సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్-19 అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పీఎం కేర్స్ ఫండ్‌కి సంబంధించి కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కీలక విషయాన్ని వెల్లడించారు. పీఎం-కేర్స్ ఫండ్ నుండి 893.93 కోట్ల రూపాయలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందినట్టు లోక్‌సభలో ప్రకటించారు. 50 వేల వెంటిలేటర్ల తయారీకి ఈ మొత్తాన్ని కేటాయించినట్టు ఆయన తెలిపారు.
ఆదివారం కరోనాపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి అడిగిన ప్రశ్నకుసమాధానంగా కేంద్ర మంత్రి ఈ సమాచారం అందించారు. కరోనా కారణంగా నిరాశ్రయులైన లక్షలాది మంది వలస కార్మికుల పునరావాసం కోసం పీఎం కేర్స్ నిధులు కేటాయించాలని కూడా రంజన్ చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సరైన ప్రణాళికను అమలు చేసి ఉండి ఉంటే, ప్రజలు కష్టాలను, మహమ్మారి తీవ్రతను నివారించ గలిగేవారమన్నారు. అంతేకాదు దేశంలో కోవిడ్-19 మరణాలపై సరైన సమాచారం లేదని కూడా రంజన్ చౌదరి విమర్శించారు.
కాగా కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో నిధుల సేకరణ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిఎం కేర్స్ ఫండ్‌ను మార్చి 27న ప్రకటించారు. కేవలం ఐదు రోజుల్లోనే రూ .3,076 కోట్లు వచ్చాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. మరోవైపు పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. పీఎం రిలీఫ్ ఫండ్ లేదా ప్రధానమంత్రి సహాయ నిధి ఇప్పటికే ఉండగా, మరో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు అవసరంపై అనేక ప్రశ్నలు వెల్లువెత్తాయి. అలాగే పీఎం కేర్స్ ఫండ్ నిధులను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ఆడిట్‌ను డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment