dr bhaskar rao
-
దేశంలో రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత నిర్లక్ష్యం వల్ల రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం చూపే అవకాశం ఉందని, ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓ కరోనా వైద్యుడి అవతారమెత్తి వైరస్‌పై పోరాడాల్సిన అవసరం ఉందని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (టిషా) అధ్యక్షుడు డాక్టర్ భాస్కర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం వర్చువల్‌గా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాపై అవగాహన పెంచుకొని స్వీయ జాగ్రత్తలు పాటించడంతోపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ముందే తెలుసుకోవాలన్నారు. తద్వారా ఆరోగ్యం క్షీణించకుండా జాగ్రత్తపడటంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి సేవలు అవసరం లేకుండా చూసుకోవచ్చన్నారు. ఇందుకోసం పల్స్‌రేటు, ఆక్సిజన్ శాచురేషన్, హృదయ స్పందన, శరీర ఉష్ణోగ్రతలు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కరోనా బీమా తప్పనిసరి... ‘దేశంలో వైరస్ మ్యుటేషన్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్‌లో విస్తరణ చాలా వేగంగా ఉంది. బాధితుల్లో వైరస్ లోడ్ కూడా ఎక్కువగా ఉంటోంది. చికిత్స అందించినా కోలుకొనేందుకు చాలా రోజులు పడుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఆస్పత్రులు, వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, ఆక్సిజన్, మందులు లేకపోవడంతో సమస్య తీవ్రమవుతోంది. ఇప్పటికే అనేక మంది వైద్యులు కూడా వైరస్ బారినపడ్డారు. వైద్యసేవల్లో అలసిపోయారు. వైరస్ బారిన పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు భారంగా మారకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధిగా ‘కరోనా కవచ్’బీమా పాలసీ తీసుకోవాలి’అని డాక్టర్ భాస్కర్‌రావు సూచించారు. అవసరం లేకున్నా ఆస్పత్రుల్లోనే... కొందరు బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉండి కోలుకొనే అవకాశం ఉన్నా భయంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారని డాక్టర్ భాస్కర్‌రావు పేర్కొన్నారు. అలాగే చాలా మంది బాధితులు అవసరం లేకున్నా రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కోసం వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన చెప్పారు. వైద్యులు నచ్చజెప్పినా డిశ్చార్జికి నిరాకరిస్తూ రోజుల తరబడి ఆస్పత్రుల్లోనే ఉండిపోతున్నారు. ఫలితంగా పడకలు, మందులు, ఆక్సిజన్ కొరత ఏర్పడుతోందన్నారు. వారి వల్లే ఆక్సిజన్ కొరత... ప్రస్తుతం ఒక్క కిమ్స్‌లోనే 500 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా వారిలో 240 మంది ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేకున్నా ప్రముఖులతో ఫోన్లు చేయించి బలవంతంగా ఆస్పత్రిలోనే ఉన్నట్లు డాక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. గతంలో ఆ ఆస్పత్రిలో 40 వెంటిలేటర్లు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్యను 200 పెంచినా ఆక్సిజన్ అవసరాలు రెట్టింపయ్యాయన్నారు. గతంలో 3 రోజులకు ఒకసారి 20 కేఎల్ ట్యాంక్‌ను నింపే పరిస్థితి ఉండగా ప్రస్తుతం 24 గంటలకు ఒకసారి ఆక్సిజన్ నింపాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పారు. ఒక్కసారిగా ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో ఆస్పత్రి యాజమాన్యాలు కూడా ఇబ్బంది పడుతున్నాయన్నారు. ప్రతి ఇల్లూ ఓ ఆక్సిజన్ ప్లాంట్ కావాలి.. భవిష్యత్తులో ఆక్సిజన్ అవసరాల దృష్ట్యా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న హోటళ్లు, అపార్ట్మెంట్లు, ఇతర నివాస ప్రదేశాల్లో సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్‌ను ముందే ఏర్పాటు చేసుకోవడం ద్వారా కరోనా వంటి విపత్తులను సులభంగా జయించే అవకాశం ఉందని డాక్టర్ భాస్కర్‌రావు అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఆస్పత్రులపై ఒత్తిడి కూడా తగ్గించొచ్చని, ఇందుకు ఒక్కో ఇంటికి రూ. 40 వేలకు మించి ఖర్చు కాదన్నారు. భయాన్ని వీడినప్పుడే భరోసా... ప్రస్తుతం వెలుగు చూస్తున్న కరోనా మరణాలకు బాధితుల్లో నెలకొన్న భయమే ఎక్కువ కారణమవుతోందని డాక్టర్ భాస్కర్‌రావు చెప్పారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారితోపాటు ఆస్పత్రుల్లో చేరిన వారు రోజంతా మంచంపై పడుకొని ఆందోళన చెందేకంటే ఓ గంటపాటు పక్కన ఉన్న రోగులతో కలసి మాట్లాడటం, ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడం వల్ల మనోధైర్యం పొందొచ్చని, తద్వారా వైరస్ నుంచి త్వరగా బయటపడొచ్చని ఆయన సూచించారు. భయాన్ని వీడినప్పుడే బతుకుపై భరోసా ఏర్పడుతుందన్నారు. అవసరంలేకున్నా రెమిడెసివిర్ వాడకం ప్రమాదకరం.. కరోనా కేసులను స్వల్ప, మధ్యస్త, తీవ్రమైనవిగా విభజించారని, స్వల్ప లక్షణాలు ఉండేవారు హోం ఐసోలేషన్‌లోనే ఉండి వైరస్ నుంచి కోలుకోవచ్చని డాక్టర్ భాస్కర్‌రావు తెలిపారు. ఇందు కు ఆక్సీమీటర్‌తో ప్రతి 3 గంటలకు ఒకసారి ఆక్సి జన్ శాతాన్ని పరీక్షించుకోవాలని సూచించారు. ఆక్సిజన్ స్థాయిలు 94 శాతం కంటే తక్కువకు పడిపోయినప్పుడే ఆస్పత్రిలో చేరి వైద్యుడి పర్యవేక్షణలో మందులు, ఆక్సిజన్ వాడాల్సి ఉంటుందన్నారు. కానీ చాలా మంది బాధితులు అవ సరం లేకున్నా స్టెరాయిడ్స్‌తోపాటు రెమిడెసివిర్ ఇంజక్షన్ల కోసం వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది వారి ఆరోగ్యానికే ప్రమాదకరమని ఆయన చెప్పారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుందని తప్ప బాధితులు కోరినట్లు కాదన్నారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో ప్రతి 100 మందిలో ఐదారుగురికి మించి వైద్యులు రెమిడెసివిర్ ఇంజక్షన్లను వాడట్లేదని, కానీ తెలంగాణలో ఆస్పత్రుల్లో చేరిన వారందరికీ వైద్యులు వాటిని ఇస్తున్నారన్నారు. దీనివల్ల రోగుల ఆరోగ్యానికి చాలా ప్రమాదం జరుగుతుందని, మందులు పనిచేయకుండా పోవడంతోపాటు భవిష్యత్తులో ఇతర అవయవాల పనితీరు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. -
మెరుగవుతున్న దాసరి ఆరోగ్యం
పరామర్శించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దర్శక నిర్మాత దాసరి నారాయణరావు కోలుకుంటున్నారు. అన్నవాహికకు ఇన్ ఫెక్షన్ సోకడంతో ఆయనను మూడు రోజుల కిందట సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితంతో పోలిస్తే బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడిందని, ఊహించిన దానికంటే ఎక్కువగా చికిత్సకు స్పందిస్తున్నట్లు కిమ్స్ ఎండీ, సీఈవో డాక్టర్ భాస్కర్‌రావు ప్రకటించారు. దాసరి త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మూత్ర పిండాల పనితీరు మెరుగుపడటంతో డయాలసిస్ నిలిపివేసినట్లు తెలిపారు. అయితే మరో 24 గంటలపాటు సమీక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నటుడు మోహన్ బాబు మాట్లాడుతూ.. క్లిష్టమైన ఆపరేషన్ ను కిమ్స్ వైద్యులు విజయవంతంగా చేశారని, దాసరి పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం షిర్డి వెళ్లి తన గురువు కోసం బాబాకు పూజలు చేసి వస్తానని చెప్పారు. ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూడా ఆస్పత్రికి వచ్చి దాసరి ఆరోగ్యంపై వాకబు చేశారు. వైఎస్ జగన్ పరామర్శ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు దాసరిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లా డి ధైర్యం చెప్పారు. అక్కడే ఉన్న మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులతో దాసరి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఆస్పత్రి ఎండీ భాస్కర్‌రావుతో మాట్లాడి ఎలాంటి వైద్యం అందిస్తున్నారు, ప్రస్తుత పరిస్థితి ఏమి టి, ఎన్ని రోజుల్లో కోలుకుంటారనే విషయా లను అడిగి తెలుసుకున్నారు. జగన్ వెంట వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, అధికార ప్రతినిధి అరుణ్ కుమార్, నాయకుడు కాసు మహేశ్‌రెడ్డి కూడా ఉన్నారు. దాసరి త్వరగా కోలుకోవాలి: పవన్ దాసరి నారాయణరావును సినీనటుడు పవన్ కల్యాణ్ పరామర్శించారు. బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వచ్చి దాసరి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అలాగే వైద్యులతో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాసరి పూర్తిగా కోలుకుంటారనే నమ్మకంతో వైద్యులు ఉన్నారని, గురువారం వెంటిలేటర్ తొలగిస్తామని చెప్పారని తెలిపారు. త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పవన్ తోపాటు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మత్ శరత్ తదితరులు ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కూడా దాసరి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. -
దర్శకుడు దాసరికి అస్వస్థత
అనారోగ్యంతో కిమ్స్‌లో చేరిన దాసరి నారాయణరావు అన్నవాహికతో పాటు కిడ్నీలు, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వెంటిలేటర్‌పై ఉంచి వైద్య సేవలు దాసరి ఆరోగ్యం నిలకడగానే ఉందని కిమ్స్ వైద్యుల వెల్లడి మంత్రి తలసాని, మోహన్‌బాబు సహా పలువురి పరామర్శ హైదరాబాద్ ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం అన్నవాహికలో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఆయనను వైద్యులు పరీక్షించి ఊపిరితిత్తులు, కిడ్నీలు కూడా ఇన్ఫెక్షన్కు గురైనట్లు గుర్తించి వైద్యసేవలు అందజేశారు. దాసరి ఆరోగ్య స్థితిని, ఆయనకు అందిస్తున్న వైద్యాన్ని కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్‌రావు, ఇతర వైద్యులు మీడియాకు వివరించారు. అన్నవాహికలో ఇన్ఫెక్షన్ను తొలగించేందుకు వైద్యం అందజేస్తూనే.. వెంటిలెటర్‌పై ఉంచి శ్వాస అందజేస్తున్నామని వారు తెలిపారు. అన్నవాహికకు స్టెంట్ వేసినట్లు చెప్పారు. కిడ్నీలు కూడా దెబ్బతిన్నట్లు పరీక్షల్లో వెల్లడవడంతో డయాలసిస్ కూడా చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దాసరి కుమారులు అరుణ్, ప్రభు ఆస్పత్రిలోనే ఉన్నారు. తరలి వచ్చిన సినీ ప్రముఖులు.. దాసరి కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారనే సమాచారం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నాయి. ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు, ఆయన సతీమణి, కుమారుడు మంచు విష్ణు మంగళవారం ఉదయం ఆస్పత్రికి వచ్చి సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. సినీ నటి జయసుధ, ప్రముఖ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, సినీ దర్శకులు రాఘవేంద్రరావు, ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు దాసరిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చారు. తన గురువు దాసరి నారాయణరావు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ఆయన అందరికీ కావలసిన వ్యక్తి అని మోహన్‌బాబు చెప్పారు. -
'దాసరి త్వరలో కోలుకునే ఆస్కారం'
-
'దాసరి త్వరలో కోలుకునే ఆస్కారం'
ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావుకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, వాటికి చికిత్స చేసేందుకు వెంటిలేటర్ మీద పెట్టామని కిమ్స్ ఎండీ, సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కరరావు చెప్పారు. దాసరికి చెస్ట్ ఆపరేషన్ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నవాహికలో ఉన్న పదార్థాల వల్లే ఇన్ఫెక్షన్ వస్తోందని, వాటన్నింటినీ శస్త్రచికిత్స ద్వారా తీసేశామని ఆయన వివరించారు. ఇప్పుడైతే ఆయన చాలా బాగున్నారని, రెండు మూడు రోజుల్లో బాగా కోలుకోడానికి ఆస్కారం ఉందని అన్నారు. ఇది చాలా సున్నితమైన విషయం కాబట్టి దీని గురించి ఇంకేమీ చెప్పలేనని డాక్టర్ భాస్కరరావు అన్నారు. (చదవండి: వెంటిలేటర్‌పై దాసరి నారాయణరావు) తన గురువుగారైన దాసరి నారాయణరావు తప్పకుండా కోలుకుంటారని, ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ కావల్సిన మనిషని నటుడు మోహన్ బాబు అన్నారు. డాక్టర్లు అన్నీ చెబుతున్నారని.. వీళ్లు తనకు, దాసరికి కూడా బాగా కావల్సిన వాళ్లని ఆయన తెలిపారు. దాసరి నూరేళ్లు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని, అందరూ కూడా ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరారు. దాసరి నారాయణరావు అన్నయ్య, దాసరి కుమారుడు రఘు కూడా ఆస్పత్రి వద్దకు వచ్చారు.