సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ప్రైవేట్ ఆసుపత్రులు/ల్యాబ్స్‌లో కరోనా వైద్య చికిత్స/పరీక్షలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్‌లో సౌకర్యాలను పరిశీలించిన తర్వాతే పరీక్షలు, చికిత్సలకు అనుమతివ్వాలని ఐసీఎంఆర్‌ను కూడా ఆదేశించింది. గాంధీ, నిమ్స్ వంటి నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా పరీక్షలు, చికిత్స చేయించుకోవాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. రోగి ఎక్కడ వైద్యం చేసుకోవాలో ప్రభుత్వం నిర్దేశించడం రాజ్యాంగం కల్పిం చిన వ్యక్తి స్వేచ్ఛకు విరుద్ధమని, జీవించే హక్కులో భాగమే ఆరోగ్యం ఉంటుందని, జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందని ధర్మాసనం పేర్కొంది. (జంతువుల నుంచే 75 శాతం ఇన్‌ఫెక్షన్లు)
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల సేవలు కూడా ఎంతో ముఖ్యమని, ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించింది. అందుకే ఐసీఎంఆర్ ప్రైవేట్ ల్యాబ్స్‌ను గుర్తించి అనుమతులు ఇచ్చిందని తెలిపింది.
అనుమతిస్తే తప్పేంటి?
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలకు అనుమతులు ఇస్తున్నప్పుడు కరోనా వైద్యానికి అనుమతిస్తే తప్పేంటని ప్రశ్నించింది. పూర్తిగా ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌లను కాదనడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం అవుతుందని తెలిపింది. ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్‌లో కరోనా చికిత్స, పరీక్షలు నిర్వహించడాన్ని నిలిపేయాలంటూ గత ఏప్రిల్ 11న హైదరాబాద్ డీఎంహెచ్‌ఓ జారీ చేసిన ఉత్తర్వులను నగరానికి చెందిన గంటా జయకుమార్ సవాల్ చేశారు. మార్చి 21న పరీక్షలు, చికిత్సలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు.
ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనాకు మాత్రమే వైద్యం, పరీక్షలు చేయాలని, ఇతర రోగాలకు వైద్యం చేయకూడదని ఏప్రిల్ 11న షరతు పెట్టి ఆ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో అసలే పరీక్షలు చేయడానికి వీల్లేదని ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ధర్మాసనానికి పిల్‌లో పిటిషనర్ తెలిపారు. అయితే ఇది ప్రజాహిత వ్యాజ్యం కాదని, పిల్ వెనుక ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. డబ్బు చెల్లించే వ్యక్తి నచ్చిన చోట వైద్యం చేయించుకునే హక్కు ఉంటుందని, ప్రభుత్వం చెప్పిన చోటే వైద్యం చేయించుకోవాలనడం వ్యక్తి స్వేచ్ఛను హరించడమే అవుతుందని పేర్కొంది.
పరిశీలించాకే అనుమతులు..
‘కరోనా పరీక్షలు, చికిత్స చేసే సౌకర్యాలు ఉన్న ఆసుపత్రుల నుంచి ఐసీఎంఆర్ దరఖాస్తులు స్వీకరించాలి. వాటిని వైద్య రంగ నిపుణులు పరిశీలించాలి. క్షేత్ర స్థాయిలో పరిశీలించి వైద్య నిపుణలు, ఇతర వసతులను అధ్యయనం చేశాక అనుమతి ఇవ్వాలి. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి.
అనుమతి పొందబోయే ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఐసీఎంఆర్, కేంద్ర మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలి. కరోనా ఉన్న వారికి వైద్యం చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా పరీక్షలు చేయించుకున్న వారి వివరాలతో పాటు పాజిటివ్ అని నిర్ధారణ అయిన వారి వివరాలను అనుమతి పొందబోయే ఆసుపత్రులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలపాలి’అంటూ ఐసీఎంఆర్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment