గాంధీ ఆస్పత్రి: కోవిడ్ వైరస్‌ను అతను జయించాడు. వివిధ దేశాల్లో వేలాది మందిని కబళించిన మహమ్మారి బారి నుంచి క్షేమంగా బయటపడ్డాడు. 13 రోజులపాటు గాంధీ ఆస్పత్రి ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందిన కోవిడ్ బాధితుడు శుక్రవారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య డిశ్చార్జి అయ్యాడు. మహేంద్రహిల్స్‌కు చెందిన యువకుడు కోవిడ్ లక్షణాలతో ఈ నెల 1న గాంధీ ఐసోలేషన్ వార్డులో చేరాడు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రావడంతో తెలంగాణ ప్రభుత్వంతోపాటు వైద్య ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. బాధిత యువకుడిని గాంధీ అత్యవసర విభాగంలోని కోవిడ్ అక్యూట్ ఐసీయూలో ఉంచి వైద్యసేవలు అందించారు. మూడ్రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా నెగటివ్ రిపోర్టు వచ్చింది. మరోమారు నమూనాలు సేకరించి పుణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా అక్కడ కూడా నెగటివ్ రావడంతో శుక్రవారం రాత్రి బాధిత యువకుడిని డిశ్చార్జి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
నాటకీయ పరిణామాల మధ్య...
బాధిత యువకుడిని శుక్రవారం రాత్రి డిశ్చార్జి చేస్తారని తెలుసుకున్న మీడియా ప్రతినిధులు గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటలకు కోవిడ్ అక్యూట్ ఐసీయూ వద్ద విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బంది, అటెండర్లను ‘మీరంతా భోజనం చేసి రండి’అంటూ వైద్యాధికారులు అక్కడి నుంచి పంపించేశారు. బాధిత యువకుడిని అక్యూట్ ఐసీయూ నుంచి కాలినడకన ఇన్–పేషెంట్ బ్లాక్‌కు తీసుకొచ్చి ఆస్పత్రి ప్రధాన భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని హెల్ప్ డెస్క్ వద్ద అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో వారు ప్రైవేటు వాహనంలో బాధిత యువకుడిని తీసుకెళ్లిపోయారు. విషయం తెలియని మీడియా ప్రతినిధులు ఆస్పత్రి అత్యవసర విభాగం వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు. బాధిత యువకుడిని డిశ్చార్జి చేసి పంపినట్లు రాత్రి 10.15 గంటలకు మీడియాకు సమాచారం అందించారు.
మరో 15 రోజులు హోం ఐసోలేషన్‌లో...
కోవిడ్‌ను జయించిన యువకుడిని మరో 15 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిసింది. బాధిత యువకుడి కుటుంబ సభ్యులకు గతంలోనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో బాధిత యువకుడితోపాటు అతని కుటుంబ సభ్యులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలను ఆస్పత్రి అధికారులు వివరించారు. కాగా, ఇతడు 13 రోజులపాటు ఉన్న కోవిడ్ అక్యూట్ ఐసీయూకు వైద్యాధికారులు ఫ్యుమిగేషన్ నిర్వహించారు. వైరస్, బ్యాక్టీరియా లేకుండా వార్డులోని గోడలు, మంచాలు, పరుపులు, ఇతర పరికరాలను ప్రత్యేక ద్రావణాలతో శుభ్రం చేశారు.
మరో పాజిటివ్ కేసు?
కోవిడ్ బాధితుడు డిశ్చార్జి అయిన కొద్దిసేపటికే మరో పాజిటివ్ కేసు గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కోవిడ్ లక్షణాలతో చికిత్స పొందుతున్న మహిళకు నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిందని తెలిసింది. దీంతో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ప్రైవేటు ఆస్పత్రి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో గాంధీ ఐసోలేషన్ వార్డుకు ఆమెను తరలించినట్లు సమాచారం. ఆమె నుంచి నమూనాలు సేకరించి పుణే ల్యాబ్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు ఇటీవల సౌదీ వెళ్లొచ్చిన ఇద్దరు నగర యువకులు కోవిడ్ లక్షణాలతో బాధపడుతుండటంతో వారికి నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా, కోవిడ్ వైరస్ నేపథ్యంలో రెండో శనివారం, ఆదివారం కూడా వైద్య సిబ్బంది విధుల్లోనే ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కమాండ్ కంట్రోల్ రూం కూడా 24 గంటలు పనిచేస్తుందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment