సాక్షి ప్రతినిధి, కడప : కడప కేంద్రంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్టీసీ ప్రాంతీయ వైద్యశాల ఏర్పాటై నేటితో ఏడాది పూర్తయింది. ఏడాదిగా రాయలసీమ జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఇక్కడే ఆధునిక వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో వీరు ఆయా జిల్లాల పరిధిలోని డిస్పెన్సరీలలో వైద్య సేవలు పొందాల్సి వచ్చేది. మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ, హైదరాబాదు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కడపలో కోట్లాది రూపాయల వ్యయంతో ప్రాంతీయ ఆస్పత్రిని నిర్మించారు.
ఏడాదిలో 49,812 మందికి వైద్య సేవలు
గడిచిన ఏడాదిలో వైఎస్సార్ జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన 49,812 మందికి ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించారు. 120 మందిని ఇన్‌పేషంట్లుగా చేర్చుకుని వైద్యం చేయగా, 100 మందికి వివిధ రకాల ఆపరేషన్లు చేశారు. 63 శాతం మంది ఉద్యోగులు, కార్మికులకు, 16.3 శాతం మంది కుటుంబ సభ్యులకు, 20.7 శాతం మంది రిటైర్డ్ ఉద్యోగులకు ఆస్పత్రిలో వైద్యం అందించారు. 2500 మందికి ఎక్స్‌రేలు తీశారు. వేలాది మందికి ల్యాబ్‌లలో వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు.
170 రకాల ట్యాబెట్లు, 30 రకాల ఇంజెక్షన్లు
ఈ ప్రాంతీయ వైద్య శాలలో బీపీ, షుగర్, గుండె జబ్బులకు యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, చర్మ వ్యాధులు, సీజనల్ వ్యాధులతోపాటు పలురకాల జబ్బులకు సంబంధించి ఇక్కడ ఉన్న ఫార్మసీ ద్వారా 170 రకాల ట్యాబెట్లు ఉచితంగా అందిస్తున్నారు. వీటితోపాటు వ్యాధులను బట్టి 20–30 రకాల ఇంజెక్షన్లను సైతం ఇస్తున్నారు. ఈ ఆస్పత్రికి 60 శాతం మందులు సెంట్రల్ స్టోర్స్ ద్వారా వస్తుండగా, మరో 40 శాతం మందులు అపోలో వారి నుంచి సరఫరా అవుతున్నాయి.
మూడు షిఫ్ట్‌ల ద్వారా వైద్య సేవలు
ఆస్పత్రిలో మూడు షిఫ్ట్‌ల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు షిఫ్ట్‌ల పద్దతిలో వైద్య సేవలు అందిస్తున్నారు. ఏడుగురు వైద్యులు, ఇద్దరు కన్సల్టెన్సీ డాక్టర్లు, రెగ్యులర్ ఔట్‌సోర్సింగ్ కలిపి 13 మంది సాఫ్ట్ నర్సులు, ఐదుగురు వార్డు బాయ్స్ ఈ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇక్కడున్న ల్యాబ్‌లో 90 రకాల టెస్టులను చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment