సాక్షి, సిటీబ్యూరో : వైద్యుడు భగవంతుడికి ప్రతిరూపంగా భావించే రోజుల నుంచి అందినకాడికి దండుకునే దుస్థితికి వచ్చింది ప్రస్తుత పరిస్థితి. రోగి బాధను, భయాన్ని క్యాష్ చేసుకోవడమే పరమావధిగా మారింది. డాక్టర్లకు బదులు.. బడా వ్యాపార సంస్థలు వైద్య రంగంలోకి అడుగుపెట్టడంతో ‘వైద్యో నారాయణ హరి’ అన్న పదానికే అర్థం వెతుక్కోవాల్సివస్తోంది. ప్రత్యేక మార్కెటింగ్ టీమ్‌లను ఏర్పాటు చేసుకుని, ఆస్పత్రుల్లో బ్రాండింగ్ పేరుతో పని చేస్తున్నాయి. జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ వైద్యులు, కొందరు ఆర్‌ఎంపీలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. రోగులను ఆస్పత్రికి పంపినందుకు ప్రతిఫలంగా చెల్లించిన బిల్లులో 25 నుంచి 30 శాతం వారికి చెల్లిస్తున్నారు.
టార్గెట్‌కు మించి రోగులను పంపిన వైద్యులు, ఆర్‌ఎంపీలకు ఏడాదికోసారి విదేశీ టూర్లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో కాక్‌టెల్ డిన్నర్లు, విలువైన గిఫ్ట్‌లు, ఆఫర్ చేస్తున్నాయి. అవసరం లేకపోయినా వైద్య పరీక్షలు, చికిత్సలు చేస్తూ రోగుల నుంచి రూ.లక్షల్లో బిల్లులు వసూలు చేసి ఎవరి కమీషన్లు వారికి చెల్లిస్తున్నాయి. పేరున్న కార్పొరేట్ ఆస్పత్రులు కేవలం వైద్యులకు మాత్రమే కమీషన్లు చెల్లిస్తుండగా, జాతీయ రహదారుల వెంట కొత్తగా పుట్టుకొచ్చిన ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వైద్యులతో పాటు కొందరు ఆర్‌ఎంపీలకూ కమీషన్లు చెల్లిస్తున్నాయంటే వైద్యరంగం ఎంతటి దయనీయ దుస్థితికి దిగజారిందో అవగతమవుతోంది.
క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిన నిజాలివీ..
హైదరాబాద్ నగర శివారులోని కుంట్లూరు, సాహెబ్‌నగర్‌లో వేర్వేరుగా క్లినిక్స్ నిర్వహిస్తున్న ఓ ఆర్‌ఎంపీ దంపతులు తమ వద్దకు వచ్చిన రోగులను హస్తినాపుర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పంపుతున్నట్లు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనతో తేలింది. ఇందుకు ప్రతిఫలంగా సదరు ఆస్పత్రి యాజమాన్యం ఒక్కో రోగి చెల్లించిన మొత్తం బిల్లుపై 25 శాతం కమీషన్ చెల్లిస్తున్నట్లు సదరు ఆర్‌ఎంపీ దంపతులే స్వయంగా అంగీకరించడం విశేషం.
కొహెడ గ్రామంలోని మరో ఆర్‌ఎంపీ తమ వద్దకు వచ్చిన రోగులను నాగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పంపుతున్నాడు. ప్రతిఫలంగా ఆస్పత్రి యాజమాన్యం రోగి బిల్లులో 30 శాతం ఆర్‌ఎంపీకి కమీషన్‌గా చెల్లిస్తున్నట్లు తెలిసింది. నందనవనంలో పని చేస్తున్న మరో ఆర్‌ఎంపీ తమ వద్దకు వచ్చిన రోగులను బైరామల్‌గూడలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి సిఫార్సు చేసి, సదరు యాజమాన్యం నుంచి 25 శాతం కమీషన్ పొందుతున్నట్లు తెలిసింది. జిల్లా, మండల కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులు మొదలు గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీల వరకు ఇదే వరస.
అంబులెన్స్ డ్రైవర్లనూ వదలని ఆస్పత్రులు
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లను ఆశ్రయించిన క్షతగాత్రులను, ఇతర రోగులను కూడా వదలడం లేదు. ఆపదలో ఉన్న వ్యక్తిని తమ ఆస్పత్రిలొ చేర్పించినందుకు అంబులెన్స్ డ్రైవర్‌కు కమీషన్లు చెల్లిస్తున్నారు. ఇలా రోజూ ఒక్కో కేసుకు రూ.1500 చొప్పున లెక్కగట్టి కమీషన్లు ముట్టజెప్పుతున్నాయి. విజయవాడ, శ్రీశైలం, ముంబై, వరంగల్, నాగార్జునసాగర్ వైపు వెళ్లే జాతీయ రహదారుల వెంట వెలిసిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
ఐటీ హబ్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ నగరంలో అనేక ఔషధ కంపెనీలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వెలిశాయి. నిపుణులైన వైద్యులు, అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడ అందుబాటు ఉండటంతో నగర శివారు ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల రోగులు చికిత్సల కోసం ఇక్కడికి వస్తుంటారు. వీరిలో చాలా మందికి ఏ ఆస్పత్రిలో చేరాలనేదానిపై అవగాహన ఉండటంలేదు. దీంతో ఊర్లో అందరికీ తెలిసిన ఆర్‌ఎంపీనో లేదా పట్టణాల్లోని వైద్యుడినో ఆశ్రయిస్తుంటారు. తెలిసిన మనిషి కదా! కాస్త మంచి సలహా ఇస్తారని ఆర్‌ఎంపీ వద్దకు వెళ్తే.. చిన్న జబ్బుకు పెద్దపెద్ద ఆస్పత్రుల్లో చేర్పించి నిలువునా ముంచేస్తున్నారు.
ఆర్‌ఎంపీ మాట విని మోసపోయా..
మా బావమరిది రంజిత్ (32) హఠాత్తుగా కిందపడడంతో ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లాం. ఆయన వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అప్పటికే రూ.1.5 లక్ష లు అప్పు చేసి బిల్లు చెల్లించాం. బిల్లు తగ్గించాల్సిందిగా కోరితే.. మీకు బిల్లు తగ్గిస్తే ఆర్‌ఎంపీకి కమీషన్ ఎలా ఇస్తామని చెప్పారు. బిల్లు చెల్లించే స్థోమత లేకపోవడంతో సదరు ఆస్పత్రి వైద్యసేవలు నిలిపివేసింది. దీంతో ఇటీవల గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాం. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం పొందుతున్నాం.– మహేష్. కొప్పుల, వరంగల్ జిల్లా
చికిత్సలు నిలిపేశారు..
నా కుమారుడికి ఒంట్లో బాగులేకపోతే ఆర్‌ఎంపీ దగ్గరకు తీసుకెళ్లాను. ఆయన గోదావరిఖనిలోని ఓ ప్రైవే టు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రూ.2 లక్షలు చెల్లించాను. మరో రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అంత స్థోమత లేదని చెప్పడంతో చికిత్సలు నిలిపేసి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. చేసేదేమీలేక హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చాను. – కనకలక్ష్మి, కమాన్‌పూర్, పెద్దపల్లి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment