పంజగుట్ట: నిమ్స్ ఆస్పత్రిలో శనివారం నుంచి కొత్తగా మాస్టర్ హెల్త్ చెకప్ సేవలు ప్రారంభిస్తున్నట్లు నిమ్స్ మెడికల్ డైరెక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నిమ్స్‌లో ఆయన విలేకరులకు వాటి వివరాలు వెల్లడించారు. మాస్టర్ హెల్త్ చెకప్‌లో రూ.5 వేల ప్యాకేజీతో అన్ని రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఈసీజీ, చెస్ట్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ తదితర పరీక్షలు చేస్తామన్నారు. ఇందులో మొత్తం 16 రకాల వైద్య పరీక్షలు ఉంటాయన్నారు. ఎక్స్‌లెంట్ హెల్త్ చెకప్ కింద ఎనిమిదివేలు చెల్లిస్తే 23 రకాల పరీక్షలు జరుపుతామన్నారు. లైఫ్ చెకప్ పరీక్షలు పురుషులకు రూ.15 వేలు, మహిళలకు రూ.16 వేలతో 29 రకాల పరీక్షలు చేస్తామన్నారు. మహిళలకు ఒక్క పరీక్ష అదనంగా ఉంటుందని అందుకే రూ.వెయ్యి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందన్నారు.
ఈ పరీక్షల ద్వారా మనిషిలో ఏ వ్యాధి ఉన్నా నిర్ధారించవచ్చునన్నారు. ఈ సేవలతో పాటు ఆయుష్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కార్డియాలజిస్ట్, జనరల్ మెడిసిన్ వైద్యులు, రేడియాలజీ వైద్యులు, ఆయుష్ వైద్యులు ఈ ప్రత్యేక ప్యాకేజీ కేంద్రంలో ఉంటారన్నారు. నిమ్స్‌లోని పాత భవనంలో పాత కాథలాబ్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ సెంటర్‌లో ఈ సేవలు లభిస్తాయన్నారు.వివరాలకు 040–23489022 నంబరు, https://nims.edu.in, నిమ్స్ హెచ్‌ఎమ్‌ఐఎస్ తదితర యాప్‌లను సంప్రదించి ప్రత్యేక బుకింగ్ చేసుకోవచ్చునన్నారు. ఇదే కేంద్రంలో ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా తమ సేవలు పొందేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలో అత్యంత ఖరీదైన ఈ పరీక్షలు నిమ్స్‌లో తక్కువ ధరలకే నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్నవారు వీటిని వినియోగించుకోవాలని కోరారు.
నిమ్స్‌లో ఇకపై మాస్టర్ హెల్త్ చెకప్ సేవలు
Published Sat, Sep 7 2019 3:29 AM | Last Updated on Sat, Sep 7 2019 3:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment