎస్‌టీ పేరుతో ఇంకో యంత్రాన్ని కూడా తయారు చేశామని, దీన్ని ఫార్మా కంపెనీలు, ఆహార పరిశ్రమల్లో వాడొచ్చని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఏడిద జగన్ తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆస్పత్రుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు యూవీ–బీఆర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఈ యంత్రంపై తాము ప్రత్యేక పేటెంట్ కూడా సంపాదించామని చెప్పారు.
విజయవంతంగా పూర్తయిన పరీక్షలు..
యూవీ–బీఆర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టే ముందు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో జరిపిన పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని, మెడికవర్, విరించి ఆస్పత్రులు కూడా ఈ యంత్రాలను కొనుగోలు చేశాయని ప్రణయ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ ఆస్పత్రులతో సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. యంత్రం ఖరీదు వివరాలు త్వరలోనే చెబుతామని, వీలైనంత తక్కువ ధరలోనే అందరికీ ఈ యంత్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment