సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర డిమాండ్‌తో ఐదురోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిమ్స్‌లో కోలుకుంటున్నారు. కీటోన్స్ మినహా చక్కెర స్థాయి, యూరియా తదితరాలు అన్నీ సాధారణ స్థితికి వచ్చినట్లుగా శుక్రవారంనాటి వైద్యపరీక్షల్లో తేలిందని వైద్యులు తెలిపారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై శుక్రవారం సాయంత్రం బులెటిన్ విడుదల చేసిన అనంతరం నిమ్స్ వైద్యులు డా.లక్ష్మీభాస్కర్, డా.నాగేశ్వరరావు, డా.వంశీ తదితరులు మీడియాతో మాట్లాడారు. జగన్ ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని చెప్పారు. కీటోన్స్ ప్రమాదకర స్థాయి నుంచి తగ్గాయని, త్వరలోనే సాధారణ స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. శ్వాసకోశ సంబంధిత సమస్య (రెస్పిరేటరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్) ఉండటంతో రోగనిరోధక మందులు ఇస్తున్నామన్నారు.
గురువారం సాయంత్రం వరకు ఐవీ ఫ్లూయిడ్స్ మాత్రమే ఇచ్చామని, అయితే త్వరగా కోలుకోవడంతో పాటు శరీరంలో కీటోన్స్ తగ్గేందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించామన్నారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం నుంచి పళ్లరసాలు ఇస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం సుగర్ నిల్వలు 101గా ఉన్నట్టు, కీటోన్స్ నిమ్స్‌లో చేరిన రోజు 4 ప్లస్ ఉండగా, ఇప్పుడు 1ప్లస్‌కు చేరినట్టు పరీక్షల్లో తేలింది. కీటోన్స్ సాధారణంగా జీరో శాతం ఉండాలని, ఈ స్థాయికి చేరుకునేందుకు మరో రెండు, మూడురోజులు పట్టే అవకాశముందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితిని బట్టి శనివారం జగన్‌ను డిశ్చార్జి చేసే అవకాశం ఉందన్నారు.
జగన్‌కు కుటుంబ సభ్యులు, పార్టీ నేతల పరామర్శ
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులతో పాటు పలువురు నాయకులు శుక్రవారం పరామర్శించారు. జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు, సోదరి షర్మిలతోపాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ అనిల్‌రెడ్డి, మాజీ మంత్రి పి.విశ్వరూప్ తదితరులు పరామర్శించినవారిలో ఉన్నారు.