సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కాస్తంత ఊరట. వ్యాక్సిన్లు నిండుకుంటున్న వేళ.. కేంద్రం 3.60 లక్షల కరోనా టీకాలు వచ్చినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారం సాయంత్రం అవి రాష్ట్రానికి చేరినట్టు అధికారులు తెలిపారు. స్టేట్ వ్యాక్సిన్ సెంటర్‌లో ఉన్న వ్యాక్సిన్లన్నీ జిల్లాలకు వెళ్లిపోయాయి. ఒక్క రోజుకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన వ్యాక్సిన్లు మరో మూడు రోజులకు సరిపోతాయి. అందులో 2 లక్షల కోవాగ్జిన్ టీకాలు, మిగిలినవి కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో 30 లక్షల టీకాలు పంపాలని ఇటీవల కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటి విడతగా 3.60 లక్షల టీకాలు పంపించినట్టు అధికారులు తెలిపారు. ఇకపై ఒకేసారి పెద్ద మొత్తంలో టీకాలు వచ్చే పరిస్థితులు లేవని, అయిపోయినప్పుడల్లా కేంద్రం నుంచి వస్తా యని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే అప్పుడు సమస్య రావొచ్చ ని పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఏమాత్రం లేదని వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు.
‘రెమిడిసివిర్’.. చేతులెత్తేసిన కంపెనీ: కరోనా వచ్చి ఆస్పత్రిపాలైన వారికి అవసరమైన వాటిలో రెమిడిసివిర్ ఇంజెక్షన్ అత్యంత ముఖ్యమైంది. ప్రస్తుతం వాటికి భారీ డిమాండ్ ఏర్పడింది. కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో మరిన్ని ఇంజెక్షన్లు అవసరం అవుతాయి. అందువల్ల మరో 2 లక్షల రెమిడిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే హైదరాబాద్‌లో వాటిని ఉత్పత్తి చేసే కంపెనీ చేతులెత్తేసింది. ఇప్పటికిప్పుడు అంత సరఫరా చేయలేమని, వాటిని ఉత్పత్తి చేసి, పరిశీలించి అందజేయడానికి 3 వారాల సమయం పడుతుందని స్పష్టం చేసింది.
దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. టెండర్లకు వెళ్లి తెప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నా, దేశంలో ఎక్కడ అందుబాటులో ఉన్నాయో కూడా తెలియట్లేదు. అయితే రోజురోజుకూ కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండటం, రెండు, మూడు వారాల్లో పరిస్థితి ఏ స్థాయికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఎంత ఖరీదైనా రెమిడిసివీర్‌ను తెప్పించాలని భావిస్తున్నారు. కాగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం బెడ్స్‌ను సమకూర్చుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 20కి పైగా పడకలున్న ఆసుపత్రులు, నర్సింగ్ హోంలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మరో 2 వారాల్లోగా రాష్ట్రంలో మొత్తం 50 వేల పడకలు కరోనాకు కేటాయించేలా ప్రణాళిక రచించినట్లు డాక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు.
రెండో డోస్ వ్యాక్సిన్ల కొరత..
రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు.. 4 వారాల నుంచి 8 వారాల మధ్య రెండో డోస్ తీసుకోవాలి. కోవిషీల్డ్ రెండో డోస్‌ను 8 వారాల వరకు తీసుకునే వెసులుబాటు ఉంది. కోవాగ్జిన్‌ను 4 వారాల్లోనే వేయించుకోవాలి. అయితే మొదటి డోస్ వేయించుకున్న వారికి తప్పనిసరిగా ఆ నిర్ణీత సమయంలో రెండో డోస్ వేయాలి. అయితే గతంలో కేంద్రం నుంచి టీకాలు వస్తాయన్న నమ్మకంతో రెండో డోస్ కోసం నిల్వ ఉంచిన టీకాల్లో 75 శాతం మేరకు వాడేసినట్లు ఓ అధికారి తెలిపారు. దీంతో అనేకచోట్ల రెండో డోస్ వేసుకోవాల్సిన వారు వేచి చూస్తున్నారు. ఇకనుంచి రెండో డోస్ వారికి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఇప్పటికే ఒకేరోజు 1.62 లక్షల టీకాలు వేశారు. మున్ముందు అవసరమైతే 2 లక్షల నుంచి రెండున్నర లక్షల టీకాలు కూడా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు డాక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment