నిమ్స్ నూతన భవన నమూనా
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించ తలపెట్టిన 2,000 పడకల నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దీనికోసం సత్వరమే ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభా అవసరాల నేపథ్యంలో హైదరాబాద్ నలువైపులా ఒక్కోటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణంతోపాటు, నిమ్స్ విస్తరణకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
మొత్తం మూడు బ్లాకుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలు అందించేలా నిర్మాణానికి అనుమతులు తీసుకోవాలన్నారు. మంగళవారం సచివాలయంలో వైద్య ఉన్నతాధికారులతో నిర్వహించిన తొలి సమీక్షలో హరీశ్‌రావు మాట్లాడారు. 8 అంతస్తుల్లో నిర్మించే నూతన భవనం అందుబాటులోకి వస్తే, పడకల సంఖ్య 3,500కు చేరుతుందన్నారు.
అంతేగాక, సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ నిర్మాణం పూర్తయితే మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయని, దీంతో ఒక్క నిమ్స్‌లోనే మొత్తం 3,700 పడకలు ఉంటాయన్నారు. అలాగే, గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఇదే దేశంలో తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ అవుతుందని చెప్పారు.
సంతాన సాఫల్య కేంద్రం పనుల వేగం పెంచండి
గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటుచేస్తున్న సంతాన సాఫల్య, అవయవ మార్పిడి కేంద్రాల పనులు వేగవంతం చేయాలని హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. నిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేస్తున్నట్లుగా, గాంధీలోనూ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను నిర్దేశించారు.
బ్రెయిన్‌డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ పొందేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరా చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వం సమీకరించి పీహెచ్‌సీ, బస్తీ దవాఖానా, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కోవిడ్ సహా అన్ని రకాల వ్యాక్సినేషన్‌లో తెలంగాణ మొదటిస్థానంలో ఉండేలా కృషి చేయాలని సంబంధిత విభాగానికి ఆదేశించారు.
ఆదర్శప్రాయంగా ఉండాలి
ఆసుపత్రికి అందరికంటే ముందుగా వచ్చి, అందరి తర్వాత వెళ్లే డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు ఆదర్శప్రాయులని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ప్రతి రోజూ రెండు గంటలపాటు ఆసుపత్రుల్లో రౌండ్లు వేస్తూ, అన్ని విభాగాలు సందర్శిస్తే మెజార్టీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. బాధ్యతగా పని చేసి ప్రజల మన్ననలు పొంది, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణను మొదటిస్థానంలో నిలిపేందుకు సీఎం కేసీఆర్ రూ.12 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు. సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య శ్రీ సీఈవో విశాలాచ్చి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment