హైదరాబాద్: అవయవ మార్పిడి ఆపరేషన్లలో నిజాం వైద్య విజ్ఞాన సంస్ధ(నిమ్స్) తన ప్రత్యేకతను మరోసారి చాటి చెప్పింది. గతంలో ఎన్నో విజయాలను పదిలపర్చుకున్న నిమ్స్ తాజాగా మారో అరుదైన రికార్డు సృష్టించి వైద్య రంగాలలోనే సంచలనం సృష్టించింది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేసి అరుదైన రికార్డును వైద్యులు సొంతం చేసుకున్నారు.
ఇందులో 61 లైవ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయగా, 39 దాతల ద్వారా సేకరించినవి.. గ్రహీతల్లో 11, 12 ఏళ్ల వయసువారు కూడా ఉండడం చెప్పుకోదగ్గ అంశం. శుక్రవారం వందో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసిన వైద్య బృందంలో యూరాలజీ వైద్యనిపుణులు ప్రొఫెసర్ రామ్‌రెడ్డి, విద్యాసాగర్, రామచంద్రయ్య, తదితరులు ఉన్నారు. వీరంతా యూరాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స మార్పిడిలు చేస్తున్నారు.
గత నెలలో రూ.32 కోట్లతో సమకూర్చుకున్న అడ్వాన్స్‌డ్ పరిజ్ఞానం ఉన్న రోబోటిక్స్ సాయంతో యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లో అత్యంత సంక్లిష్టమైన నెల రోజుల వ్యవధిలోనే 30 అపరేషన్లను చేశారు. గాల్‌బ్లాడర్, హెర్నియా, ఆచలాసియా కార్డియా సర్జరీలను చిన్న రంధ్రంతో సులువుగా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తున్నారు. సాధారణ పద్దతుల్లో చేసే సర్జరీలతో పోల్చితే రోబోటిక్ సర్జరీలు కూడా చాలా కచ్చితంగా జరుగుతున్నాయి. ఆపరేషన్ జరిగిన మూడు రోజుల్లోనే రోగి డిశ్చార్జి కావడం విశేషం.
హరీష్‌రావు మంత్రి ప్రశంసలు..
అత్యధిక మార్పిడి ఆపరేషన్లు చేసి నిమ్స్ వైద్యులు చెప్పుకోదగ్గ రికార్డును నెలకొల్పారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రశంసించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ల్లో రికార్డు బ్రేక్ చేసి యూరాలజీ వైద్యులను మంత్రి ఎక్స్(ట్విట్టర్)లో అభినందించారు. ఈ అసాధారణ అవయవ మార్పిడి ద్వారా ప్రాణాలను కాపాడాలనే తమ అచంచలమైన నిబద్ధతను హైలైట్ చేస్తోందన్నారు.
ఎంత పెద్ద శస్త్రచికిత్స అయినా..
ఎంత పెద్ద శస్త్రచికిత్సనైనా సులువుగా చేయవచ్చు. రోబోటిక్ సర్జరీలను ప్రారంభించిన అనతికాలంలోనే పెద్ద సంఖ్యలో విజయవంతంగా ఆపరేషన్లు చేయడం నిమ్స్ వైద్యుల ప్రతిభకు తార్కాణం. ఇప్పడు ఆస్పత్రిలో నొప్పి తక్కువతో.. ఇన్‌ఫెక్షన్లకు తావులేకుండా చేస్తున్నాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, సంచాలకులు, నిమ్స్
Comments
Please login to add a commentAdd a comment