దేశంలో రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం | Dr Bhaskar Rao Spoke On Corona Conditions In Coming Days | Sakshi
Sakshi News home page

దేశంలో రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం

Published Tue, Apr 27 2021 1:50 AM | Last Updated on Tue, Apr 27 2021 9:31 AM

Dr Bhaskar Rao Spoke On Corona Conditions In Coming Days - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: వ్యక్తిగత నిర్లక్ష్యం వల్ల రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం చూపే అవకాశం ఉందని, ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓ కరోనా వైద్యుడి అవతారమెత్తి వైరస్‌పై పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ (టిషా) అధ్యక్షుడు డాక్టర్‌ భాస్కర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం వర్చువల్‌గా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కరోనాపై అవగాహన పెంచుకొని స్వీయ జాగ్రత్తలు పాటించడంతోపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ముందే తెలుసుకోవాలన్నారు. తద్వారా ఆరోగ్యం క్షీణించకుండా జాగ్రత్తపడటంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి సేవలు అవసరం లేకుండా చూసుకోవచ్చన్నారు. ఇందుకోసం పల్స్‌రేటు, ఆక్సిజన్‌ శాచురేషన్, హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రతలు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

కరోనా బీమా తప్పనిసరి... 
‘దేశంలో వైరస్‌ మ్యుటేషన్‌ ఎక్కువగా ఉంది. ఫస్ట్‌ వేవ్‌తో పోలిస్తే సెకండ్‌ వేవ్‌లో విస్తరణ చాలా వేగంగా ఉంది. బాధితుల్లో వైరస్‌ లోడ్‌ కూడా ఎక్కువగా ఉంటోంది. చికిత్స అందించినా కోలుకొనేందుకు చాలా రోజులు పడుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆస్పత్రులు, వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, ఆక్సిజన్, మందులు లేకపోవడంతో సమస్య తీవ్రమవుతోంది. ఇప్పటికే అనేక మంది వైద్యులు కూడా వైరస్‌ బారినపడ్డారు. వైద్యసేవల్లో అలసిపోయారు. వైరస్‌ బారిన పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు భారంగా మారకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా ‘కరోనా కవచ్‌’బీమా పాలసీ తీసుకోవాలి’అని డాక్టర్‌ భాస్కర్‌రావు సూచించారు. 

అవసరం లేకున్నా ఆస్పత్రుల్లోనే... 
కొందరు బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకొనే అవకాశం ఉన్నా భయంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారని డాక్టర్‌ భాస్కర్‌రావు పేర్కొన్నారు. అలాగే చాలా మంది బాధితులు అవసరం లేకున్నా రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కోసం వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. వైద్యులు నచ్చజెప్పినా డిశ్చార్జికి నిరాకరిస్తూ రోజుల తరబడి ఆస్పత్రుల్లోనే ఉండిపోతున్నారు. ఫలితంగా పడకలు, మందులు, ఆక్సిజన్‌ కొరత ఏర్పడుతోందన్నారు. 

వారి వల్లే ఆక్సిజన్‌ కొరత... 
ప్రస్తుతం ఒక్క కిమ్స్‌లోనే 500 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా వారిలో 240 మంది ఆక్సిజన్‌ సపోర్ట్‌ అవసరం లేకున్నా ప్రముఖులతో ఫోన్లు చేయించి బలవంతంగా ఆస్పత్రిలోనే ఉన్నట్లు డాక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు. గతంలో ఆ ఆస్పత్రిలో 40 వెంటిలేటర్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్యను 200 పెంచినా ఆక్సిజన్‌ అవసరాలు రెట్టింపయ్యాయన్నారు. గతంలో 3 రోజులకు ఒకసారి 20 కేఎల్‌ ట్యాంక్‌ను నింపే పరిస్థితి ఉండగా ప్రస్తుతం 24 గంటలకు ఒకసారి ఆక్సిజన్‌ నింపాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఒక్కసారిగా ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరగడంతో ఆస్పత్రి యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడుతున్నాయన్నారు.  

ప్రతి ఇల్లూ ఓ ఆక్సిజన్‌ ప్లాంట్‌ కావాలి.. 
భవిష్యత్తులో ఆక్సిజన్‌ అవసరాల దృష్ట్యా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న హోటళ్లు, అపార్ట్‌మెంట్లు, ఇతర నివాస ప్రదేశాల్లో సెంట్రల్‌ ఆక్సిజన్‌ సిస్టమ్‌ను ముందే ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరోనా వంటి విపత్తులను సులభంగా జయించే అవకాశం ఉందని డాక్టర్‌ భాస్కర్‌రావు అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఆస్పత్రులపై ఒత్తిడి కూడా తగ్గించొచ్చని, ఇందుకు ఒక్కో ఇంటికి రూ. 40 వేలకు మించి ఖర్చు కాదన్నారు. 

భయాన్ని వీడినప్పుడే భరోసా... 
ప్రస్తుతం వెలుగు చూస్తున్న కరోనా మరణాలకు బాధితుల్లో నెలకొన్న భయమే ఎక్కువ కారణమవుతోందని డాక్టర్‌ భాస్కర్‌రావు చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారితోపాటు ఆస్పత్రుల్లో చేరిన వారు రోజంతా మంచంపై పడుకొని ఆందోళన చెందేకంటే ఓ గంటపాటు పక్కన ఉన్న రోగులతో కలసి మాట్లాడటం, ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడం వల్ల మనోధైర్యం పొందొచ్చని, తద్వారా వైరస్‌ నుంచి త్వరగా బయటపడొచ్చని ఆయన సూచించారు. భయాన్ని వీడినప్పుడే బతుకుపై భరోసా ఏర్పడుతుందన్నారు. 

అవసరంలేకున్నా రెమిడెసివిర్‌ వాడకం ప్రమాదకరం.. 
కరోనా కేసులను స్వల్ప, మధ్యస్త, తీవ్రమైనవిగా విభజించారని, స్వల్ప లక్షణాలు ఉండేవారు హోం ఐసోలేషన్‌లోనే ఉండి వైరస్‌ నుంచి కోలుకోవచ్చని డాక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు. ఇందు కు ఆక్సీమీటర్‌తో ప్రతి 3 గంటలకు ఒకసారి ఆక్సి జన్‌ శాతాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. ఆక్సిజన్‌ స్థాయిలు 94 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడే ఆస్పత్రిలో చేరి వైద్యుడి పర్యవేక్షణలో మందులు, ఆక్సిజన్‌ వాడాల్సి ఉంటుందన్నారు. కానీ చాలా మంది బాధితులు అవ సరం లేకున్నా స్టెరాయిడ్స్‌తోపాటు రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కోసం వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది వారి ఆరోగ్యానికే ప్రమాదకరమని ఆయన చెప్పారు.

ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారమే వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుందని తప్ప బాధితులు కోరినట్లు కాదన్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ప్రతి 100 మందిలో ఐదారుగురికి మించి వైద్యులు రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను వాడట్లేదని, కానీ తెలంగాణలో ఆస్పత్రుల్లో చేరిన వారందరికీ వైద్యులు వాటిని ఇస్తున్నారన్నారు. దీనివల్ల రోగుల ఆరోగ్యానికి చాలా ప్రమాదం జరుగుతుందని, మందులు పనిచేయకుండా పోవడంతోపాటు భవిష్యత్తులో ఇతర అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement