ఫ్లయింగ్ ఐసీయూ | Hospital, air ambulance service work to save lives | Sakshi
Sakshi News home page

ఫ్లయింగ్ ఐసీయూ

Published Mon, Sep 22 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:44 PM

ఫ్లయింగ్ ఐసీయూ

ఫ్లయింగ్ ఐసీయూ

కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మనిషిని అత్యవసరంగా కాపాడేది అంబులెన్స్. పట్టణాల్లో, పల్లెల్లో ప్రమాదాల్లో చిక్కుకున్న ఎందరి జీవితాలనో కాపాడే ఆపద్బంధు అంబులెన్స్! అయితే.. అదే ప్రమాదం అడవుల్లోనో, కొండల్లోనో జరిగితే..? వెంటిలేటర్ మీదున్న రోగిని అత్యవసరంగా అత్యాధునిక వైద్యం కోసం దూరతీరాలకు తీసుకెళ్లాల్సి వస్తే.. అలాంటి సందర్భాల్లోమేమున్నామంటున్నాయి ఎయిర్ అంబులెన్స్‌లు. మహానగరాల్లో వీటికి ట్రాఫికర్ సమస్య ఉండదు. గంటలకు గంటలు ప్రయాణ సమయం ఉండదు.

కొడిగడుతున్న దీపాన్ని కొండెక్కకుండా ఎత్తుకెళ్లి అవసరమైన వెద్యం అందే చోట దించుతుంది. ఈ లోపు ఆ మనిషి ప్రాణాలు గాల్లో కలసిపోకుండా.. గగనతలంలోనే ఐసీయూ సేవలు అందిస్తుంది. ఇప్పటి వరకు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, గువాహటి, కోల్‌కతా నగరాలకు పరిమితమైన ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్ సేవలు ఇటీవల మన హైదరాబాద్‌లోనూ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్ మిషన్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా బినీష్ పాల్ ‘సిటీప్లస్’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
 
అత్యవసరంగా వైద్యం అందాల్సిన వారిని ఆస్పత్రికి తరలించే అంబులెన్స్‌కు ప్రతిక్షణం ఉత్కంఠమే. హైదరాబాద్‌లో అడుగడుగునా అడ్డగించే ట్రాఫిక్ జామ్‌లు, అస్తవ్యస్తమైన రోడ్లు ఒక ప్రాణానికి పరీక్ష పెడుతుంటాయి. ఇవేకాక అంబులెన్స్‌లో అత్యాధునిక సౌకర్యాల లేమితో ఎందరో అవసరమైన వైద్యాన్ని పొందలేక‘పోతున్నారు’. వీటన్నింటికీ పరిష్కారం చూపుతోంది ‘ఎయిర్ అంబులెన్స్’. ప్రాణాన్ని కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని సేవ లను ఉపయోగించుకోవడమే తమ లక్ష్యం అంటోంది ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్. పదేళ్ల శ్రమ తార్వాత 2007లో ఆకాశవీధిలో అంబులెన్స్ సేవలను ప్రారంభించామని చెబుతున్నారు బినీష్ పాల్. కొండలు, గుట్టలు, పర్వత ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, అడవుల్లో ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో ఎయిర్ అంబులెన్స్ సేవలు కీలకంగా మారుతున్నాయి.
 
12 విమానాలు..ఓ చాపర్..
ప్రస్తుతం ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్ దగ్గర 12 విమానాలు, ఓ చాపర్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 7 ప్లాటస్ పీసీ-12, 3 కింగ్ ఎయిర్ బీ- 200, 2 సింటేషన్ ఎక్స్‌ఎల్ విమానాలున్నాయి. ప్లాటస్, కింగ్ విమానాలను డొమెస్టిక్ పరిధిలో, చాపర్, సింటేషన్ విమానాలను ఇంటర్నేషనల్ పరిధిలో వినియోగిస్తున్నారు. ఇక సిబ్బంది విషయానికొస్తే.. 50 మంది పెలైట్లు, 25 మంది వైద్యులు, ఎయిర్ పోర్ట్‌కు నలుగురు చొప్పున ఇతర స్టాఫ్ అందుబాటులో ఉన్నారు. రైలు, రోడ్డు, అగ్ని ప్రమాదాల్లోని క్షతగాత్రులను, హార్ట్ ఎటాక్‌తో పాటు ప్రాణాల మీదికి వచ్చినప్పుడు రెక్కలు కట్టుకుని వాలిపోతాయి. ప్రథమ చికిత్సతో పాటు అవసరమైన వైద్యసేవలు అందిస్తూ.. సురక్షితంగా, తక్కువ సమయంలో ఆస్పత్రికి తరలిస్తుంది.
 
చార్జి రూ.45 వేలు..
ఎయిర్ అంబులెన్స్ సేవల చార్జీలు ప్రయాణ దూరం, విమానాన్ని బట్టి చార్జి ఉంటుంది. చాపర్, హెలికాప్టర్ (సింగిల్ ఇంజన్) ప్రారంభ ధర రూ.45 వేలు, డబుల్ ఇంజన్ హెలికాప్టర్ అయితే రూ.75 వేలు, అలాగే జెట్ విమానం అయితే రూ.1.80 లక్షలు స్టార్టింగ్ ప్రైస్‌గా నిర్ణయించారు. అంబులెన్స్‌లో సేవల చార్జీలు సమయాన్ని బట్టి లెక్కిస్తారు. ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయను మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్‌లోనే సింగపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్‌రెడ్డి ఎయిర్ అంబులెన్స్‌లోనే బాగల్పూర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మలయాళ నటుడు జగతి శ్రీకుమార్‌తో పాటు చాలా మంది రాజకీయ ప్రముఖులు ఎయిర్ అంబులెన్స్ సేవలు పొందిన వారిలో ఉన్నారు.
 
అన్ని అనుమతులూ ఉన్నాయి..
‘ఎక్కడైనా, ఏ సమయంలోనైనా దే శ, విదేశాల్లోని అన్ని విమానాశ్రయాలకు వెళ్లేందుకు వీలుగా
 అవసరమైన అనుమతిని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖలతో పాటు ఇతర ఏజెన్సీల నుంచి అనుమతి తీసుకున్నాం. అలాగే దేశ, విదేశాల్లోని ఆసుపత్రులకు వెళ్లేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖ అనుమతి కూడా తీసుకున్నాం. అలాగే అందుబాటులో ఉన్న విమానాలను ఎప్పటికప్పుడు మరమ్మతులను చేసేందుకు ప్రత్యేకమైన విభాగం కూడా ఉందని’ చెబుతున్నారు బినీష్ పాల్.  మరిన్ని వివరాలు airambulance@ airambulanc-eaviation.com, www.airambulance-aviation.com వెబ్‌సైట్లలో చూడొచ్చు.
-ఆడెపు శ్రీనాథ్
 
అంబులెన్స్ ప్రత్యేకతలు..
- ఎయిర్ అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న పేషెంట్లు/ క్షతగాత్రుల ప్రాణాలకు ఎటువంటి ముప్పులేకుండా అత్యవసరంగా అందించాల్సిన వైద్య సేవలన్నీ ఉంటాయి
- నైపుణ్యం కలిగిన వైద్యుడితో పాటు, ప్రత్యేక శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు
- కృత్రిమ శ్వాస వ్యవస్థతో పాటు, పేషంట్ గుండె ఆగిపోతే.. తిరిగి పనిచేసేలా షాక్ ఇచ్చే డిఫిబ్రిలేటర్ ఉంటుంది
- రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకునే పల్స్ ఆక్స్ మీటర్ కూడా అందుబాటులో ఉంటుంది
- కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ (సీపీఆర్), ఎలక్ట్రోకార్డియోగ్రఫి (ఈసీజీ), వెంటిలేటర్, టెలీ మెడిసిన్, ఇంక్యుబేషన్ వంటి అత్యాధునిక వసతులు ఎయిర్ అంబులెన్స్‌లో సిద్ధంగా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement