40 శాతం ఆస్పత్రుల్లోనే..!  | Operation begins to replace 50000 government jobs | Sakshi
Sakshi News home page

40 శాతం ఆస్పత్రుల్లోనే..! 

Published Fri, Jul 16 2021 12:54 AM | Last Updated on Fri, Jul 16 2021 12:54 AM

Operation begins to replace 50000 government jobs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కోవిడ్‌–19 వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్టుగా కన్పిస్తున్నప్పటికీ.. వైరస్‌ బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారంరాష్ట్రంలో 10,203 యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో 4,034 మంది అంటే దాదాపు 40 శాతం ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతుండటం గమనార్హం. కోవిడ్‌–19 వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో ఆస్పత్రుల్లో అడ్మిషన్లు 35 శాతం లోపే ఉండగా... ప్రస్తుతం చేరికల నిష్పత్తి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  

ఆక్సిజన్‌ బెడ్‌లపైనే ఎక్కువ 
రెండోదశ కోవిడ్‌–19 వ్యాప్తిలో ఎక్కువగా డిమాం డ్‌ ఏర్పడింది ఆక్సిజన్‌ బెడ్‌లకే. కాగా ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరినవారిలో కూడా ఎక్కువ మంది ఆక్సిజన్‌ బెడ్‌లపైనే ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 55,442 పడకలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్న కరోనా రోగులు 4,034 మందిలో 1,805 మంది (44.74 శాతం) ఆక్సిజన్‌ బెడ్‌లపైనే చికిత్స తీసుకుంటున్నారు. ఐసీయూ బెడ్‌లపై 1,380 (34.20 శాతం) మంది బాధితులు ఉండగా, సాధారణ బెడ్‌లపై 849 (21.04 శాతం) మంది ఉన్నారు.  

‘ప్రైవేటు’వివరాలు అందడం లేదా? 
కోవిడ్‌–19 నిర్ధారణ పరీక్షలు రాష్ట్రంలో రోజుకు లక్షకు పైగా చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటిస్తోంది. ఇందులో సగటున ఒక శాతం కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రైవేటు కేంద్రాల్లో చేస్తున్న పరీక్షల వివరాలు ప్రభుత్వం దృష్టికి రావడం లేదనే విమర్శలున్నాయి. అదే విధంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నవారి వివరాలు సైతం అధికారులకు వేగంగా అందడం లేదనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఆస్పత్రుల్లో చేరికల శాతం పెరిగినప్పటికీ వివరాలను వెబ్‌సైట్‌లో ప్రదర్శించడం లేదు.  

పిల్లల కోసం 2 వేల కొత్త పడకలు 
కోవిడ్‌–19 రెండో దశ కేసులు గత నెల రోజులుగా జాతీయ స్థాయిలో తగ్గుముఖం పట్టినా.. రెండు మూడురోజులుగా పెరగడాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. అప్రమత్తంగా ఉండాల ని రాష్ట్రాలను ఆదేశించింది. మూడోదశ వస్తే ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని సూచించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పీడియాట్రిక్స్‌ విభాగాన్ని అప్రమత్తం చేసింది. పిల్లల కోసం కొత్తగా 2 వేల పడకలను ఏర్పాటు చేసింది. మాస్కులు, శానిటైజర్ల వాడకంపై ప్రజల్లో మరిం త అవగాహన కల్పించేందుకు సిద్ధమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement