‘శ్వాసనాళ, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఇప్పటికే బాధపడుతున్న వారు తాము వాడుతున్న మందులను కొనసాగించాలి. ఆస్తమా, సీఓపీడీ, టీబీ, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తలు పాటించాలి. సాధారణ జలుబు, ఫ్లూ లక్షణాలుంటే కరోనాకు గురయ్యే అవకాశాలెక్కువ. కాబట్టి వీలైనంత వరకు ఇవి రాకుండా చూసుకోవాలి. వాతావరణం వేడిగా ఉంటే వైరస్ వ్యాపించదనేది అపోహ మాత్రమే. కరోనాను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ మరో ఏడాది నుంచి ఏడాదిన్నరలోగా రావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరాన్ని పాటించడమొక్కటే మార్గం’అని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) పల్మనరీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ జీకే పరంజ్యోతి సూచించారు. శ్వాసనాళ, శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతర అనారోగ్యాలతో బాధపడుతూ చికిత్సపొందేవారు కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. వివరాలు డాక్టర్ మాటల్లోనే..
స్టెరాయిడ్ ఇన్‌హేలర్‌ను వాడండి
ఆస్తమా రోగులు స్టెరాయిడ్ ఇన్‌హేలర్‌ను వాడుతూనే ఉండాలి. దీని వాడకం కరోనాను కొంతమేర నిరోధిస్తుందని చైనీయుల అనుభవాలు చెబుతున్నాయి. లేదంటే ఆస్తమా ముదిరి కరోనా లక్షణాలు పెరగొచ్చు. ఆస్తమా రోగులు కరోనా ద్వారా మరిన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారనే దానికి ఎలాంటి ఆధారాల్లేవు. ఇప్పటివరకు కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరిన వారిలో చాలామందికి గతంలో ఎలాంటి శ్వాస సంబ«ంధ సమస్యలు లేవు. ఆస్తమాతో బాధపడుతూ కరోనా బారినపడిన వారి సంఖ్య ఇప్పటివరకు స్వల్పంగానే ఉన్నా, చికిత్స తర్వాత వీరు రికవరీ అవుతున్నట్టే నివేదికలు చెబుతున్నాయి. కరోనాకు భయపడి ఆస్తమా కోసం తీసుకుంటున్న చికిత్సను అశ్రద్ద చేయొద్దు.
హృద్రోగ, శ్వాసకోశ వ్యాధులతో జాగ్రత్త
కరోనా బారినపడిన చాలామందిలో కొద్దిగా అస్వస్థతతో పాటు జలుబు, జ్వరం లక్షణాలు కనిపిస్తున్నాయి. తీవ్ర హృద్రోగ, శ్వాసకోశ సంబంధ వ్యాధులున్న వారిపై కరోనా ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా 80 ఏళ్లు పైబడిన వారిపై ఇది ప్రభావం చూపుతుంది. శ్వాసనాళం, ఊపిరితిత్తుల సమస్యలున్న వారు కరోనా బారినపడే అవకాశాలెక్కువ. శ్వాసనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే ఊపిరితిత్తుల నుంచి తెమడను బయటకు పంపి కరోనా బారినపడే అవకాశాలను తగ్గిస్తుంది. ఒకవేళ దగ్గు, జ్వరం వచ్చినా శ్వాస వ్యవస్థను ఆరోగ్యంగా పెట్టుకోవడంతో పాటు, జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ వాడాలి. బ్రాంకియెక్టసిస్ (శ్వాసనాళం, దాని శాఖలు ఉబ్బడం) తీవ్రంగా ఉన్నా, దీర్ఘకాలంగా ఛాతీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నా, శ్వాససంబంధ సమస్యలకు దీర్ఘకాలంగా యాంటీ బయోటిక్స్ వాడుతున్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిపట్టునే ఉండి సామాజిక దూరం పాటిస్తూ, కొద్ది వారాల పాటు విశ్రాంతి తీసుకోవడం ఉత్తమం.
వైరస్‌ను తట్టుకోలేని ‘సీఓపీడీ’
ఎంఫిసిమా, క్రానిక్ బ్రాంకైటిస్ తదితర ఊపిరితిత్తుల సమస్యలు సీఓపీడీ (శ్వాస మార్గం మూసుకుపోయి ఊపిరి తీసుకోలేకపోవడం)కి దారితీస్తాయి. సీఓపీడీతో బాధపడుతున్న వారు కరోనా బారినపడే అవకాశాలెక్కువ. వీరి ఊపిరితిత్తులు కొంతమేర దెబ్బతిని ఉంటాయి కాబట్టి కరోనా వైరస్‌ను తట్టుకునే శక్తి తక్కువుంటుంది. వాస్తవానికి కరోనా బారినపడే వారిలో సుమారు 50 శాతం మందిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించవు. కొందరిలో స్పల్పంగా జలుబు, ముక్కు కారడం, కండరాల నొప్పి, జ్వరం, దగ్గు లక్షణాలు ఉంటాయి. మరికొందరిలో ‘ఫ్లూ’తరహాలో జలుబు, కండరాల నొప్పి, అలసట ఉంటుంది. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండే వారిలో న్యూమోనియా, శ్వాస ఆడకపోవడం, దగ్గు అదనపు లక్షణాలుగా ఉంటాయి. సీఓపీడీ రోగులకు ఊపిరితిత్తులతో సమస్య మొదలై కరోనా బారినపడితే ఊపిరాడని పరిస్థితికి చేరుకుంటారు. అయితే చాలామంది సీఓపీడీ రోగుల్లో కరోనా సోకినా లక్షణాలు బయట పడకుండానే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది.
ఆ ఔషధాలు వాడే వారిలో రిస్క్ ఎక్కువ
గతంలో ఏవైనా ఇతర వ్యాధుల బారిన పడ్డవారికి కరోనా సోకే అవకాశాలెక్కువనేది నిజం కాదు. అయితే హృద్రోగ, శ్వాస సంబంధ, డయాబెటిస్ లేదా రోగ నిరోధకశక్తిని తగ్గించే ఔషధాలు వాడే వారిలో కరోనా రిస్క్ ఎక్కువ. ఇతరులతో పోలిస్తే టీబీ వ్యాధిగ్రస్తులు కరోనా బారినపడే అవకాశాలెక్కువ. ఛాతీ సంబంధ వ్యాధులతో బాధపడే వారు ఒకవేళ కరోనా బారినపడినా లక్షణాలు కొద్దిగా బయటపడవచ్చు లేదా అసలు కనిపించకపోవచ్చు. టీబీ చికిత్స తీసుకుంటున్న వారు వైద్యుల సూచనతో మందులు వాడుతూ సామాజిక దూరం పాటించాలి. గతంలో ఊపిరితిత్తుల్లో కొంత భాగం తొలగించినా, ఊపిరితిత్తులు చిన్నవి (స్కోలియోసిస్)గా ఉన్నా కరోనా సోకుతుందనేది అపోహ మాత్రమే.
న్యూమోథొరాక్స్‌తో భయం లేదు
ఇతర అనారోగ్యంతో బాధపడేవారు లేదా ఆరోగ్యవంతుల్లోనూ న్యూమోథొరాక్స్ (ఊపిరితిత్తుల ఛాతీ గోడ నడుమ గ్యాస్) సంభవించినా కరోనా ప్రమాదం అంతగా ఉండకపోవచ్చు. అయితే న్యూమోథొరాక్స్‌తో పాటు సీఓపీడీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇతర ఊపిరితిత్తి సంబంధ సమస్యలు రిస్క్‌ను పెంచే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్‌ఫెక్షన్ ద్వారా న్యూమోథొరాక్స్ సంభవించడం అనేది చాలా అరుదు. గతంలో ఈ వ్యాధికి గురై కోలుకున్న వారు ఇతరుల కంటే కరోనా ప్రభావానికి ఎక్కువ గురవుతారనే దానికి దాఖలాల్లేవు. కరోనా బారినపడే వారిలో కొద్దిమందిలో మాత్రమే పల్మనరీ పైబ్రోసిస్ (ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం) సంభవిస్తుంది. దీనినెలా నివారించాలనే దానిపై పరిశోధనలు జరగాలి.
ముందు జాగ్రత్తలే మందు
కరోనాను అరికట్టేందుకు సమర్థవంతమైన చికిత్స విధానాలు త్వరలో అందుబాటులోకి వస్తాయి. వ్యాక్సిన్ ఏడాది నుంచి ఏడాదిన్నరలోగా అందుబాటులోకి రావచ్చు. కరోనా కట్టడికి ఇప్పటివరకు ప్రత్యేక చికిత్సంటూ ఏమీలేదు. విటమిన్ సీ, బీ కాంప్లెక్స్, జింక్ ప్రొటెక్టివ్ సప్లిమెంట్లు తీసుకోవాలి. కరోనా గాలి ద్వారా వ్యాపించదు. దగ్గు, తుమ్ముల నుంచి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. ఇతరులకు కనీసం రెండు మీటర్ల భౌతిక దూరం పాటించాలి. బయటకు వెళ్లేటపుడు మాస్కులు ధరించాలి. సబ్బుతో తరచూ చేతులు కడుక్కోవాలి. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటే సంబంధిత మందులను యథావిధిగా వాడాలి. ‘కరోనా’ అనుమానాలు ఉంటే వైద్యులను సంప్ర దించాలి.
Comments
Please login to add a commentAdd a comment