
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ కారణంగా మూతపడిన ఉన్నత విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ బోధనను మరింత మెరుగుపర్చాలని, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా విద్యా బోధన, పరీక్షల నిర్వహణ వంటి చర్యలు చేపట్టాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. యూనివర్సిటీల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణపై ఆమె శుక్రవారం యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు నిర్వహించే రక్తదాన శిబిరాల నిర్వహణను రెడ్‌క్రాస్ సొసైటీ సమన్వయంతో చేపట్టాలన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతకు మెరుగుపెట్టేలా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. వాటి ద్వారా విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు చిగురిస్తాయన్నారు. విద్యార్థులంతా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
ప్రస్తుతం ఆన్‌లైన్ తరగతులకు 70–80 శాతం మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఈ సందర్భంగా రిజిస్ట్రార్లు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మాత్రం కనెక్టివిటీ, బ్యాండ్ విడ్త్ సమస్యలతో హాజరు కాలేకపోతున్నారని వెల్లడించారు. డిగ్రీ కోర్సుల్లో ఇప్పటికే 70 నుంచి 80 శాతం సిలబస్ పూర్తి అయిందని, పీజీ కోర్సుల్లో 80 నుంచి 90 శాతం సిలబస్ పూర్తయిందని వివరించారు. ఇందుకు రిజిస్ట్రార్లను గవర్నర్ అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ తర్వాత రెండు మూడు వారాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, వార్షిక పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడతామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. డిగ్రీలో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల డిటెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వ ఆమోదం తీసుకొని ఉత్తర్వులు జారీ చేస్తామని వివరించారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ రిజిస్టార్ ఎ.గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, లాక్‌డౌన్ తర్వాత విద్యార్థుల పరీక్షల నిర్వహణకు రెండు మూడు వారాల సమయం ఉండనున్న నేపథ్యంలో తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహించాలని జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment