నిమ్స్‌లో వైద్యులకు కరోనా పరీక్షలు..! | Coronavirus Tests to NIMS Hospital Staff Hyderabad | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో వైద్యులకు కరోనా పరీక్షలు..!

Published Tue, Jun 16 2020 11:07 AM | Last Updated on Tue, Jun 16 2020 11:07 AM

Coronavirus Tests to NIMS Hospital Staff Hyderabad - Sakshi

లక్డీకాపూల్‌ : అంతర్జాతీయ వైద్య  ప్రమాణాలతో కూడిన నిమ్స్‌ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ వెంటాడుతుంది. ఫలితంగా ఆస్పత్రిలోని వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, ఉద్యోగులు వైరస్‌ బారినపడుతున్నారు. ఇప్పటికే కరోనా వైరస్‌ లక్షణాలు  బయటపడగా మరికొంత మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా సోకినట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో  22 మంది వైద్యులు, 20 మంది పారామెడికల్‌ సిబ్బంది నిమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స  పొందుతున్నారు.  వీరిలో చాలా వరకు  వైరస్‌ ప్రభావం తీవ్రత తగ్గుముఖం పట్టడంతో హోం క్వారంటైన్‌కు వెళ్లారు. తాజాగా పాజిటివ్‌గా నమోదైన నిమ్స్‌  నెఫ్రాలజీ విభాగం హెచ్‌ఓడీ సోమవారం హోం  క్వారంటైన్‌కు వెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో క్యాథ్‌లాబ్, కార్డియాలజీ, నెఫ్రాలజీ విభాగాలకు వచ్చిన రోగుల ద్వారానే వైరస్‌ సోకినట్లు నిమ్స్‌ వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. మరో పక్క  ఆపరేషన్‌ థియేటర్లలో కూడా  వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదని ఓ సీనియర్‌ వైద్యుడు పేర్కొన్నారు. ఏదైనా ఆపరేషన్‌ జరిగిన సందర్భంగా అక్కడున్న వైద్యులంతా కలిసి ఒకే చోట భోజనం చేయడం పరిపాటి.  ఆ సమయంలో మాస్కులు  ఉండవు.

దాని వల్ల కూడా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదంటున్నారు. దీంతో వెద్యులందరికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు  సన్నద్ధమవుతున్నట్టు ఓ సర్జన్‌ పేర్కొన్నారు. వైద్యులతో  పాటుగా పారామెడికల్‌ సిబ్బంది,  ఉద్యోగులకు సైతం ప్రాధాన్యతా  క్రమంలో పరీక్షళ/ నిర్వహించాలన్న యోచనలో  యాజమాన్యం ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే శస్త్ర  చికిత్సలను నిలిపివేయాలని యాజమాన్యం సూచించింది. అయితే  లాక్‌డౌన్‌  ఎత్తివేసిన అనంతరం 25మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్టు సమాచారం.  నిమ్స్‌ ఆస్పత్రిలో ప్రస్తుతం 150 మంది వైద్యులు ఉండగా వీరిలో దాదాపు 25 మందికి పాజిటివ్‌గా నమోదైనట్టు తెలుస్తోంది. అలాగే పారామెడికల్‌ సిబ్బంది 200 మంది ఉండగా వీరిలో 20మందికి పైగా వైరస్‌ సోకినట్లు సమాచారం. కాంట్రాక్టు సిబ్బంది 400మందిలో  25 శాతం మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.   అంతే కాకుండా  రెసిడెంట్‌ డాక్టర్లు సుమారు 400మందికి గాను  75 శాతం మేరకు కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆయా వర్గాలు  పేర్కొంటున్నాయి.  ఈ క్రమంలో  ప్రతి ఒక్కరికి వైరస్‌ సోకే ప్రమాదం లేకపోలేదని, ఆ దిశగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినిహా చేయగలిగినదేమీ లేదని ఓ జూనియర్‌ డాక్టర్‌ పేర్కొన్నారు. ఏది ఏమైనా వైరస్‌ కారణంగా మరణాలు లేకపోవడం గమనార్హం. పాజిటివ్‌గా నమోదైన వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిలో చాలా వరకు ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డు నుంచి హోం క్వారంటైన్‌కు వెళుతున్నారు. కానీ వైద్యులు  సైతం భయం భయంగానే వైద్య సేవలందిస్తున్నారని ఓ ఉద్యోగి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement