అంతా హైదరాబాద్ నుంచే..
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారుల కీలకపాత్ర!
– కార్డుకు రూ.200 ముట్టజెబుతున్న డీలర్లు
– ఈ–పాస్ విధానం అపహాస్యం
ఈ–పాస్ విధానంతో రేషన్ అక్రమాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే..ఇదంతా ఉత్తిదే. అక్రమార్కులు ఏదో ఒకవిధంగా కన్నం వేస్తూనే ఉన్నారు. ఈ–పాస్ విధానాన్ని కూడా అపహాస్యం చేస్తూ బోగస్ కార్డులతో భారీఎత్తున రేషన్ కొట్టేస్తున్నారు. ఈ వ్యవహారంలో డీలర్లకు స్వయాన పౌరసరఫరాల శాఖ సిబ్బందే దన్నుగా నిలుస్తుండడం గమనార్హం.
తాడిపత్రి : తాడిపత్రిలో కలకలం రేపుతున్న బోగస్ రేషన్‌కార్డుల వ్యవహారంలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ సిబ్బందే ఈ అక్రమాలకు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుల్లోని వ్యక్తుల ఆధార్ నంబర్లు మార్చడం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. వాస్తవానికి ఈ–పాస్‌లో ఆధార్ నంబర్ మార్చడం ఆషామాషీ కాదు. పౌరసరఫరాల శాఖ సాంకేతిక అధికారులతోనే ఇది సాధ్యం. దీంతో డీలర్లు హైదరాబాద్‌లోని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయ సిబ్బందితో లింక్ పెట్టుకున్నారు. ప్రతినెలా ఒక్కో బోగస్ కార్డుపై రూ.200 వరకు ఇస్తూ ఆధార్ నంబర్లు మార్పు చేయిస్తున్నారు. వాటి స్థానంలో తమకు సంబంధించిన వారి నంబర్లు నమోదు చేయిస్తున్నారు. వారి వేలిముద్రల ద్వారా సరుకులు తీసుకున్న తర్వాత ముందున్న నంబర్లను యథావిధిగా ఉంచుతున్నారు. ఉదాహరణకు.. నారాయణమ్మ అనే మహిళ పేరు మీద రేషన్ కార్డు ఉంటుంది. కానీ ఆమె సరుకులు తీసుకోదు. ఏదైనా అవసరానికి కార్డు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో దాన్ని తీసుకుని ఉంటుంది. ఆమె కార్డుకు సంబంధించిన ఆధార్ నంబర్ల స్థానంలో డీలర్‌కు చెందిన వారివి నమోదు చేస్తారు. వారితో ఈ పాస్ యంత్రంలో వేలిముద్ర వేయిస్తారు. సరుకులు డ్రా కాగానే మళ్లీ పాతవే ఉంచేస్తారు.
దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికే తెల్లరేషన్ కార్డులు ఇస్తారు. దాదాపు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఆరోగ్యశ్రీ, ఇతరత్రా వాటికి కార్డు తప్పనిసరిగా మారింది. దీంతో ఉన్నత స్థాయి, మధ్యతరగతి వారు కూడా తెల్లకార్డులు తీసుకుని తమ వద్ద ఉంచుకున్నారు. వీరంతా రేషన్ షాపులకు ఎప్పుడూ వెళ్లరు. తాడిపత్రిలో ఇలాంటి కార్డులు చాలానే ఉన్నాయి. వీటి ద్వారా డీలర్లు ప్రతినెలా నిత్యావసరాలను స్వాహా చేస్తున్నారు. వాటిని నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే వందల క్వింటాళ్ల బియ్యం నల్లబజారుకు తరలుతున్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. దీంతో ఆలస్యంగా మేల్కొన్న అధికారులు హడావుడి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బందాలతో బోగస్ కార్డులపై విచారణ చేయిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా బోగస్ కార్డులను గుర్తిస్తారా? ఒకవేళ గుర్తించినా ‘అధికార’ ఒత్తిళ్లను అధిగమించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే కొన్నాళ్లు వేచివుండక తప్పదు.