
గదులపై బాదేశారు
రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి రోగులకు పెద్ద దిక్కైన నిమ్స్ ఆస్పత్రిలో వైద్యసేవలు మోత మోగించనున్నాయి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి రోగులకు పెద్ద దిక్కైన నిమ్స్ ఆస్పత్రిలో వైద్యసేవలు మోత మోగించనున్నాయి! అక్కడకు వెళ్లాలంటేనే వణుకు పుట్టేలా గదుల చార్జీలు పెంచి రోగుల నడ్డి విరిచింది. నిమ్స్‌లో వైద్యసేవలు ఇక ఖరీదు కానున్నాయి. ఆస్పత్రికి ఆన్‌లైన్ హంగులు, అంతర్గత ఆదాయాన్ని పెంచేందుకు రోగులు చికిత్స పొందే గదుల అద్దెలను భారీగా పెంచుతూ ఆస్పత్రి కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి అధ్యక్షతన శుక్రవారం రాత్రి ఆస్పత్రిలో జరిగిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తాజా నిర్ణయం వల్ల కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్తోమత లేని పేద, మధ్యతరగతి రోగులపై 3 రెట్ల భారీ భారం పడింది. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు (మంచినీరు, మరుగుదొడ్లు, శానిటేషన్, నర్సింగ్, ల్యాబ్ సర్వీసులు) మెరుగుపర్చకుండా రోగులు విశ్రాంతి తీసుకునే పడకల చార్జీలను పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవీ నిర్ణయాలు...
నిమ్స్ ఆస్పత్రిలో పనిలో పారదర్శకత కోసం సిడాక్ సహకారంతో రూ.13.7 కోట్లతో ‘హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్’ ఏర్పాటు కానుంది. దీనిద్వారా మందులు, ఇతర యంత్ర పరికరాల కొనుగోలు, అమ్మకాలు, ఓపీ, ఐపీ రోగులు, ఏ విభాగంలో ఎంత మంది వైద్యులు, నర్సులు పని చేస్తున్నారు? ఎంత మంది చికిత్స పొందుతున్నారు తదితర వివరాలతో పాటు మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు.
ఏ ఆస్పత్రికైనా 30% ఆదాయం ఫార్మసీ నుంచే
ఇప్పటి వరకు ఆస్పత్రిలో ఫార్మసీ లేకపోవడం వల్ల రోగులు బయటి మెడికల్ షాపులను ఆశ్రయించాల్సి వస్తోంది. దీంతో నిమ్స్ ఆదాయాన్ని కోల్పోవడంతోపాటు రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో నిమ్స్‌లో సొంత ఫార్మసీని నెలకొల్పాలని నిర్ణయించారు. జనరిక్ మందులతో పాటు రోగుల అవసరాల దృష్ట్యా బ్రాండెడ్ ఔషధాలు కూడా విక్రయిస్తారు. పారదర్శకత కోసం ఫార్మసీలో స్టాక్, విక్రయాల వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
ఇకపై వ్యాధి నిర్ధారణ పరీక్షల నివేదికల జారీలో జాప్యాన్ని నివారించేందుకు చర్యలు. ట్రామా కేర్‌లో చికిత్స పొందుతున్న రోగుల కోసం అక్కడే మరో ల్యాబ్ ఏర్పాటు. ల్యాబ్‌లను ఆధునీకరించి ఆన్‌లైన్ ద్వారా నేరుగా ఆయా విభాగాలకు వైద్య పరీక్ష నివేదికలు జారీ.
ఉద్యోగులు ఆర్జిత సెలవులు(ఈఎల్స్) ఎన్‌క్యాష్ చేసుకునేలా సవరణ.
బీబీనగర్ నిమ్స్‌లో మధ్యలో నిలిచిపోయిన పనులను తిరిగి చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం రిటైర్డ్ ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేసి ప్రతిపాదనలు తయారు చేశారు. వచ్చే నవంబర్ నాటికి కనీసం 200 పడకల ఆస్పత్రినైనా అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు.
ఇతర ఆస్పత్రులతో పోలిస్తే తక్కువే..
నిమ్స్‌కు వస్తున్న రోగుల్లో 40 శాతం మంది ఆరోగ్యశ్రీ కార్డుదారులు కాగా మరో 40 శాతం మంది సీజీహెచ్‌ఎస్ కార్డుదారులున్నారు. 20 శాతం మంది మాత్రమే డబ్బు కట్టి వైద్యం చేయించుకుంటున్నారు. సీజీహెచ్‌ఎస్ పథకంలో బెడ్ చార్జీ రూ.1000 చెల్లిస్తుంటే నిమ్స్ లో రూ.200 మాత్రమే ఉంది. టారిఫ్‌లో వ్యత్యాసం వల్ల ఆస్పత్రి భారీగా నష్టపోవాల్సి వస్తోంది. సామాన్యులను, ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 12 ఏళ్ల తర్వాత అద్దెలను సవరించాల్సి వచ్చింది. ఆస్పత్రిలో సేవలను మరింత మెరుగుపరిచి అంతర్గత వనరుల నుంచి ఆదాయం సమకూర్చుకోవటంపై ఉద్యోగుల అభిప్రాయాలు కోరాం. ఇందులో 17 సూచనలు వచ్చాయి. అందరి ఆలోచన ప్రకారమే చార్జీలు పెంచాం. ఇవి ఇతర ఆస్పత్రులతో పోలిస్తే 50 శాతం తక్కువే.
- డాక్టర్ నరేంద్రనాథ్, నిమ్స్ డెరైక్టర్
రూ.3,000 చెల్లిస్తే 15 పరీక్షలు
‘మాస్టర్ హెల్త్ చెకప్ ప్యాకేజీ’లో భాగంగా నిమ్స్ ఆస్పత్రి రూ.3,000కు పలు పరీక్షలను అందుబాటులోకి తెచ్చింది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కంప్లీట్ యూరిన్ పిక్చర్, ఛాతీ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ అబ్డామల్, షుగర్, బ్లడ్ యూరియా, సీరమ్ క్రియాటిన్, సీరమ్ క్యాల్షియం, యూరిక్ యాసిడ్, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, 2 డీ ఎకో, లివర్ ఫనితీరు, థైరాయిడ్, బ్లడ్ గ్రూప్ లాంటి పరీక్షలతో పాటు జనరల్ మెడిసిన్ కన్సల్టేషన్ కూడా ఇస్తున్నారు. సత్వర సేవల కోసం ల్యాబ్‌లోని యంత్రాల్లో కొన్నింటిని పూర్తిగా వీరి అవసరాలకే కేటాయించారు.
నిమ్స్ ఆస్పత్రిలో గదుల రేట్లు(రోజుకు రూ.ల్లో)
విభాగం పాత చార్జీ కొత్త చార్జీ
జనరల్ వార్డు 200 600
ట్రిపుల్ షేరింగ్ 400 800
నాన్ ఏసీ గది 800 1,200
ఏసీ షేరింగ్ గది 1,200 2,000
ఏసీ సింగిల్ గది 2,000 3,000
ఐసీయూ చార్జీలు 1,500 3,000