సాక్షి, హైదరాబాద్: ► వరంగల్ నుంచి పలువురు మర్కజ్‌కు వెళ్లొచ్చారు. వారిలో చాలామందికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారితో కాంటాక్ట్ అయిన ఓ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించలేదు. కాంటాక్ట్ లిస్టులో ఉన్నందున అనుమానంతో పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ అని తేలింది.
►సూర్యాపేటలో 20 మందికిపైగా కరోనా సోకిన సంగతి తెలిసిందే. మర్కజ్‌తో కాంటాక్టు కలిగిన ముగ్గురికి ఎలాంటి లక్షణాలు లేవు. కానీ మర్కజ్‌కు వెళ్లిన వ్యక్తితో కాంటాక్ట్ అయ్యారన్న కారణంతో వైద్య పరీక్షలు నిర్వహించగా, వారికి పాజిటివ్ అని తేలింది.
►ఇలా రాష్ట్రంలో కరోనా వచ్చిన వ్యక్తులతో కాంటాక్ట్ అయిన వారిలో కొందరికి ఎలాంటి లక్షణాలు లేకపోయినా వారికి పాజిటివ్ రావడం వైద్య ఆరోగ్యశాఖ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు విదేశీ ప్రయాణ చరిత్ర, మర్కజ్ వ్యవహారంతో సంబంధమున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొందరికి పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే వారితో కాంటాక్ట్‌లో ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచి, కరోనా అనుమానిత లక్షణాలు ఉంటేనే పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిందనడానికి పై ఉదాహరణలే తార్కాణం. పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులు, వారి కాంటాక్టుల్లో లక్షణాలున్న వారితోపాటు, ఇక నుంచి కాంటాక్టుల్లో ఎలాంటి అనుమానిత లక్షణాలు లేని వారిని కూడా పరీక్షించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. వైరస్ వ్యాప్తి మొదట్లో ఉన్నట్లు కాకుండా దాని స్వరూపం మార్చుకుంటుందన్న చర్చ జరుగుతోంది. పాజిటివ్ కలిగిన వ్యక్తులతో ఏదో రకంగా కాంటాక్టు ఉంటే లక్షణాలు బయటకు కనిపించకపోయినా కరోనా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
900 మందికి పరీక్షలు...
ఇప్పటివరకు విదేశీ ప్రయాణ చరిత్ర ఉన్నవారిలో లక్షణాలున్న వారిని, వారి కుటుం బ సభ్యులను మాత్రమే పరీక్షించారు. వారి కాంటాక్టులను క్వారంటైన్‌లో ఉంచారు. వారిలో లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించారు. కొందరికి పాజిటివ్ రాగా, చాలామందికి నెగెటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎలాంటి లక్షణాలులేని 25 వేల మందిని ఇటీవలే హోం క్వారంటైన్ నుంచి విముక్తి చేశారు. ఆ తర్వాత మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు 1,291 మందిని గుర్తించారు. వారిలో చాలా మందిని, వారితో కాంటాక్ట్ ఉన్న వారినీ క్వారంటైన్‌లో ఉంచి లక్షణాలున్న వారికి పరీక్షలు నిర్వహించారు. అందులో అనేక మందికి పాజిటివ్ వచ్చింది.
ప్రస్తుతం మర్కజ్‌తో కాంటాక్టు ఉండి, ఎలాంటి లక్షణాలు లేనివారిలో చాలామందిని హోం క్వారంటైన్‌కు తరలించారు. అయితే ఇప్పుడు కాంటాక్ట్‌ల జాబితా పెరుగుతోంది. వారెక్కడెక్కడికి వెళ్లారు. ఎంతమందిని కలిశారన్న దానిపై వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇతర కాంటాక్టుల్లో ఎలాంటి లక్షణాలు లేకపోయినా కొందరికి పాజిటివ్ వస్తుండటంతో వైద్యాధికారులు తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. క్వారంటైన్‌లో ఉన్నవారందరినీ, మర్కజ్ కాంటాక్టుల్లో ఉన్న వారందరినీ పరీక్షించాలని నిర్ణయించారు. తాజాగా వారితో కాంటాక్ట్ అయినవారిలో ఎలాంటి లక్షణాలు లేని 900 మందికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కాంటాక్టులందరికీ పరీక్షలు...
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. సోమవారం నాటికి కంటైన్మెంట్ ఏరియాల్లో 27.32 లక్షల మందిని సర్వే చేశారు. వారిలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారి సెకండరీ కాంటాక్ట్‌ని ట్రేస్ చేస్తున్నారు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కాంటాక్టుల జాబితా కూడా పెరుగుతోంది. ఎలాంటి లక్షణాలు లేనివారికి కూడా పరీక్షలు చేయాల్సి రావడంతో రోజురోజుకూ కేసులు సంఖ్య మరింత పెరగవచ్చని వైద్యాధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి మర్కజ్‌కు వెళ్లొచ్చినవారు, వారి కాంటాక్ట్‌ల వరకే పరిమితమై, లక్షణాలున్న వారికే పాజిటివ్ వచ్చేట్లయితే కరోనా వ్యవహారం కొలిక్కి వచ్చేది.
కానీ కాంటాక్టులకు ఎలాంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ వస్తున్నట్లయితే, ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇలాగైతే కూరగాయలు కొనేవారి నుంచి మొదలు పాలమ్మే వ్యక్తి వరకు కూడా ఎవరినీ నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని ఒక వైద్య నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ గొలుసు వ్యవహారం ఎక్కడ కట్ అవుతుందోనని, ఎప్పుడవుతుందోనన్న చర్చ వైద్య వర్గాల్లో జరుగుతోంది. మర్కజ్ వ్యవహారంలో లక్షణాలు లేని కాంటాక్టు వ్యక్తులకు కొందరికి పాజిటివ్ వస్తుండటంతో, మరి విదేశాల నుంచి వచ్చిన కాంటాక్టుల్లో లక్షణాలు లేని వారికి ఎవరికైనా పాజిటివ్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయా అన్న కోణంపై ఇప్పుడు వైద్యాధికారులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment