లక్డీకాపూల్: నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు నిమ్స్ ఆస్పత్రిని నాన్–కోవిడ్ ఆస్పత్రిగా ప్రభుత్వం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ద్వారా అత్యాధునిక వైద్య సేవలను పొందుతున్న పేద రోగులకు కరోనాతో కొంత మేర అవాంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిరుపేద రోగులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇక నుంచి ఆస్పత్రికి వచ్చిన రోగుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే గాంధీకి తరలించేలా చర్యలు తీసుకుంటారు. శనివారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అందరినీ అప్రమత్తం చేసేందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణరావు ఆయా విభాగాల అధిపతులకు ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వనీయ సమాచారం.
సోమవారం నుంచి ఆస్పత్రి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగేందుకు యాజ మాన్యం చర్యలు తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో ఆస్పత్రికి వచ్చిపోయే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో కిటకిటలాడే నిమ్స్ ఓపీ విభాగాలు కొద్ది రోజులుగా బోసిపోతున్నాయి. అయితే వైరస్ భయం కొంత తగ్గడంతో రోగుల రాక మొదలై సందడి ఆరంభమైంది. శనివారం దాదాపు 250 మంది రోగులు అవుట్ పేషెంట్ విభాగంలో వైద్య సేవలు పొందినట్లు తెలిసింది. అలాగే కార్డియాలజీ విభాగంలో 2 శస్త్రచికిత్సలు జరిగినట్లు సమాచారం. పూర్తి స్థాయి కరోనా ఆస్పత్రిగా గాంధీని ప్రకటించిన నేపథ్యంలో నిమ్స్‌ను పేద రోగులకు అందుబాటులోకి వచ్చేలా నాన్ కోవిడ్ ఆస్పత్రిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే నిమ్స్ లో రెండు రోజులుగా కరోనా అనుమానితులకు సంబంధిం చి వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు మిలీనియం బ్లాక్‌లోని ఐదవ అంతస్తులో ఉన్న బయాలజీ విభాగంలో జరుగుతున్నాయి. శుక్రవారం 70 నమూనాలను, శనివారం 120 నమూనాలను పరీక్షించారు. ఇకపై కూడా ప్రతిరోజూ కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని నిమ్స్ వర్గాలు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment