ఆర్టీసీ ఆస్పత్రి ఫార్మసీ ప్రైవేటుపరం! | RTC Hospital pharmacy Privatization | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఆస్పత్రి ఫార్మసీ ప్రైవేటుపరం!

Published Wed, Mar 8 2017 3:20 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

ఆర్టీసీ ఆస్పత్రి ఫార్మసీ ప్రైవేటుపరం!

ఆర్టీసీ ఆస్పత్రి ఫార్మసీ ప్రైవేటుపరం!

మందుల కొరత ఉందంటూ బడా సంస్థకు ధారాదత్తం
సమస్య పరిష్కరించకుండా తప్పించుకోజూస్తున్న ఆర్టీసీ
రెండు, మూడు రోజుల్లో ప్రైవేటు సంస్థతో ఒప్పందం


సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలోని ఆర్టీసీ ఆస్పత్రిలో మందులకు కరువొచ్చింది! పారాసిటమాల్‌ లాంటి సాధారణ జ్వరం మాత్రల కోసం కూడా రోగులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది!! ఈ సమస్యను పరిష్కరించి సకాలంలో మందులు సరఫరా అయ్యేలా చూడాల్సిన ఆర్టీసీ యాజమాన్యం మాత్రం చేతులెత్తేసింది. ఏకంగా ఆస్పత్రి మందుల నిర్వహణ బాధ్యత నుంచే తప్పుకోవాలని నిర్ణయించింది. ఆస్పత్రి ఫార్మసీని గొలుసు దుకాణాల వ్యవస్థ ఉన్న ఓ బడా ప్రైవేటు సంస్థకు అప్పగించ నుంది. ఈ మేరకు మరో రెండు, మూడు రోజుల్లో దానితో ఒప్పందం చేసుకోనుంది. తీవ్ర నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమవుతూ ఒక్కో అనుబంధ సంస్థను వదిలించుకుంటున్న ఆర్టీసీ తాజాగా ఫార్మసీని కూడా ఆ జాబితాలోకి నెట్టేస్తోంది.

అసలు సమస్యను గాలికొదిలేసి...
ఆర్టీసీకి తార్నాకలో సొంతంగా పెద్ద ఆస్పత్రి ఉంది. దీనికి ఆర్టీసీ సెంట్రల్‌ స్టోర్సే మందులను సరఫరా చేస్తుంది. బస్సులకు టైర్లు మొదలు ఆర్టీసీ ఆస్పత్రికి మందుల వరకు సమకూర్చే బాధ్యత దీనిదే. ఎలాంటి మందుల అవసరం ఉంటుందో ముందుగానే జాబితా రూపొందించి టెండర్లు పిలిచి తక్కువ మొత్తం కోట్‌ చేసిన సంస్థ నుంచి వాటిని కొనుగోలు చేస్తుంది. ఇక్కడే సమస్య ఎదురవుతోంది. ప్రస్తుతం 329 రకాల మందులను టెండర్ల ద్వారా సమకూర్చుకుంటున్నా ఆయా సంస్థలు కొన్ని రకాల మందులనే సకాలంలో సరఫరా చేసి మిగతా వాటిని నెల, అంతకంటే ఎక్కువ జాప్యం చేస్తూ సరఫరా చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 100 రకాల మందులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ సమస్య కొన్ని నెలలుగా ఉన్నా దాన్ని పరిష్కరించటంలో ఆర్టీసీ విఫలమవుతోంది.

ఈలోగా మందులను అత్యవసరంగా సమకూర్చుకోవాల్సి వస్తే లోకల్‌ పర్చేస్‌ విధానంలో అప్పటికప్పుడు వేరే సంస్థల నుంచి కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు కూడా తొలుత సంస్థలో ప్రత్యేకంగా ఉండే కమిటీ సమావేశమై అనుమతి ఇవ్వాల్సి ఉంది. కమిటీ నుంచి అనుమతి లభించి మందులను ఆస్పత్రి తిరిగి సమకూర్చుకునేందుకు కనీసం వారం పడుతోంది. దీనివల్ల రోగుల బంధువులే బయటి దుకాణాల్లో మందులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వెరసి సకాలంలో మందులు దొరకని దుస్థితి నెలకొని ఇబ్బందులు తలెత్తుతున్నా దాన్ని చక్కదిద్దటంలో ఆర్టీసీ విఫలమైంది.

అదనపు భారం రూ.2 కోట్లకు పైమాటే...
ప్రస్తుతం ఆర్టీసీ ఆస్పత్రికి మందుల సరఫరా కోసం సాలీనా రూ.9 కోట్ల వరకు ఖర్చవుతోంది. ఇప్పుడు ఆస్పత్రి ఫార్మసీ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించటం వల్ల ఆ సంస్థకు దాదాపు రూ. 11 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. అసలే నష్టాలతో సతమతమవుతున్న సంస్థ తాజా నిర్ణయంతో మరింత భారం మోపుకొంటోంది. అయితే తాజా నిర్ణయం వల్ల సంస్థపై కొంత ఆర్థిక భారం పడినా నాణ్యమైన మందులకు కొరత ఉండదని...ఇది కార్మికులకే మంచిదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ కార్మిక సంఘాలు మాత్రం ఈ చర్యను వ్యతిరేకిస్తున్నాయి. ఆస్పత్రి విస్తరణకు ఎంతో పాటుపడ్డామని, ఇప్పుడు అందులోని ప్రధాన ఫార్మసీ విభాగాన్ని ప్రైవేటీకరించడమంటే యాజమాన్యం బాధ్యతల నుంచి తప్పించుకోవడమేనని విమర్శిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement