ఆస్పత్రి నుంచి ఇంటికి జగన్
సాక్షి, హైదరాబాద్: రెండు రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిగా కోలుకోవడంతో శనివారం ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అయితే ఆయన ఇంకా బాగా నీరసంగా ఉన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఈ నెల 5వ తేదీ ఉదయం నుంచి జగన్‌మోహన్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం బాగా క్షీణించి ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో 9వ తేదీ రాత్రి పోలీసులు జగన్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించడమే కాకుండా బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. కీటోన్స్(గ్లూకోజ్ నిల్వలు తగ్గి, కొవ్వు శక్తి రూపంలో వినియోగం అవుతున్నపుడు విడుదలయ్యే చెడు పదార్థాలు) ప్రమాదకర స్థాయికి చేరుకున్న దశలో ఆయనను ఆస్పత్రికి తరలించగా రెండు రోజులుగా అందుతున్న చికిత్స నేపథ్యంలో కీటోన్స్ సాధారణ స్థాయికి చేరుకున్నాయని వైద్యులు చెప్పారు.
అలాగే రక్తంలో చక్కెర నిల్వలు, రక్తపోటు, సోడియం నిల్వలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు నిమ్స్ వైద్యులు డాక్టర్ లక్ష్మీ భాస్కర్ చెప్పారు. అయితే ప్రస్తుతం జగన్ శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని, యాంటీ బయాటిక్స్ మందులు వాడుతూ కచ్చితంగా కనీసం మూడు రోజుల పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావొచ్చని సూచించామని, అయితే తప్పనిసరిగా విశ్రాంతి అవసరమని అన్నారు.
వరుస దీక్షలతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..
దాదాపు నెల రోజుల తేడాతోనే రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జగన్ ఆరోగ్యంపై తీవ్ర దుష్ర్పభావం చూపినట్టు వైద్యులు తెలిపారు. ఇకముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దీక్షలు చేయరాదని వారించారు. జగన్‌ను డిశ్చార్జి చేసిన అనంతరం నిమ్స్ వైద్యుడు లక్ష్మీ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ జగన్ దాదాపు పూర్తిగా కోలుకున్నారని, ఇక నివాసానికి వెళ్లవచ్చని చెప్పామన్నారు. జగన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినపుడు ఆయన సతీమణి వైఎస్ భారతి వెంట ఉన్నారు. జగన్ డిశ్చార్జి అవుతున్న సందర్భంగా పార్టీ ముఖ్యనేతలు కొణతాల రామకృష్ణ, వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డితో పాటు పలువురు రంగారెడ్డి జిల్లా నేతలు ఉదయం నిమ్స్ వద్దకు వచ్చారు.