లక్డీకాపూల్(హైదరాబాద్) : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఓపీ, అడ్మిషన్ సేవలను ఆస్పత్రి యాజమాన్యం తాత్కాలికంగా నిలిపేసింది. అధికారికంగా 5 విభాగాల్లోనే ఈ సేవలను ఆపినట్లు ప్రకటించినా..పూర్తిస్థాయిలో ఓపీ బంద్ ఉన్నట్లు సమాచారం. ఇన్ పేషెంట్ సేవలను కూడా చాలా వరకు తగ్గించారు. అలాగే ఉద్యోగుల హాజరుపై కూడా పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కరోనా వ్యాప్తి తొలినాళ్లలో విధించిన లాక్‌డౌన్ పరిస్థితులే మళ్లీ ఆస్పత్రిలో నెలకొన్నాయి.
లాక్‌డౌన్ నిబంధనల సడలింపులకు ముందు నిమ్స్‌లోని దాదాపు అన్ని వైద్య విభాగాలకు తాళాలు పడ్డాయి. ఓల్డ్ బిల్డింగ్‌లోని ఏ, బీ, సీ బ్లాక్‌లైతే ఇంకా తెరుచుకోనేలేదు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభా గంలో ఓ రోగికి కరోనా రావడం.. అది అలా ప్రొఫెసర్లకు, వైద్యులకు వ్యాప్తి చెందడంతో ఆస్పత్రిలో నియంత్రణ చర్యలు ప్రారంభించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేం దుకు సంసిద్ధమయ్యారు. దీని లో భాగంగా రోగుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అలాగే వైద్యులు, వైద్య సిబ్బంది, ఉద్యోగులు, కార్మి కులు సైతం 70 శాతం మేరకే విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. మిగిలిన 30% మంది విధిగా హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ ఉత్తర్వులు మంగళవారమే వెలువడినట్లు నిమ్స్ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇన్ పేషెంట్లు సైతం ఖాళీ..
ఆస్పత్రిలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చికిత్స పొందుతున్న రోగులను సైతం డిశ్చార్జి చేసి పంపించే చర్యలు చేపట్టారు. గత రెండు రోజుల నుంచి స్పెషాలిటీ బ్లాక్‌లోని కార్డియాలజీ విభాగంలో ఇన్‌పేషెంట్లుగా చికిత్స పొందుతున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఇదే ప్రక్రియను ఆస్పత్రిలోని ఇతర విభాగాలు కూడా అనుసరిస్తున్నాయి. దీంతో ఆస్పత్రిలోని ఆయా విభాగాల్లో వైద్యం అందుకుంటున్న వారు రెండు రోజులుగా డిశ్చార్జి అవుతున్నారు. అయితే, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగులను ఎక్కడికి తరలించాలన్న దానిపై ఆస్పత్రి యాజమాన్యం తర్జనభర్జన పడుతోంది. కార్డియాలజీ ఐసీయూ సహా ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో దాదాపు 100 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వీరిలో కొంత మందిని డిశ్చార్జి చేయనున్నారు. మిగిలిన వారిని ఎక్కడికి తరలించాలన్న దానిపై యాజమాన్యం సమాలోచనలు జరుపుతోంది. ముఖ్యంగా ఆదివారం నుంచి స్పెషాలిటీ బ్లాక్‌ను పూర్తిగా బ్లాక్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. వైరస్ వ్యాప్తి చెందింది ఈ బ్లాక్ నుంచే కావడంతో హైపో క్లోరైడ్, శానిటైజ్ వంటి ప్రక్రియతో పూర్తిగా శుభ్రపరిచే చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ సత్యనారాయణ పేర్కొన్నారు.
పెరుగుతున్న పాజిటివ్ కేసులు..
ఆస్పత్రిలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైద్యులు, వైద్య సిబ్బంది, కార్మికులు.. అంతా కలిపి 20మంది కరోనా వైరస్ బారిన పడినట్లు యాజమాన్యం అధికారంగా వెల్లడించింది. వాస్తవానికి ఈ సంఖ్యకు మూడింతల మంది కరోనాతో బాధపడుతున్నట్లు విశ్వనీయ సమాచారం. ప్రస్తుతం నిమ్స్ మిలీనియం బ్లాక్ మొదటి అంతస్తులో చికిత్స పొందుతున్నది 12 మంది వైద్యులు మాత్రమే. అంతకుముందు దాదాపుగా 20 మంది ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లను నిమ్స్ యాజమాన్యం హోం క్వారంటైన్‌కు పంపించింది. కాగా, శనివారం ఓపీ విభాగం మూసివేతతో ఆస్పత్రిలో బంద్ వాతావరణం కనిపించింది. యూరాలజీ విభాగం మాత్రమే ఓపీ సేవలను అందించింది. మిగిలిన విభాగాలకు రోగులు కూడా రాకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment