నల్లగొండ జిల్లాకు చెందిన ఒక యువకుడి నిర్వాకం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు!
అది మాజీ ప్రజాప్రతినిధి కుమారుడి నిర్వాకంగా ప్రచారం
లక్డీకాపూల్ (హైదరాబాద్): నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ బాలికను లోబర్చుకున్నాడు.. ఆమె గర్భం దాల్చడంతో గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌లోని ‘నిమ్స్ (నిజాం వైద్య విజ్ఞాన సంస్థ)’ఆస్పత్రికి తీసుకువచ్చాడు.. తనకు పరిచయం ఉన్న ఓ ఉద్యోగి సాయంతో నిమ్స్ అధికారిని కలిశాడు.. ఆ అధికారి సహకారంతో మైనర్ గర్భిణిని నిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాడు. కానీ ఈ విషయం బయటికి లీకైంది. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు రంగంలోకి దిగి సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
మూడు రోజులుగా ఆస్పత్రిలో..
నల్లగొండ జిల్లా నకిరేకల్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక (16 ఏళ్లు) కడుపులో నొప్పితో బాధపడుతోందని చెప్తూ.. ఒక యువకుడు మూడు రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అప్పటికే ఆమె నాలుగు నెలల గర్భవతి అని, ఆమెను వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే తీసుకువచ్చాడని సమాచారం. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఉంచేందుకు నిమ్స్‌లో తనకు తెలిసినవారితో కలసి ప్రయత్నించాడ ని తెలిసింది.
వైద్యులు బాలికకు వైద్య పరీక్షలు చేసినప్పుడు.. ఆమె గర్భవతి అని గుర్తించినా, కప్పిపుచ్చే ప్రయ త్నం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానికి ఆమెకు చికిత్స ఏదీ అవసరం లేకున్నా.. ఆశ్రయం ఇచ్చే ఉద్దేశంతో మిలీనియం బ్లాక్ రూమ్ నంబర్ 322లో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నట్టు తెలిసింది. వారు ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ విషయం బయటికి పొక్కింది.
విషయం సీరియస్‌గా మారుతోందని గుర్తించిన నిమ్స్ వర్గాలు.. బుధవారం బాలికను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి చేతులు దులుపుకొనేందుకు ప్రయత్నించాయని సమాచారం. అయితే పోలీసులు నిమ్స్‌కు చేరుకుని బాలికను నల్లగొండకు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. బాలికను మోసం చేసిన సదరు యువకుడు ఆమెకు బావ అవుతాడని ఓవైపు.. ఓ మాజీ ప్రజాప్రతినిధి కుమారుడే కారణమని మరోవైపు ప్రచారం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఈ వ్యవహా రంపై మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మెడికో లీగల్ కేసు కిందే వైద్యం చేశాం
సదరు బాలిక కడుపులో నొప్పితో బాధపడుతూ నిమ్స్‌కు వచ్చింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాతే గర్భవతి అని తేలింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాం. మెడికో లీగల్ కేసు (ఎంఎల్‌సీ)గా పరిగణించే, ఆ తరహాలో నమోదు చేశాకే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. – ప్రొఫెసర్ నగరి బీరప్ప, నిమ్స్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment