లక్డీకాపూల్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా కావాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గవర్నర్ నిమ్స్ ఆసుప్రతిని సోమవారం సందర్శించారు. తొలుత మిలీనియం బ్లాక్ మొదటి అంతస్తులో కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న వైద్యులు, సిబ్బందిని పరామర్శించారు. అనంతరం తమిళిసై మాట్లాడుతూ.. చేతులు జోడించి మరీ అభ్యర్థిస్తున్నా, మాస్కులు ధరించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం చేయాల్సింది చేస్తోందని, ప్రజలు కూడా వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైద్యశాఖ, పోలీసు, జర్నలిస్టుల ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు.
కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్యుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వారిని పరామర్శించినట్లు తెలిపారు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను గమనిస్తుంటే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోందన్నారు. కరోనా వ్యాప్తిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పాటిస్తున్న విధానాల్లో మరిన్ని మార్పులు అవసరమన్నారు. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వాటి సంఖ్య మరింత పెంచాల్సి ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే విశ్వాసం తనకుందన్నారు. కార్యక్రమంలో నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.మనోహర్, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేవీ కృష్ణారెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment