సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందే రోగులకు అవసరమైన వెంటిలేటర్ల ఏర్పాటుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ముందుకొచ్చింది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి నిమ్స్ సంచాలకులు డాక్టర్ కె.మనోహర్‌కు రాసిన లేఖతో పాటు, రూ. 41.95 లక్షల చెక్‌ను ఆదివారం అందజేశారు. "దేశ పురోగతిలో భాగస్వామి కావాలన్న మా నినాదంతో, భారతదేశం విలువైన వనరులను, దాని మానవశక్తిని కబళించే కోవిడ్-19 వ్యాప్తిని నిలువరించేందుకు మీకు సహాయం చేయాలనుకుంటున్నాము. ఈ విపత్తుతో పోరాడటానికి మీ పక్షాన నిలబడటానికి, మీకు మద్దతు ఇవ్వడానికి మేము ముందుంటాము. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అత్యవసర చికిత్స పొందే రోగులకు ఎంతో అవసరమైన వెంటిలేటర్లను సరఫరా చేస్తున్నాము. మీ రవాణా అవసరాలను తీర్చడానికి రవాణా సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశాము. భువిపై దేవతలైన మీకు సేవ చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము. రోగుల సేవకు మీకు ఏదైనా అత్యవసరం అయినపుడు సహకరించేందుకు తమ సంస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది" అన్నది ఆ లేఖ సారాంశం.
"దేశం మొత్తం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన కోవిడ్ వ్యాధితో ఇబ్బంది పడుతోంది. ఈ సమయంలో, దేశం మొత్తం వైద్య సేవల కోసం ఎదురుచూస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు తమ ప్రాణాలను, సంబంధాలను పణంగా పెడుతున్నారు. 'జనతా కర్ఫ్యూ'లో దేశం వారి సేవలను కొనియాడింది. ఈ వ్యాధిని ఎదుర్కొంటున్నప్పుడు కూడా వారి ధైర్యం ఎప్పుడూ తగ్గకపోవడం అనిర్వచనీయం" అని నిమ్స్ డైరెక్టర్ కు రాసిన లేఖలో మేఘా సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అంతేకాక మేఘా సంస్థ కరోనా వ్యాప్తి నిరోధించడానికై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో రూ.5 కోట్ల చెక్ అందించగా, కర్ణాటకకు రూ. రెండు కోట్లు, ఒడిశాలకు కోటి చొప్పున విరాళం అందించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment