ventilator support
-
సీతారాం ఏచూరి పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స
న్యూఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. శ్వాస సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగిస్తున్నా, గురువారం ఆయన ఆరోగ్యం మరింత తీవ్రంగా క్షీణించింది. ఇబ్బందికర పరిస్థితి ఎదురుకావడంతో వైద్యులు ఆయనకు ఐసీయూకి తరలించారు. తొలుత ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసుకుని చికిత్స అందించారు. అనంతరం ఐసీయూలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. -
లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం!
ముంబై: సుప్రసిద్ధ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆమె ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు వైద్యుడొకరు శనివారం చెప్పారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ ఆరోగ్యం చాలావరకు క్షీణించినట్లు సమాచారం. ఆమెకు కరోనా సోకడంతో స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. దీంతో జనవరి 8న బ్రీచ్‌క్యాండీ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేరారు. డాక్టర్ ప్రతీత్ సందానీ, ఆయన బృందం లతకు చికిత్స అందిస్తోంది. చికిత్సకు లతా దీదీ చక్కగా స్పందిస్తున్నారని, వెంటిలేటర్‌పై ఉన్నారని శనివారం ఆసుపత్రి బయట సందానీ మీడియాతో చెప్పారు. అంతకుముందు ఉదయం మాట్లాడుతూ.. లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. జనవరి 29న మాట్లాడినప్పుడు ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, వెంటిలేటర్ తొలగించామని, ఐసీయూలోనే మరికొంత కాలం పరిశీలనలో ఉంచుతామని అన్నారు. 2019 నవంబర్‌లో లతా మంగేష్కర్‌కు శ్వాస సంబంధిత సమస్య తలెత్తింది. బ్రీచ్‌క్యాండీలో ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియా సోకినట్లు తేలింది. 28 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. 1942లో కేవలం 13 ఏళ్ల వయసులో గాయనిగా జీవనం ఆరంభించిన లతా మంగేష్కర్ వివిధ భారతీయ భాషల్లో 30,000కు పైగా పాటలు పాడారు. ‘మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియా’గా కీర్తి ప్రతిష్టలు పొందారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నతోపాటు సినీ రంగంలో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు. -
Chris Cairns: కోలుకుంటున్న మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్
సిడ్నీ: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ కోలుకుంటున్నాడు. ఆరోటిక్ డిసెక్షన్‌తో బాధపడుతున్న కెయిన్స్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్న కెయిన్స్ ప్రస్తుతం కోలుకుంటున్నట్లు కుటుంబసభ్యలు పేర్కొన్నారు. ప్రస్తుతం కెయిన్స్‌కు వెంటిలేటర్‌ను తొలగించామని.. త్వరలోనే రూంకు తరలిస్తామని వైద్యులు తెలిపారు. కాగా 51 ఏళ్ల క్రిస్ కెయిన్స్ అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్లో కెయిన్స్ కివీస్ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు , 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు పడగొట్టాడు. టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. చదవండి: Chris Cairns: వెంటిలేటర్‌పై న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ -
ఆక్సిజన్ సపోర్టు అవసరాన్ని గుర్తించే సాఫ్ట్వేర్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారినపడిన బాధితుల్లో వెంటిలేటర్ సపోర్టు అవసరమైన వారిని గుర్తించేందుకు కోవిడ్ సీవియారిటీ స్కోర్ (సీఎస్ఎస్) పేరిట కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ఎమర్జెన్సీ కేసులు, ఐసీయూ సేవలు అవసరమైన వారిని ఈ సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించవచ్చని పేర్కొంది. ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అవసరం లేని కోవిడ్ బాధితులను ముందే గుర్తించవచ్చు. దీంతో అవసరమైన వారికి పడకలు అందుబాటులోకి వస్తాయని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తెలియజేసింది. బాధితుల్లో కనిపిస్తున్న లక్షణాలు, ఇతర ఆనవాళ్లు, వారి ఆరోగ్య చరిత్ర ఆధారంగా సీఎస్ఎస్ సాఫ్ట్వేర్ ఫలితాన్ని తేలుస్తుందని పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌ను కోల్‌కతాలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్ పరిధిలోని సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇక్కడ చదవండి: డెల్టా స్ట్రెయిన్ ఎంత ప్రమాదకరమంటే...! -
దేశంలో రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత నిర్లక్ష్యం వల్ల రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం చూపే అవకాశం ఉందని, ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓ కరోనా వైద్యుడి అవతారమెత్తి వైరస్‌పై పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టిషా) అధ్యక్షుడు డాక్టర్ భాస్కర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం వర్చువల్‌గా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాపై అవగాహన పెంచుకొని స్వీయ జాగ్రత్తలు పాటించడంతోపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ముందే తెలుసుకోవాలన్నారు. తద్వారా ఆరోగ్యం క్షీణించకుండా జాగ్రత్తపడటంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి సేవలు అవసరం లేకుండా చూసుకోవచ్చన్నారు. ఇందుకోసం పల్స్‌రేటు, ఆక్సిజన్ శాచురేషన్, హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రతలు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కరోనా బీమా తప్పనిసరి... ‘దేశంలో వైరస్ మ్యుటేషన్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో విస్తరణ చాలా వేగంగా ఉంది. బాధితుల్లో వైరస్ లోడ్ కూడా ఎక్కువగా ఉంటోంది. చికిత్స అందించినా కోలుకొనేందుకు చాలా రోజులు పడుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆస్పత్రులు, వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, ఆక్సిజన్, మందులు లేకపోవడంతో సమస్య తీవ్రమవుతోంది. ఇప్పటికే అనేక మంది వైద్యులు కూడా వైరస్ బారినపడ్డారు. వైద్యసేవల్లో అలసిపోయారు. వైరస్ బారిన పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు భారంగా మారకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా ‘కరోనా కవచ్’బీమా పాలసీ తీసుకోవాలి’అని డాక్టర్ భాస్కర్‌రావు సూచించారు. అవసరం లేకున్నా ఆస్పత్రుల్లోనే... కొందరు బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకొనే అవకాశం ఉన్నా భయంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారని డాక్టర్ భాస్కర్‌రావు పేర్కొన్నారు. అలాగే చాలా మంది బాధితులు అవసరం లేకున్నా రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కోసం వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. వైద్యులు నచ్చజెప్పినా డిశ్చార్జికి నిరాకరిస్తూ రోజుల తరబడి ఆస్పత్రుల్లోనే ఉండిపోతున్నారు. ఫలితంగా పడకలు, మందులు, ఆక్సిజన్ కొరత ఏర్పడుతోందన్నారు. వారి వల్లే ఆక్సిజన్ కొరత... ప్రస్తుతం ఒక్క కిమ్స్‌లోనే 500 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా వారిలో 240 మంది ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేకున్నా ప్రముఖులతో ఫోన్లు చేయించి బలవంతంగా ఆస్పత్రిలోనే ఉన్నట్లు డాక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. గతంలో ఆ ఆస్పత్రిలో 40 వెంటిలేటర్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్యను 200 పెంచినా ఆక్సిజన్ అవసరాలు రెట్టింపయ్యాయన్నారు. గతంలో 3 రోజులకు ఒకసారి 20 కేఎల్ ట్యాంక్‌ను నింపే పరిస్థితి ఉండగా ప్రస్తుతం 24 గంటలకు ఒకసారి ఆక్సిజన్ నింపాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఒక్కసారిగా ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో ఆస్పత్రి యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడుతున్నాయన్నారు. ప్రతి ఇల్లూ ఓ ఆక్సిజన్ ప్లాంట్ కావాలి.. భవిష్యత్తులో ఆక్సిజన్ అవసరాల దృష్ట్యా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న హోటళ్లు, అపార్ట్మెంట్లు, ఇతర నివాస ప్రదేశాల్లో సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్‌ను ముందే ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరోనా వంటి విపత్తులను సులభంగా జయించే అవకాశం ఉందని డాక్టర్ భాస్కర్‌రావు అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఆస్పత్రులపై ఒత్తిడి కూడా తగ్గించొచ్చని, ఇందుకు ఒక్కో ఇంటికి రూ. 40 వేలకు మించి ఖర్చు కాదన్నారు. భయాన్ని వీడినప్పుడే భరోసా... ప్రస్తుతం వెలుగు చూస్తున్న కరోనా మరణాలకు బాధితుల్లో నెలకొన్న భయమే ఎక్కువ కారణమవుతోందని డాక్టర్ భాస్కర్‌రావు చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారితోపాటు ఆస్పత్రుల్లో చేరిన వారు రోజంతా మంచంపై పడుకొని ఆందోళన చెందేకంటే ఓ గంటపాటు పక్కన ఉన్న రోగులతో కలసి మాట్లాడటం, ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడం వల్ల మనోధైర్యం పొందొచ్చని, తద్వారా వైరస్ నుంచి త్వరగా బయటపడొచ్చని ఆయన సూచించారు. భయాన్ని వీడినప్పుడే బతుకుపై భరోసా ఏర్పడుతుందన్నారు. అవసరంలేకున్నా రెమిడెసివిర్ వాడకం ప్రమాదకరం.. కరోనా కేసులను స్వల్ప, మధ్యస్త, తీవ్రమైనవిగా విభజించారని, స్వల్ప లక్షణాలు ఉండేవారు హోం ఐసోలేషన్‌లోనే ఉండి వైరస్ నుంచి కోలుకోవచ్చని డాక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. ఇందు కు ఆక్సీమీటర్‌తో ప్రతి 3 గంటలకు ఒకసారి ఆక్సి జన్ శాతాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. ఆక్సిజన్ స్థాయిలు 94 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడే ఆస్పత్రిలో చేరి వైద్యుడి పర్యవేక్షణలో మందులు, ఆక్సిజన్ వాడాల్సి ఉంటుందన్నారు. కానీ చాలా మంది బాధితులు అవ సరం లేకున్నా స్టెరాయిడ్స్‌తోపాటు రెమిడెసివిర్ ఇంజక్షన్ల కోసం వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది వారి ఆరోగ్యానికే ప్రమాదకరమని ఆయన చెప్పారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుందని తప్ప బాధితులు కోరినట్లు కాదన్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ప్రతి 100 మందిలో ఐదారుగురికి మించి వైద్యులు రెమిడెసివిర్ ఇంజక్షన్లను వాడట్లేదని, కానీ తెలంగాణలో ఆస్పత్రుల్లో చేరిన వారందరికీ వైద్యులు వాటిని ఇస్తున్నారన్నారు. దీనివల్ల రోగుల ఆరోగ్యానికి చాలా ప్రమాదం జరుగుతుందని, మందులు పనిచేయకుండా పోవడంతోపాటు భవిష్యత్తులో ఇతర అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. -
వెంటిలేటర్ మీదికి వెళ్తే ఇక బతకరా.. ఎంతవరకు నిజం?
వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్ ఇక బతకరనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే జబ్బు తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, చాలా సందర్భాల్లో రోగి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్ మీద పెడతారు. ఇటీవల కరోనా ప్యాండమిక్ స్వైరవిహారం చేస్తున్న తరుణంలోనూ చాలామంది వెంటిలేటర్‌పైకి వెళ్తున్నారు. కోమార్బిడ్ కండిషన్స్‌తో ఉన్నవారు కరోనా వైరస్ కారణంగా వెంటిలేటర్ మీదికి వెళ్లాక కొందరు మృత్యువాతపడుతుండటంతో సాధారణ ప్రజల్లో ఈ దురభిప్రాయం మరింత బలంగా మారింది. నిజానికి ఇప్పుడున్న వైద్య పరిజ్ఞానం వల్ల అనేక వ్యాధులకు చాలా ఆధునిక చికిత్సలు అందుతున్నందున వెంటిలేటర్ మీద పెట్టినవాళ్లూ బతికేందుకూ, మళ్లీ నార్మల్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. కరోనా వ్యాధిగ్రస్తుల్లోనూ చాలామంది వెంటిలేటర్ మీద వెళ్లాక కూడా బతుకుతున్నారు. వెంటిలేటర్ అనేది కృత్రికంగా శ్వాస అందించే యంత్రం. దీన్ని పెట్టడానికి ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టం వేసి, దాన్ని కృత్రిమ శ్వాస అందించే వెంటిలేటర్‌తో అనుసంధానం చేస్తారు. రక్తంలో ఆక్సిజన్ పాళ్లు తక్కువగా ఉండటం, కార్బన్ డై ఆక్సైడ్ పాళ్లు పెరుగుతున్నా, రోగికి ఆయాసం పెరుగుతున్నా, ఊపిరితీసుకోవడానికి అవసరమైన కండరాలు పనిచేయకపోయినా వెంటిలేటర్ అమర్చుతారు. సాధారణంగా నిమోనియా, సీవోపీడీ వంటి వ్యాధులకూ, రక్తానికి ఇన్ఫెక్షన్ పాకే సెప్సిస్ వంటి కండిషన్లలో వెంటిలేటర్ పెడుతుంటారు. ఇటీవల కరోనా కారణంగా ఊపిరి అందని పరిస్థితి వచ్చిన సందర్భాల్లోనూ రోగిని వెంటిలేటర్‌పై ఉంచడం సాధారణంగా జరుగుతోంది. ఒకసారి వెంటిలేటర్ పెట్టిన తర్వాత... పరిస్థితి మెరగయ్యే వరకూ వెంటిలేటర్ తీయడం కష్టం కావచ్చు. సాధారణంగా ఐదు కంటే ఎక్కువ రోజులు వెంటిలేటర్ పెట్టడం అవసరమైతే ట్రకియాస్టమీ చేస్తారు. దీనివల్ల స్వరపేటికకు నష్టం వాటిల్లదు. వెంటిలేటర్‌ను త్వరగా తొలగించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల అవసరమనుకుంటే ఎలాంటి ప్రమాదమూ లేకుండా వెంటిలేటర్ మళ్లీ పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవల మన వద్ద కూడా పాశ్చాత్య దేశాల్లో ఉన్నంత వైద్యపరిజ్ఞానం, ఉపకరణాలు అందుబాటులోకి ఉన్నాయి. కానీ వైద్యపరమైన అంశాలలో మనలో చాలామందికి తగినంత అవగాహన లేకపోవడం వల్ల అపోహలు రాజ్యమేలుతున్నాయి. ఆ అపోహలను తొలగించుకంటే... వెంటిలేటర్‌పైకి వెళ్లినప్పటికీ... ఆ చికిత్స తర్వాత బతికేవాళ్లే ఎక్కువనే వాస్తవం తెలిసివస్తుంది. -
దర్శకుడి బ్రెయిన్ డెడ్
కోయంబత్తూరు: సెట్స్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు నారానీపుజ షానవాస్ హఠాత్తుగా కుప్పకూలారు. దీంతో వెంటనే అతడిని కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్లు బంధువులు తెలిపారు. కాగా షానవాస్ ప్రస్తుతం 'గంధీరాజన్' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన పాలక్కడ్‌లోని ఆటపదిలో వేసిన సెట్స్‌లో చిత్రీకరణ జరుపుతుండగా గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో వెంటనే ఆయనను అత్యవసర చికిత్స కోసం కోయంబత్తూరులోని కేజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి అతడి పరిస్థితి విషమంగా ఉంది. నేడు ఉదయం అతడిని మరోసారి పరీశిలించిన డాక్టర్లు అతడికి బ్రెయిన్ డెడ్ అయినట్లు వెల్లడించారు. (చదవండి: సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్ స్టార్ కడుతూ) ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ నిర్మాత విజయ్ బాబు ట్వీట్ చేశారు. షానవాస్ ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఉన్నట్లు తెలిపారు. అతడి గుండె ఇంకా కొట్టుకుంటోందన్నారు. ఏదైనా మిరాకిల్ జరిగి ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్ చేశారు. కాగా 2015లో 'కేరీ' సినిమాతో షానవాస్ దర్శకుడిగా పరిచయమయ్యారు. తర్వాత అదితి రావు హైదరీ, జయసూర్య, దేవ్ మోహన్ నటీనటులుగా 'సూఫియమ్ సుజాతయుమ్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. (చదవండి: మరీ అంత డర్టీ కాదు!) -
విషమంగా మాజీ క్రికెటర్ ఆరోగ్యం
లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రి, మాజీ టీమిండియా క్రికెటర్ చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. కిడ్ని సమస్యతో పోరాడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. చేతన్ చౌహాన్ జూలైలో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ని లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో మెదంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ చికిత్స పొందుతున్న ఆయనకి కిడ్నీ, బీపీ సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్‌పై ఆత్యవసర చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. (కోవిడ్ లెక్కలు చెప్పే అగర్వాల్‌కు కరోనా) రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన చేతన్ చౌహాన్ కరోనా బారిన పడిన అంతర్జాతీయ మాజీ క్రికెట్ క్రీడాకారుల్లో ఒకరు. చేతన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన కుటుంబసభ్యులు జూలైలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, హోం క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ప్రస్తుతం చౌహాన్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. 1969-1978 మధ్య కాలంలో ఆయన 40 టెస్టులు ఆడి 31.57 సగటుతో 2084 పరుగులు చేశారు. 97 పరుగుల అత్యధిక స్కోరు కలిగి ఉన్నారు. ఏడు వన్డేలు ఆడిన చౌహాన్ 153 పరుగులు చేశారు. (దేశ భద్రతలో మరో కీలక ఆవిష్కరణ) -
వెంటిలేటర్‌పై మధ్యప్రదేశ్ గవర్నర్
భోపాల్ : మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను లక్నోలోని మెదంటా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉన్నట్లు భోపాల్‌లోని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయం సరిగా పనిచేయకపోవడంతో లాల్జీ ఆరోగ్యం మరింత విషమంగా మారిందని మెదంటా హాస్పిటల్ డాక్టర్ రాకేశ్ కపూర్ తెలిపారు. లాల్జీ ఆరోగ్యం విషమంగా ఉందని ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. 10 రోజుల పాటు స్వస్థలంలో గడిపేందుకు జూన్ 9న లక్నోకు లాల్జీ టాండన్ వెళ్లారు. తీవ్ర అనారోగ్యంతో జూన్ 11న లక్నోలోని మెదంటా ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స అందించగా కొన్ని రోజుల క్రితమే లాల్జీ ఆరోగ్యం మెరుగుపడి డిశ్చార్జ్ అయ్యారు. మరోసారి ఆయన ఆరోగ్యం విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాల్జీ టాండన్ ఆరోగ్యం క్షీణించడంతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్‌కు అదనంగా మధ్యప్రదేశ్ గవర్నర్ బాధ్యతలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అప్పగించిన సంగతి తెలిసిందే. (లాక్డౌన్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు) -
ఇంట్లోనే...ఐ'సీ'యూ
సాక్షి,హైదరాబాద్: ఇప్పటివరకూ ఫిజియో థెరపీ, మందుల హోమ్ డెలీవరీ, రక్త, మూత్ర పరీక్షలు వంటి సేవలు మాత్రమే అందుతుండగా, తాజాగా కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ యాజమాన్యం ‘కేర్ ఎట్ హోమ్’పేరుతో రోగి ఇంట్లోకే ఐసీయూ సర్వీసులను తీసుకొచ్చింది. సర్జరీ తర్వాత ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చిన రోగులతో పాటు దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడుతూ రోజుల తరబడి ఐసీయూలో ఉండాల్సి వచ్చే కేన్సర్, పక్షవాతం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, న్యుమోనియా, ఆస్తమా సంబంధిత రోగులకు వారి బంధువుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన వైద్యసేవలు అందించనుంది. దీంతో ఆస్పత్రి ఖర్చులు తగ్గడంతో పాటు రోగి త్వరగా కోలుకునే అవకాశమూ ఉంది. ఖర్చు తక్కువ..ఫలితమెక్కువ కేన్సర్, పక్షవాతం సహా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి రోగాల బారిన పడ్డవారికి ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో వైద్యసేవలు అందించాల్సి వస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రిలో రోజు సగటు ఐసీయూ చార్జీ రూ.50 వేలకుపైనే. అదే హోమ్ ఐసీయూ సర్వీసులో రూ.10 వేలకు మించదు. పోస్ట్ ఆపరేటివ్ ఖర్చులు రోజుకు రూ.30 వేల వరకు అయితే ఇంట్లో రూ.5 వేలలోపే. అదే బెడ్‌సైడ్ సర్వీసులకైతే రూ.2 వేలకు మించదని కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ ప్రకటించింది. రోగిని రోజుల తరబడి ఐసీయూలో ఉంచాల్సి వస్తుండటం, ఈ వైద్య ఖర్చులు బంధువులకు భారంగా మారు తున్నాయి. ఇదే సమయంలో ఆస్పత్రి ఐసీయూ పడకలు ఖాళీగా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు బెడ్స్ సమకూర్చలేని పరిస్థితి తలెత్తుతుంది. పది నుంచి పదిహేను పడకలతో నెలకొల్పిన ఐసీయూలో రకరకాల బాధితులకు చికిత్సలు అందించాల్సి వస్తుండటం, ఒక్కో సారి ఎవరైనా చనిపోతే, బంధువుల ఆర్తనాదాలు విని పక్కనే ఉన్న వారు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. ఐసీయూలో రకరకాల బాధితులు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఒక రోగి ఇన్ఫెక్షన్ మరో రోగికి సోకుతుండటం వల్ల దాన్ని నియంత్రించడానికి అనివార్యంగానే యాంటి బయాటిక్ మందుల్ని ఎక్కువ మోతాదులో వాడాల్సి వస్తుంది. దీంతో రోగి కోలుకోక పోగా ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అదే సర్జరీ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, ఇంట్లోని బంధువుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యసేవలు అందించడం వల్ల రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఆపదలో వచ్చిన వారికి సత్వరమే ఐసీయూ సేవలు అందించవచ్చు. ఎలాంటి సేవలు అందిస్తారు? రోజుల తరబడి ఐసీయూ చికిత్సలు అవసరమైన రోగులకు హోమ్ ఐసీయూ సర్వీసులను అందిస్తున్నారు. రోగి డిశ్చార్జ్‌కి ముందే ఆస్పత్రి బయోమెడికల్ ఇంజనీర్ రోగి ఇంటిని పరిశీలిస్తారు. ఇంట్లో ఆస్పత్రి ఐసీయూకు కావాల్సిన వాతావరణం ఉన్నట్లు నిర్ధారించుకుని గాలి, వెలుతురు ఉన్న ప్రదేశాన్ని ఇందుకు ఎంపిక చేస్తారు. రోగి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని హోమ్ ఐసీయూకు కావాల్సిన వెంటిలేటర్, ఆక్సిజన్, సీపీఏపీఎస్, బైలెవల్ ప్యాప్, సక్షన్ అండ్ ఎయిర్ ఫర్ ఫియర్, మల్టీపారా మానిటర్, బ్యాక్‌రెస్ట్ కాట్, ఐసీయూ బెడ్–3,5 ఫంక్షన్ మోటరైజ్డ్, తదితర మెడికల్ ఎక్విప్మెంట్స్ను రోజువారీ అద్దె ప్రాతిపాదికన సరఫరా చేస్తారు. ఎప్పటికప్పుడు రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఒక వైద్యుడితో పాటు సీనియర్ నర్సు, ఫిజియో థెరపిస్ట్, అటెండర్‌ను ఇంటికి పంపుతారు. అవసరమైతే స్పెషాలిటీ వైద్యుడు సైతం ఇంటికి వస్తాడు. మందులతో పాటు సాధారణ వైద్య పరీక్షలు సైతం ఇంటి నుంచే అందిస్తారు. ఒక వేళ రోగి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లయితే రోగికి అమర్చిన మల్టీపారామానిటర్ కేర్ ఎట్ హోమ్ కాల్ సెంటర్‌కు ఇండికేషన్స్ ఇస్తుంది. వెంటనే వైద్యులు అప్రమత్తం అవుతారు. హోమ్ కేర్‌తో సత్ఫలితాలు ప్రస్తుతం నగరంలో పలు రకాల హోమ్ సర్వీసులు ఉన్నప్పటికీ.. డిశ్చార్జ్ తర్వాత రోగి ఇంటికి కన్సల్టెంట్‌ను పంపిన దాఖలాలు లేవు. చాలా మందికి సర్జరీ తర్వాత అనివార్యమైతే తప్ప ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉండదు. చిన్నచిన్న వాటి కోసం రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సి రావడం వల్ల రోగులు హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్కు గురవుతుంటారు. నాలుగు రోజుల్లో కోలు కోవాల్సిన రోగి పది రోజులైనా ఆరోగ్యం మెరుగుపడదు. ఆస్పత్రి ఖర్చులు కూడా తడిసి మోపెడవుతుంటాయి. సర్జరీ తర్వాత కేవలం ఇంజక్షన్లు, డ్రెస్సింగ్, ఫిజియో థెరపీ కోసం రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చే రోగులకు హోమ్ కేర్ సర్వీసులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగులకు మాత్రమే ఈ సేవలు అందిస్తున్నాం. భవిష్యత్తులో ఇతర రోగులకు ఈ సేవలను విస్తరింపజేస్తాం. – డాక్టర్ బి.సుధాకర్‌బాబు, క్లినిక్ సర్వీస్ అండ్ పాపులేషన్ హెల్త్ హెడ్ -
వెంటిలేటర్‌పై సోమ్‌నాథ్ చటర్జీ
కోల్‌కతా: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లోక్‌సభ మాజీ స్పీకర్ సోమ్‌నాథ్ చటర్జీ(89)ని వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గత నెల ఛటర్జీకి మెదడులో రక్తస్రావం కావడంతో వైద్యశాలలో చేర్పించారు. చాలా రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకుంటున్నట్లుగా కనిపించడంతో గత వారమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసి పంపారు. మళ్లీ మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో ఆయనను మూడు రోజులకే తిరిగి ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. ‘ఆయనకు డయాలసిస్ చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడప్పుడు గుండె సహకరించదు. దీంతో ఆయనకు ఆదివారం ఉదయం చిన్నగా గుండెపోటు వచ్చింది. ఇప్పుడు ఫరవాలేదు. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం’ అని వైద్యులు చెప్పారు. 1968లో సీపీఎంలో చేరిన చటర్జీ పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో యూపీఏ ప్రభుత్వానికి సీపీఎం మద్దతు ఉపసంహరించినప్పటికీ ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోకపోవడంతో పార్టీ నుంచి ఆయన బహిష్కరణకు గురయ్యారు. -
అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే.. లేచి కూర్చున్నాడు!
చనిపోయారు అనుకున్నవాళ్లు చిట్ట చివరి నిమిషంలో బతికి బయటపడటం చాలా అరుదుగా జరుగుతుంది. కర్ణాటకలోని ధార్వాడ్ ప్రాంతంలో సరిగ్గా ఇలాగే జరిగింది. 17 ఏళ్ల యువకుడు మరణించాడనుకుని అతడి బంధువులు అంత్యక్రియలకు తీసుకెళ్లసాగారు. దారిలో ఉన్నట్టుండి ఆ యువకుడు లేచాడు. దాంతో మనగుండి గ్రామంలోని అతడి బంధువులు, ఇతర గ్రామస్తులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దాదాపు నెల రోజుల క్రితం వీధికుక్క కరవడంతో కుమార్ మారేవాడ్ (17)కు తీవ్రంగా జ్వరం వచ్చింది. అతడిని ధార్వాడ్ లోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అతడి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై పెట్టారు. అతడి పరిస్థితి బాగా విషమంగా ఉందని, వెంటిలేటర్ తీస్తే ఇక బతకడని వైద్యులు చెప్పారు. అతడి శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించిందని, ఇక ఏం చేయాలో మీరే నిర్ణయించుకోవాలని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు. దాంతో.. వాళ్లు ఇక అతడిని ఇంటికి తీసుకెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇంటికి తీసుకెళ్లిన కాసేపటికే అతడికి శ్వాస ఆడకపోవడం, శరీరకంలో కదలికలు కూడా ఏమీ లేకపోవడంతో.. అతడు మరణించాడనే బంధువులంతా భావించారు. అతడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అంతిమయాత్ర కూడా మొదలైపోయింది. మరొక్క రెండు కిలోమీటర్లు వెళ్తే శ్మశానానికి చేరుకుంటారనగా.. ఉన్నట్టుండి కుమార్ లేచాడు. అతడి చేతులు, కాళ్లు కదిలిస్తూ ఊపిరి కూడా పీల్చుకున్నాడు. వెంటనే అతడిని గోకుల్రోడ్డులోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడు మెనింగోఎన్సెఫలైటిస్తో బాధపడుతున్నట్లు భావిస్తున్నామని, కుక్క కాటు వల్ల ఆ తరహా ఇన్ఫెక్షన్ వస్తుందని డాక్టర్ మహేష్ నీలకంఠంవార్ తెలిపారు. రోజు కూలీలుగా పనిచేస్తున్న కుమార్ తల్లిదండ్రులు నింగప్ప, మంజుల మాత్రం.. అతడి చికిత్సకు అయ్యే ఖర్చు భరించలేకపోతున్నామని, ఏం చేయాలో అర్థం కావట్లేదని వాపోతున్నారు.