సాక్షి, హైదరాబాద్ : అవినీతి అధికారుల గుండెల్లో దడ పుట్టిస్తున్న ఏసీబీకి మరో తిమింగలం చిక్కింది. జీహెచ్‌ఎంసీ హుప్పుగూడ డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కుప్పానాయక్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి బుధవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కాంట్రాక్టర్ మహ్మద్ అజీజ్‌కు నిర్మించిన అర కిలోమీటర్ సీసీ రోడ్ వివరాలను రికార్డులో నమోదుచేసేందుకు రూ.లక్ష లంచం ఇవ్వమని కుప్పానాయక్ డిమాండ్ చేశాడు. ఒప్పందంలో భాగంగా రూ.30 వేలు తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కాడు. కుప్పానాయక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయితే కుప్పానాయక్‌పై 2013లోనే ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదుచేసినట్లు ఏసీబీ సిటీ జాయింట్ డైరెక్టర్ ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. రూ.1.5 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్లు పేర్కొన్నారు.