వైద్య సిబ్బందికి రక్షణ కవచం | Lodging in hotels for doctors who giving Corona treatment | Sakshi
Sakshi News home page

వైద్య సిబ్బందికి రక్షణ కవచం

Published Mon, Apr 20 2020 1:30 AM | Last Updated on Mon, Apr 20 2020 1:30 AM

Lodging in hotels for doctors who giving Corona treatment  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి రక్షణ కవచం కల్పించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ముగ్గురు ఐఏఎస్‌లతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. గాంధీ, ఫీవర్, ఛాతి తదితర ఆసుపత్రుల్లోని కరోనా రోగులకు, అనుమానిత లక్షణాలతో ప్రభుత్వ క్వారంటైన్లలో ఉన్నవారికి చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక వసతి కల్పించనున్నారు. వారు ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే రోజుల్లో విధులు ముగించుకున్న తర్వాత నేరుగా ఇంటికెళ్తే కుటుంబసభ్యులకు ఇబ్బంది అవుతుందన్న భావనతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి వివిధ హోటళ్లలో బస కల్పిస్తారు. వారికి షిఫ్టుల ప్రకారం డ్యూటీలు వేస్తారు. కొన్నాళ్లపాటు విధులు నిర్వహించాక, వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి ఇంటికి పంపుతారు. డ్యూటీ లో ఉన్న కాలంలో వారు హోటళ్లలోనే ఉంటారు.

టూరిజం హోటళ్లు, ప్రభుత్వ అతిథి గృహాలు.. 
ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బందికి పర్యాటక శాఖకు చెందిన హోటళ్లు, ప్రభుత్వ అతిథి గృహాల్లో బస ఏర్పాటు చేస్తారు. బస ఏర్పాటు చేయాలి? భోజన వసతి తదితర అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ నీతూకుమారి ప్రసాద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్, పర్యాటక శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్‌రావులతో కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కన్వీనర్‌గా పర్యాటక శాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు. హోటళ్లను ఖరారు చేయడం, వారి భోజన ధరలను నిర్ణయించడం వంటి వాటిని ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆహారం, వ్యాయామం వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. జిమ్‌ వంటి సౌకర్యాలున్న వాటిని ఎంపిక చేసే అవకాశముంది. పండ్లు, డ్రైఫ్రూట్స్, ఇతర బలవర్ధక ఆహారం అందుబాటులో ఉంచుతారు. ప్రత్యేకంగా వీరి కోసం ఆయా హోటళ్లలో భోజనం తయారు చేయిస్తారు. 

కుటుంబానికి దూరంగా.. 
వీరు హోటళ్లు, ఆసుపత్రుల్లో ఉన్నన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. షిఫ్టులను ఎన్ని రోజులకోసారి మార్చుతారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. వైద్య సిబ్బందిని ఎన్ని బ్యాచ్‌లుగా ఏర్పాటు చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరూ ఒకేసారి పనిచేయకుండా, కొందరు కొన్ని రోజులు పనిచేసేలా వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ఎవరూ అనారోగ్యానికి గురికాకుండా చేయాలన్నదే ఈ బ్యాచ్‌ల ఉద్దేశం. వారిని మంచిగా కాపాడుకోవాలని సీఎం కేసీఆర్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. కమిటీ నివేదిక ఇచ్చాక వైద్య సిబ్బందికి బస ఏర్పాట్లు చేస్తామని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement