adepu srinath
-
ఫ్లయింగ్ ఐసీయూ
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మనిషిని అత్యవసరంగా కాపాడేది అంబులెన్స్. పట్టణాల్లో, పల్లెల్లో ప్రమాదాల్లో చిక్కుకున్న ఎందరి జీవితాలనో కాపాడే ఆపద్బంధు అంబులెన్స్! అయితే.. అదే ప్రమాదం అడవుల్లోనో, కొండల్లోనో జరిగితే..? వెంటిలేటర్ మీదున్న రోగిని అత్యవసరంగా అత్యాధునిక వైద్యం కోసం దూరతీరాలకు తీసుకెళ్లాల్సి వస్తే.. అలాంటి సందర్భాల్లోమేమున్నామంటున్నాయి ఎయిర్ అంబులెన్స్‌లు. మహానగరాల్లో వీటికి ట్రాఫికర్ సమస్య ఉండదు. గంటలకు గంటలు ప్రయాణ సమయం ఉండదు. కొడిగడుతున్న దీపాన్ని కొండెక్కకుండా ఎత్తుకెళ్లి అవసరమైన వెద్యం అందే చోట దించుతుంది. ఈ లోపు ఆ మనిషి ప్రాణాలు గాల్లో కలసిపోకుండా.. గగనతలంలోనే ఐసీయూ సేవలు అందిస్తుంది. ఇప్పటి వరకు బెంగళూరు, ఢిల్లీ, ముంబై, గువాహటి, కోల్‌కతా నగరాలకు పరిమితమైన ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్ సేవలు ఇటీవల మన హైదరాబాద్‌లోనూ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్ మిషన్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా బినీష్ పాల్ ‘సిటీప్లస్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అత్యవసరంగా వైద్యం అందాల్సిన వారిని ఆస్పత్రికి తరలించే అంబులెన్స్‌కు ప్రతిక్షణం ఉత్కంఠమే. హైదరాబాద్‌లో అడుగడుగునా అడ్డగించే ట్రాఫిక్ జామ్‌లు, అస్తవ్యస్తమైన రోడ్లు ఒక ప్రాణానికి పరీక్ష పెడుతుంటాయి. ఇవేకాక అంబులెన్స్‌లో అత్యాధునిక సౌకర్యాల లేమితో ఎందరో అవసరమైన వైద్యాన్ని పొందలేక‘పోతున్నారు’. వీటన్నింటికీ పరిష్కారం చూపుతోంది ‘ఎయిర్ అంబులెన్స్’. ప్రాణాన్ని కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని సేవ లను ఉపయోగించుకోవడమే తమ లక్ష్యం అంటోంది ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్. పదేళ్ల శ్రమ తార్వాత 2007లో ఆకాశవీధిలో అంబులెన్స్ సేవలను ప్రారంభించామని చెబుతున్నారు బినీష్ పాల్. కొండలు, గుట్టలు, పర్వత ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, అడవుల్లో ప్రమాదాలు జరిగితే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడంలో ఎయిర్ అంబులెన్స్ సేవలు కీలకంగా మారుతున్నాయి. 12 విమానాలు..ఓ చాపర్.. ప్రస్తుతం ఎయిర్ అంబులెన్స్ ఏవియేషన్ దగ్గర 12 విమానాలు, ఓ చాపర్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 7 ప్లాటస్ పీసీ-12, 3 కింగ్ ఎయిర్ బీ- 200, 2 సింటేషన్ ఎక్స్ఎల్ విమానాలున్నాయి. ప్లాటస్, కింగ్ విమానాలను డొమెస్టిక్ పరిధిలో, చాపర్, సింటేషన్ విమానాలను ఇంటర్నేషనల్ పరిధిలో వినియోగిస్తున్నారు. ఇక సిబ్బంది విషయానికొస్తే.. 50 మంది పెలైట్లు, 25 మంది వైద్యులు, ఎయిర్ పోర్ట్‌కు నలుగురు చొప్పున ఇతర స్టాఫ్ అందుబాటులో ఉన్నారు. రైలు, రోడ్డు, అగ్ని ప్రమాదాల్లోని క్షతగాత్రులను, హార్ట్ ఎటాక్‌తో పాటు ప్రాణాల మీదికి వచ్చినప్పుడు రెక్కలు కట్టుకుని వాలిపోతాయి. ప్రథమ చికిత్సతో పాటు అవసరమైన వైద్యసేవలు అందిస్తూ.. సురక్షితంగా, తక్కువ సమయంలో ఆస్పత్రికి తరలిస్తుంది. చార్జి రూ.45 వేలు.. ఎయిర్ అంబులెన్స్ సేవల చార్జీలు ప్రయాణ దూరం, విమానాన్ని బట్టి చార్జి ఉంటుంది. చాపర్, హెలికాప్టర్ (సింగిల్ ఇంజన్) ప్రారంభ ధర రూ.45 వేలు, డబుల్ ఇంజన్ హెలికాప్టర్ అయితే రూ.75 వేలు, అలాగే జెట్ విమానం అయితే రూ.1.80 లక్షలు స్టార్టింగ్ ప్రైస్‌గా నిర్ణయించారు. అంబులెన్స్‌లో సేవల చార్జీలు సమయాన్ని బట్టి లెక్కిస్తారు. ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయను మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్‌లోనే సింగపూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్‌రెడ్డి ఎయిర్ అంబులెన్స్‌లోనే బాగల్పూర్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. మలయాళ నటుడు జగతి శ్రీకుమార్‌తో పాటు చాలా మంది రాజకీయ ప్రముఖులు ఎయిర్ అంబులెన్స్ సేవలు పొందిన వారిలో ఉన్నారు. అన్ని అనుమతులూ ఉన్నాయి.. ‘ఎక్కడైనా, ఏ సమయంలోనైనా దే శ, విదేశాల్లోని అన్ని విమానాశ్రయాలకు వెళ్లేందుకు వీలుగా అవసరమైన అనుమతిని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖలతో పాటు ఇతర ఏజెన్సీల నుంచి అనుమతి తీసుకున్నాం. అలాగే దేశ, విదేశాల్లోని ఆసుపత్రులకు వెళ్లేందుకు వీలుగా కేంద్ర ఆరోగ్య, పట్టణాభివృద్ధి శాఖ అనుమతి కూడా తీసుకున్నాం. అలాగే అందుబాటులో ఉన్న విమానాలను ఎప్పటికప్పుడు మరమ్మతులను చేసేందుకు ప్రత్యేకమైన విభాగం కూడా ఉందని’ చెబుతున్నారు బినీష్ పాల్. మరిన్ని వివరాలు airambulance@ airambulanc-eaviation.com, www.airambulance-aviation.com వెబ్సైట్లలో చూడొచ్చు. -ఆడెపు శ్రీనాథ్ అంబులెన్స్ ప్రత్యేకతలు.. - ఎయిర్ అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న పేషెంట్లు/ క్షతగాత్రుల ప్రాణాలకు ఎటువంటి ముప్పులేకుండా అత్యవసరంగా అందించాల్సిన వైద్య సేవలన్నీ ఉంటాయి - నైపుణ్యం కలిగిన వైద్యుడితో పాటు, ప్రత్యేక శిక్షణ పొందిన పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు - కృత్రిమ శ్వాస వ్యవస్థతో పాటు, పేషంట్ గుండె ఆగిపోతే.. తిరిగి పనిచేసేలా షాక్ ఇచ్చే డిఫిబ్రిలేటర్ ఉంటుంది - రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకునే పల్స్ ఆక్స్ మీటర్ కూడా అందుబాటులో ఉంటుంది - కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ (సీపీఆర్), ఎలక్ట్రోకార్డియోగ్రఫి (ఈసీజీ), వెంటిలేటర్, టెలీ మెడిసిన్, ఇంక్యుబేషన్ వంటి అత్యాధునిక వసతులు ఎయిర్ అంబులెన్స్‌లో సిద్ధంగా ఉంటాయి. -
టచ్ లెస్సన్
ఇక్కడ గుండెకాయను చే తుల్తో తాకొచ్చు.. నోట్లో మన తల దూర్చి కొండనాలుక కథ తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మానవ శరీరంలోని ప్రతి భాగాన్ని చూస్తూ, తాకుతూ.. క్షుణ్ణంగా అధ్యయనం చేయవచ్చు. సైన్స్ రహస్యాల్ని సరదాగా చూసేయొచ్చు. ఇవన్నీ smartur3d.com వింతలు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ప్రపంచ విద్యా సదస్సులో ‘ఉత్తమ స్టార్ట్ క్లాస్ ప్రొడక్ట్’ అవార్డును గెలుచుకున్న మన హైదరాబాదీ నీరజ్ జువెల్కర్ ఆవిష్కర ణ ఇది. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఎస్టీఈ) సదస్సులో ఈ సాఫ్ట్వేర్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా smartur3d.com విశేషాలను నీరజ్ ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. సైన్స్ పాఠమంటే ప్రయోగాలు, బొమ్మలు. అందులోనూ జీవశాస్త్రం అంటే అన్నీ బొమ్మలే. గతంలో విద్యార్థులకు నల్లబల్లపై బొమ్మలు గీసి పాఠాలు చెప్పేవారు. కాలం టెక్నాలజీ టర్న్ తీసుకోవడంతో కంప్యూటర్ల ద్వారా బోధించడం మొదలైంది. పాఠాలు నల్లబల్లపై చెప్పినా, కంప్యూటర్లో చూపించినా విద్యార్థుల మస్తిష్కాలకు నేరుగా చేరుకోవు. ఏదైనా ప్రాక్టికల్‌గా ఒక్కసారి చూపిస్తే.. మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయిపోతాయి. అందుకే అధునాతన టెక్నాలజీ ఆగ్యుమేటెడ్ రియాల్టీతో smartur3d.com ను రూపొందించాం. దీంతో మనం నేర్చుకోవాల్సిన అంశాన్ని నేరుగా మన చేతుల్లో తీసుకొని ప్రాక్టికల్‌గా చదువుకోవచ్చు. ఒక్కముక్కలో చెప్పాలంటే యానిమేషన్ ఎడ్యుకేషన్ అన్నమాట. ఇప్పటివరకు ఆగ్మెంటెడ్ రియాలిటీని విమానాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో శిక్షణ కోసం వినియోగించారు. కానీ, దేశంలోనే తొలిసారిగా విద్యా రంగంలో కూడా ఉపయోగించాం. కొడుకు కోసం వెళ్తే.. 2011లో మా అబ్బాయిని జాయిన్ చేయడానికి ఓ స్కూల్‌కు వెళ్లాను. అక్కడ బోధన చూసి నాకు ఆశ్చర్యమైంది. ఎప్పుడో ముప్పయ్ ఏళ్ల కిందట నేను చదువుకున్న రోజుల్లోని పద్ధతులే ఫాలో అవుతున్నారు. అందుబాటులో ఉన్న టెక్నాలజీకి విద్యారంగం ఆమడ దూరంలో ఉందనిపించింది. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ మాత్రం కంప్యూటర్లో బోధన పేరుతో పెద్దమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉంటూ, ఆధునికంగా ఏదైనా టెక్నాలజీ తయారు చేయాలనుకున్నా. ఈ సాఫ్ట్వేర్ ఓ పాఠశాల.. పాఠాలను ప్రయోగాత్మకంగా చెబితే విద్యార్థులు ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. విద్యార్థుల కోసం రూపొందించిన ఈ సాఫ్ట్వేర్ ఒక పాఠశాల లాంటిది. కానీ నేర్పించే తీరు కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. smartur3d.com సాఫ్ట్వేర్ వాడేందుకు ఏడాదికి రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కంప్యూటర్లో, ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఎందులోనైనా వేసి సులభంగా విద్యార్థులకు పాఠాలు బోధించవచ్చు, నేర్చుకోవచ్చు. ఇందులో ప్రధానంగా మూడు విభాగాలుంటాయి. 1. Interactive 3d, 2. Augmented reality, 3. Stereoscopic 3d అమీబా నుంచి మనిషి దాకా.. smartur3d.com లో ఏక కణ జీవి అమీబా మొదలు సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు, చెట్లు, జంతువులు.. మానవ శరీరంలోని బాహ్య, అంతర్భాగాలు 3డీలో ఉంటాయి. వీటికి Interactive 3d ద్వారా విద్యార్థులకు బోధించవచ్చు. అదే Augmented reality ద్వారా అయితే టెక్నాలజీ సహాయంతో నేరుగా చేతుల్లోకి తీసుకోవచ్చు. అదే Stereoscopic 3d ద్వారా అయితే గూగుల్ కళ్లద్దాలను పెట్టుకుని మన కళ్లముందు కదలాడుతున్నట్లు చూస్తూ.. శరీర భాగాల లోపలికి వెళ్లి అధ్యయనం చేయవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్‌తో వీడియోనే కాదు.. ఆడియో కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా రూపొందించిందే. దీని ప్రత్యేకత ఏంటంటే.. మిగతా సాఫ్ట్‌వేర్స్‌లో అయితే సంబంధిత కంపెనీ రూపొందించిన లాంగ్వేజ్‌లో మాత్రమే వినాలి. ఉదాహరణకు ఇంగ్లిష్ భాషలో సబ్జెక్ట్‌ను రూపొందిస్తే.. అన్ని ప్రాంతాల విద్యార్థులకు ఈజీగా అర్థం కాదు. మనకు కావాల్సిన విషయాన్ని కావాల్సిన భాషలో రికార్డు చేసుకుంటే చాలు.. అదే భాషలో మనం వినొచ్చు. అంతేకాదండోయ్.. తరగతులు, విద్యార్థుల పరిజ్ఞాన స్థాయిని బట్టి శరీర భాగాల్లోని కొన్ని పార్ట్‌లను తొలగించవచ్చు. హైదరాబాద్‌లో 15 పాఠశాలల్లో.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, స్టాన్లీ వంటి సుమారు 15 పాఠశాలల్లో smartur3d.com ద్వారా విద్యా బోధన జరుగుతోంది. అమెరికాలో దాదాపు 500 పాఠశాలల్లో.. యూకే, కెనడా, ఇటలీ, ఉగాండా, దక్షిణాఫ్రికా వంటి సుమారు 20 దేశాల్లోని పాఠశాలల్లో ఈ సాఫ్ట్వేర్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. తయారీకి రెండున్నరేళ్లు.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ), నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్ సీఈఆర్టీ), రాష్ట్రస్థాయి ఎడ్యుకేషన్లతో పాటు అన్ని దేశాల్లోని విద్యా వ్యవస్థను అధ్యయనం చేశాను. అన్ని సిలబస్‌లలో కామన్‌గా ఉన్న పాఠ్యాంశాలను తీసుకుని ఈ Ssmartur3d.com ను రూపొందించాం. అందుకే ఈ సాఫ్ట్వేర్ తయారీకి రెండున్నరేళ్లు పట్టింది. ప్రస్తుతం 3 నుంచి 10వ తరగతి వరకు బయాలజీ సబ్జెక్ట్ మాత్రమే అందుబాటులో ఉంది. మరో రెండు నెలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో కూడా ఈ సాఫ్ట్‌వేర్‌ను తీసుకొస్తాం. ఆ తర్వాత మ్యాథ్స్, జాగ్రఫీ వంటి అన్ని సబ్జెక్టుల్లోనూ రూపొందిస్తాం. - ఆడెపు శ్రీనాథ్