ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తాం
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని బీబీనగర్‌లో గల నిమ్స్ ఆస్పత్రికి రానున్న బడ్జెట్‌లో నిధులు కేటాయించి పూర్తి స్థాయి వైద్య సేవలు ప్రారంభించకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తామని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లు రవి హెచ్చరించారు. బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలు ప్రారంభించాలంటూ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి నిమ్స్ వద్ద మంగళవారం చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షకు ఆయన హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి బీబీనగర్‌లో నిమ్స్ ఆస్పత్రిని నిర్మించారని, అలాగే 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే.. రాష్ట్ర ప్రభుత్వం వాటికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు.