
సాక్షి, హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రిలో ఇటీవల మృతి చెందిన రెసిడెంట్ డాక్టర్ శివతేజారెడ్డి ఘటనపై బుధవారం విచారణ కమిటీ నిమ్స్‌లో పర్యటించింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా, కమిటీ చైర్మన్ డాక్టర్ రాజారెడ్డి, తెలంగాణ వైద్య విద్యాశాఖ డెరైక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ మంజుల తొలిసారిగా విచారణ కోసం నిమ్స్‌కు వచ్చారు. ఎమర్జెన్సీ వార్డులోని 5వ ఫ్లోర్‌లో విచారణ ప్రారంభించారు. శివతేజారెడ్డి మార్చి 25న తన గదిలో ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ విచారణలో భాగంగా తొలిరోజు నిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివానందరెడ్డి, మాజీ అధ్యక్షుడు డాక్టర్ రఘు కిషోర్, ప్రతినిధులు శ్రీనివాస్‌గౌడ్, రెసిడెంట్ డాక్టర్లు శోభన్, సతీశ్, వంశీకృష్ణ తదితరులు కమిటీ ముందు హాజరయ్యారు. శివతేజారెడ్డి మంచితనం, విధి నిర్వహణలో ఆయన చూపే అంకిత భావం, సామాజిక సేవా కార్యక్రమాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
శివతేజారెడ్డి మృతికి కారకులైన బోధకుల పేర్లు కూడా కమి టీ దృష్టికి తీసుకెళ్లారు. పలు విభాగాల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను కూడా వివరించారు. రెసిడెంట్లు చెప్పిన అంశాలను కమిటీ సభ్యులు విని నోట్ చేసుకున్నారు. శనివారం మరోసారి ఆయా రెసిడెంట్లతో సమావేశమై తుది నివేదికను రూపొందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment