
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య కరోనా విభేదాలు సృష్టించింది. కోవిడ్ బాధితులకు అందుతున్న వైద్యం తీరుతెన్నులపై చర్చించేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం సమీక్ష తలపెట్టారు. అయితే, ఈ సమీక్షకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గైర్హాజరయ్యారు. ఇది ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. గవర్నర్ నిర్వహించే సమీక్షకు రావాలని రాజ్‌భవన్ నుంచి పిలుపు వెళ్లినా... ముందే నిర్దేశించుకున్న ఇతర సమావేశాల్లో బిజీగా ఉన్నందున హాజరుకాలేమని సీఎస్, వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమాచారమిచ్చినట్టు తెలిసింది.
కరోనా నిర్థారణ పరీక్షలు, రోగులకు చికిత్స విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని, రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు సైతం లభించడం లేదని, ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయని చాలామంది నెటిజన్లు సామాజిక మాధ్యమాల ద్వారా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వీటిపై చర్చించేందుకు గవర్నర్ సమీక్షను తలపెట్టారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచనల మేరకే సీఎస్‌తోపాటు హెల్త్ కార్యదర్శి ఈ సమావేశానికి గైర్హాజరయ్యారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా సీఎం కేసీఆర్ హైదరారాబాద్‌లో అందుబాటులో లేని సమయంలో గవర్నర్ ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనతో ఈ సమీక్షకు వెళ్లవద్దని సూచించినట్లు తెలుస్తోంది.
నేడు ప్రైవేటు ఆస్పత్రులతో గవర్నర్ సమావేశం
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో గవర్నర్ తమిళసై సౌందరాజన్ మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో సమావేశం నిర్వహించనున్నారు. కరోనా రోగుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా ఫీజులను వసూలు చేస్తున్నాయని విమర్శలు రావడంతో గవర్నర్ ఈ సమావేశం నిర్వహించ తలపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment