సాక్షి,హైదరాబాద్: ఇప్పటివరకూ ఫిజియో థెరపీ, మందుల హోమ్ డెలీవరీ, రక్త, మూత్ర పరీక్షలు వంటి సేవలు మాత్రమే అందుతుండగా, తాజాగా కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ యాజమాన్యం ‘కేర్ ఎట్ హోమ్’పేరుతో రోగి ఇంట్లోకే ఐసీయూ సర్వీసులను తీసుకొచ్చింది. సర్జరీ తర్వాత ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చిన రోగులతో పాటు దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడుతూ రోజుల తరబడి ఐసీయూలో ఉండాల్సి వచ్చే కేన్సర్, పక్షవాతం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, న్యుమోనియా, ఆస్తమా సంబంధిత రోగులకు వారి బంధువుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన వైద్యసేవలు అందించనుంది. దీంతో ఆస్పత్రి ఖర్చులు తగ్గడంతో పాటు రోగి త్వరగా కోలుకునే అవకాశమూ ఉంది.
ఖర్చు తక్కువ..ఫలితమెక్కువ
కేన్సర్, పక్షవాతం సహా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి రోగాల బారిన పడ్డవారికి ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో వైద్యసేవలు అందించాల్సి వస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రిలో రోజు సగటు ఐసీయూ చార్జీ రూ.50 వేలకుపైనే. అదే హోమ్ ఐసీయూ సర్వీసులో రూ.10 వేలకు మించదు. పోస్ట్ ఆపరేటివ్ ఖర్చులు రోజుకు రూ.30 వేల వరకు అయితే ఇంట్లో రూ.5 వేలలోపే. అదే బెడ్‌సైడ్ సర్వీసులకైతే రూ.2 వేలకు మించదని కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ ప్రకటించింది. రోగిని రోజుల తరబడి ఐసీయూలో ఉంచాల్సి వస్తుండటం, ఈ వైద్య ఖర్చులు బంధువులకు భారంగా మారు తున్నాయి. ఇదే సమయంలో ఆస్పత్రి ఐసీయూ పడకలు ఖాళీగా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు బెడ్స్ సమకూర్చలేని పరిస్థితి తలెత్తుతుంది.
పది నుంచి పదిహేను పడకలతో నెలకొల్పిన ఐసీయూలో రకరకాల బాధితులకు చికిత్సలు అందించాల్సి వస్తుండటం, ఒక్కో సారి ఎవరైనా చనిపోతే, బంధువుల ఆర్తనాదాలు విని పక్కనే ఉన్న వారు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. ఐసీయూలో రకరకాల బాధితులు ఉండటం వల్ల ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఒక రోగి ఇన్‌ఫెక్షన్ మరో రోగికి సోకుతుండటం వల్ల దాన్ని నియంత్రించడానికి అనివార్యంగానే యాంటి బయాటిక్ మందుల్ని ఎక్కువ మోతాదులో వాడాల్సి వస్తుంది. దీంతో రోగి కోలుకోక పోగా ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అదే సర్జరీ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, ఇంట్లోని బంధువుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యసేవలు అందించడం వల్ల రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఆపదలో వచ్చిన వారికి సత్వరమే ఐసీయూ సేవలు అందించవచ్చు.
ఎలాంటి సేవలు అందిస్తారు?
రోజుల తరబడి ఐసీయూ చికిత్సలు అవసరమైన రోగులకు హోమ్ ఐసీయూ సర్వీసులను అందిస్తున్నారు. రోగి డిశ్చార్జ్‌కి ముందే ఆస్పత్రి బయోమెడికల్ ఇంజనీర్ రోగి ఇంటిని పరిశీలిస్తారు. ఇంట్లో ఆస్పత్రి ఐసీయూకు కావాల్సిన వాతావరణం ఉన్నట్లు నిర్ధారించుకుని గాలి, వెలుతురు ఉన్న ప్రదేశాన్ని ఇందుకు ఎంపిక చేస్తారు. రోగి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని హోమ్ ఐసీయూకు కావాల్సిన వెంటిలేటర్, ఆక్సిజన్, సీపీఏపీఎస్, బైలెవల్ ప్యాప్, సక్షన్ అండ్ ఎయిర్ ఫర్ ఫియర్, మల్టీపారా మానిటర్, బ్యాక్‌రెస్ట్ కాట్, ఐసీయూ బెడ్–3,5 ఫంక్షన్ మోటరైజ్డ్, తదితర మెడికల్ ఎక్విప్‌మెంట్స్‌ను రోజువారీ అద్దె ప్రాతిపాదికన సరఫరా చేస్తారు. ఎప్పటికప్పుడు రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఒక వైద్యుడితో పాటు సీనియర్ నర్సు, ఫిజియో థెరపిస్ట్, అటెండర్‌ను ఇంటికి పంపుతారు. అవసరమైతే స్పెషాలిటీ వైద్యుడు సైతం ఇంటికి వస్తాడు. మందులతో పాటు సాధారణ వైద్య పరీక్షలు సైతం ఇంటి నుంచే అందిస్తారు. ఒక వేళ రోగి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లయితే రోగికి అమర్చిన మల్టీపారామానిటర్ కేర్ ఎట్ హోమ్ కాల్ సెంటర్‌కు ఇండికేషన్స్ ఇస్తుంది. వెంటనే వైద్యులు అప్రమత్తం అవుతారు.
హోమ్ కేర్‌తో సత్ఫలితాలు
ప్రస్తుతం నగరంలో పలు రకాల హోమ్ సర్వీసులు ఉన్నప్పటికీ.. డిశ్చార్జ్ తర్వాత రోగి ఇంటికి కన్సల్టెంట్‌ను పంపిన దాఖలాలు లేవు. చాలా మందికి సర్జరీ తర్వాత అనివార్యమైతే తప్ప ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉండదు. చిన్నచిన్న వాటి కోసం రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సి రావడం వల్ల రోగులు హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతుంటారు. నాలుగు రోజుల్లో కోలు కోవాల్సిన రోగి పది రోజులైనా ఆరోగ్యం మెరుగుపడదు. ఆస్పత్రి ఖర్చులు కూడా తడిసి మోపెడవుతుంటాయి. సర్జరీ తర్వాత కేవలం ఇంజక్షన్లు, డ్రెస్సింగ్, ఫిజియో థెరపీ కోసం రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చే రోగులకు హోమ్ కేర్ సర్వీసులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగులకు మాత్రమే ఈ సేవలు అందిస్తున్నాం. భవిష్యత్తులో ఇతర రోగులకు ఈ సేవలను విస్తరింపజేస్తాం.
– డాక్టర్ బి.సుధాకర్‌బాబు, క్లినిక్ సర్వీస్ అండ్ పాపులేషన్ హెల్త్ హెడ్
Comments
Please login to add a commentAdd a comment