నిమ్స్‌లో ఆందోళన చేస్తున్న వైద్య సిబ్బంది
కరోనా వైరస్ కబందహస్తాల్లో అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రమాణాలను అందించే నిమ్స్ ఆస్పత్రి విలవిలాడుతున్నది. సోమవారం నుంచి కరోనా తన ప్రతాపాన్ని చూపుతోంది. ఫలితంగా ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లు, వైద్య సిబ్బంది, కార్మికులు కోవిడ్–19 వైరస్ బారిన పడుతున్నారు. వైద్యులకు నిమ్స్‌లోనే వైద్యం అందించి.. తమకు బయటి ఆస్పత్రుల్లో చికిత్స ఇప్పిస్తుండటంపై సిబ్బంది, కార్మికులు ఆందోళనకు దిగారు.
లక్డీకాపూల్: కోవిడ్ బారినపడి ఇప్పటికే పది మందికిపైగా వైద్యులు చికిత్స పొందుతున్నారు. మరో 20 మందిని హోం క్వారంటైన్‌కి సిఫార్సు చేశారు. డాక్టర్స్ క్లబ్‌లోని రెసిడెంట్ డాక్టర్లందరూ వైరస్ లక్షణాలతో బాధపడుతున్నట్టు విశ్వనీయ సమాచారం. దీంతో యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మూడు కీలకమైన విభాగాలలోని వైద్యులు, సిబ్బంది, కార్మికుల నమూనాలను సేకరించినట్టు సమాచారం. ఈ క్రమంలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల నుంచి 20 మంది చొప్పున నమూనాలను సేకరించి కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల నివేదికలు రావాల్సి ఉంది. శుక్రవారం మహిళా వైద్యురాలితోపాటు మహిళా ఉద్యోగికి పాజిటివ్ నిర్ధారణ అయింది. గురువారం ఒక ప్రొఫెసర్, ముగ్గురు వైద్యులు, ఒక రోగి సహాయకునికి వైరస్ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించారు. వీరికి నిమ్స్ మిలీనియం బ్లాక్‌లోని మొదటి అంతస్తులో చికిత్స అందిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో శస్త్ర చికిత్సలను నిలిపివేశారు.(నిమ్స్‌లో భయం భయం: వైద్య సిబ్బందికి కరోనా)
నిమ్స్‌లో ఆందోళన చేస్తున్న వైద్య సిబ్బంది
ఇంత వివక్షనా!
ఉద్యోగులు, సిబ్బందికి ఇతర ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తుండటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. యాజమాన్య వైఖరిని ఉద్యోగులు, కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. శుక్రవారం ఉదయం కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. తమకు కూడా వైద్యులతోపాటు కోవిడ్–19 చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. మాస్క్‌లు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లను సరఫరా చేయాలని కోరారు. కరోనాకు గురైన డాక్టర్లకు నిమ్స్‌లో వైద్యం.., మిగిలిన సిబ్బందికి బయట ఆస్పత్రుల్లో వైద్యమా? ఇదెక్కడి న్యాయం అంటూ ముక్తకంఠంతో యాజమాన్యాన్ని నిలదీశారు. కోవిడ్–19 బారిన పడిన నిమ్స్ సిబ్బందికీ నిమ్స్‌లోనే వైద్యం అందించాలని ప్ల కార్డులను ప్రదర్శించారు. తమకు తగిన న్యాయం జరిగేంత వరకు విధుల్లోకి వెళ్లబోమని భీష్మించుకూర్చున్నారు.
ఆందోళన వద్దు.. భద్రత కల్పిస్తాం
కోవిడ్–19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరికీ భద్రత కల్పిస్తాం. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్యులతోపాటు సిబ్బందికి, కార్మికులకూ కోవిడ్ పరీక్షలు, చికిత్స అందిస్తాం. కార్మికుల సహా అందరికీ మాస్క్‌లు, గ్లౌజ్‌లు, అవసరమైన వారికి పీపీఈ కిట్లను అందజేస్తాం. హైపోక్లోరైడ్ స్ప్రే చేయిస్తున్నాం. శానిటైజ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం.– డాక్టర్.కె.మనోహర్, డైరెక్టర్, నిమ్స్
Comments
Please login to add a commentAdd a comment