నిలోఫర్‌లో.., ఉస్మానియాలో..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రికి వెళుతున్నారా?.. అయితే వెంట నీళ్ల బాటిల్‌ను తీసుకెళ్లండి.. అసలే ఎండాకాలం ఆపై ఆస్పత్రుల్లో మంచి నీళ్ల కరువు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నీళ్లు తాగితే.. అక్కడే అడ్మిట్ కావాల్సిన పరిస్థితి. కాచి వడపోసిన నీటినే తాగండి అని చెప్పే అధికారులు ఆస్పత్రుల వంక కన్నెత్తి చూడకపోవడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిమ్స్ సహా ఉస్మానియా, గాంధీ, పేట్ల బురుజు, సుల్తాన్ బజార్, ఈఎన్‌టీ, సరో జినిదేవి, ఛాతీ ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. మందులు వేసుకునేందుకు.. ఆహారం తినేందుకు రూ.20 చెల్లించి లీటర్ బాటిల్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. వార్డు ల్లో ఉన్న రిఫ్రిజిరేటర్లు పని చేయకపోవడం, ఒక వేళ పనిచేసినా నీరు లేక ఖాళీగా ఉండటంతో తాగేందుకు నీరులేక రోగులు, వారి బంధువులు తీవ్ర యాతన పడుతున్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయకపోవడం, వాటిపై సరైన మూతల్లేకపోవడంతో దుమ్మూధూళి కణాలతో పాటు పిచ్చుకల మలవిసర్జన, తోక పురుగులు కనిపిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
నిమ్స్‌లో నీళ్ల కరువు...
నిమ్స్ ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజు కు 1,500 మంది వస్తుండగా, నిత్యం వెయ్యి మందికిపైగా చికిత్స పొందుతుంటారు. రోగుల బంధువులు, ఉద్యోగులు మరో 3వేలమంది ఉంటారు. ఇక్కడి రోగులకు పలు ఇన్సూ్యరెన్స్ కంపెనీలు మందులు, చికిత్స ఖర్చులతో పాటు ఆహారం, తాగునీటి బిల్లులూ చెల్లిస్తుంటాయి. కానీ ఈ ఆస్పత్రిలో మంచి నీరు కూడా రోగులే సమకూర్చుకోవాల్సి వస్తుండటం విశేషం. అదే ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ లబ్ధిదారులకు ఆహారం సహా స్వచ్ఛమైన నీటిని ఉచితంగా సరఫరా చేస్తుండటం కొసమెరుపు.
ట్యాంకుల్లో పిచ్చుకల వ్యర్థాలు....
ఉస్మానియా ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజూ 2,000 మంది రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్ విభాగాల్లో నిత్యం 1,500 మంది చికిత్స పొందుతుంటారు. వీరికి సహాయకులుగా మరో వెయ్యి మంది ఉంటారు. వైద్య సిబ్బంది మరో 2,000 ఉంటారు. రోజుకు 50 లక్షల లీటర్లకుపైగా నీరు అవసరం కాగా 29,47,640 లక్షల లీటర్లు సరఫరా అవుతోంది. వీటిని నిల్వ చేసిన ట్యాంకులపై మూతల్లేక దుమ్ము, ధూళీ చేరుతోంది. పావురాల మలవిసర్జన నీటిపై తేలియాడుతోంది. ట్యాంకులను 15 రోజులకోసారి బ్లీచింగ్‌తో శుభ్రం చేయాల్సి ఉన్నా నెలకోసారి కూడా చేయడం లేదు. నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన ఆర్‌ఎంఓలు వాటిని పట్టించుకోవడం లేదు.
నీటి ట్యాంకుల్లో ఈకొలి బ్యాక్టీరియా...
గాంధీ ఆస్పత్రిలోనూ మంచినీటికి కటకటే. ట్యాంకులను శుభ్రం చేయకపోవడంతో నీటిపై నాచు తేలియాడుతోంది. కుళాయి నీటిలో ఈకొలి బ్యాక్టీరియా ఉండటంతో తాగడానికి పనికిరావడం లేదు. ఆస్పత్రి ఔట్ పేషంట్ విభాగానికి రోజూ 2,500 మంది, ఇన్‌పేషంట్ విభాగానికి 1,500 మంది వస్తుంటారు. మరో 2,500 మంది వరకు సిబ్బంది ఉంటారు. మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు సరిపడ నీరు సరఫరా కాకపోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నాయి. వైద్యులే కాదు ఎవరైనా రోగులు మందు బిల్ల వేసుకునేందుకు నీరు కావాలంటే పైసలు పెట్టి కొనుక్కోవాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment