ఇదో! డబ్బు గబ్బు
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన సుధాకర్ తన భార్యకు ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడంతో నిమ్స్ ఆసుపత్రికి వచ్చాడు. పరిస్థితి ప్రమాధకరంగా ఉండడంతో రూ. 5 వేలు చెల్లించి అడ్మిట్ చేశాడు. మూడు రోజుల తర్వాత బిల్లు రూ. 50 వేలు అయింది అని చెప్పడంతో డ్రైవర్‌గా పనిచేసే తన వద్ద అంత డబ్బులేదు..
ఎస్టిమేషన్ వేసి ఇస్తే సీఎం రిలీఫ్ ఫండ్ లేదా ఇతర మార్గాల ద్వారా డబ్బును సమకూర్చుకుంటానని డాక్టర్‌కు చెప్పాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన వైద్యుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే తమ ఆసుపత్రి ఈ దుస్థితి ఎదుర్కొంటోందని అదే అడ్మిట్ చేసే సమయంలో చెబితే...ఏ గాంధీకో లేదా ఉస్మానియాకో పంపేవాణ్ని కదా అంటూ రోగి సహాయకులపై విరుచుకుపడ్డాడు. డబ్బులు లేనివాడివి నిమ్స్‌కు ఎందుకు వచ్చావ్.? అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం సుధాకర్ ఒక్కరికే కాదు ఇలా ప్రతి రోజు అన్ని డిపార్ట్‌మెంట్లలో ఎందరో రోగులకు ఎదురౌతోన్న పరిస్థితి ఇది. ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి రోగులను చేర్చుకోవడానికి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకునే రోగులకు మాత్రం వెంటనే బెడ్లు మంజూరు చేస్తూ వైద్యం అందిస్తున్నారు. అదే ప్రభుత్వ పథకాలు ఉన్న రోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని గొప్పగా చెప్పుకునే నిమ్స్‌లో పేదలకు వైద్యం అందని ద్రాక్షగానే ఉంది. ఇక ఓపీల విషయానికి వస్తే ఉదయం ఓపీల్లో వైద్యులు 8 గంటలకు రావాల్సి ఉండగా చాలా మంది వైద్యులు 11, 12 గంటలకు కూడా రావడం లేదు. ఉదయం ఓపీల్లో పేద రోగులకు కేవలం రూ. 50కే చూడాల్సి రావడమే కారణం. అదే సాయంత్రం ఓపీల్లో మాత్రం రూ. 300లు వసూలు చేసి, అందులో 150 నిమ్స్‌కు, మరో 150 వైద్యుని ఖాతాలో జమ చేస్తుంటారు. దాంతో అందరూ వైద్యులు సాయంత్రం ఓపీలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దాంతో పేద రోగులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైద్యులు బయట మెడికల్ షాపులతో సంబంధాలు పెట్టుకొని కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారని స్వయంగా నిమ్స్ ఉద్యోగులే అంటున్నారు. తాను సూచించిన మెడికల్ షాపులోనే ఈ మందులు దొరుకుతాయి. అక్కడే తీసుకోవాలి అని సూచిస్తున్నట్లు తెలిసింది. అవినీతిని రూపుమాపి పేద రోగులకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని నిమ్స్ ఉన్నతాధికారులు పేర్కొంటుంటారు. వారు తమ ఆసుపత్రిలో జరుగుతున్న ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రోగులు, రోగుల సహాయకులు కోరుతున్నారు.