ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణమూర్తి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఏమైందో? అనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే.. ఆయనది స్వల్ప అస్వస్థతేనని వైద్యులు ప్రకటించారు.
ప్రసాద్ ల్యాబ్‌లో ఉండగానే నీరసంగా ఉండడంతో ఆయన నేరుగా నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు జరిగాయి. అయితే నారాయణమూర్తి స్వల్పంగానే అస్వస్థతకు లోనయ్యారని, చికిత్సతో క్రమంగా కోలుకుంటున్నారని, ఆయనకు నిర్వహించినవి కూడా సాధారణ టెస్టులేనని నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రెండు నెలల క్రితం నారాయణమూర్తి బైపాస్ చేయించుకున్నారు.
(చదవండి: గాయం వల్ల షూటింగ్స్‌కు దూరం.. క్షమించండంటూ జాతిరత్నాలు హీరో పోస్ట్)
ఒకప్పుడు వరుస విప్లవ సినిమాలను తెరకెక్కిస్తూ..‘పీపుల్ స్టార్’గా ఎదిగారు నారాయణ మూర్తి. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. కేవలం సినిమాల్లో నటించడమే కాదు..కథ- కథనం, దర్శకత్వం, సంగీతం, గానం.. ఇలా 24 శాఖల్లో పని చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
(చదవండి: సర్దార్ 2 సెట్స్‌లో ప్రమాదం.. ఒకరి మృతి)
అయితే గత కొంతకాలంగా నారాయణ మూర్తి తెరకెక్కించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. చాలా గ్యాప్ తర్వాత ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘యూనివర్సీటీ’ గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం కూడా విజయం సాధించలేదు. ప్రస్తుతం ఆయన ‘ఉక్కు సత్యాగ్రహం’ అనే సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు నిమ్స్‌లో డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆర్. నారాయణ మూర్తి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిన ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. త్వరగా కోలుకొని మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment