వైఎస్ జగన్ బాగా నీరసించారు: వైద్యులు
హైదరాబాద్: రాష్ట రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్ తో నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ఈ సాయంత్రం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు జగన్‌మోహన్‌రెడ్డికి వైద్య పరీక్షలు చేశారు. వైఎస్ జగన్ ఆరోగ్యం క్రమేపి క్షీణిస్తోందని డాక్టర్లు తెలిపారు. ఆయన బాగా నీరసించారని వెల్లడించారు.
షుగర్ లెవల్స్ క్రమేపి తగ్గుతున్నాయని పేర్కొన్నారు. చక్కెర లెవెల్స్ 58కి పడిపోయాయి. బీపీ 130/80, పల్స్‌రేట్ 70గా ఉన్నాయి. వైఎస్ జగన్ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. ఆయన వెంటనే ప్లూయిడ్స్ తీసుకోవాలని కోరారు. అయితే వైద్యుల సూచనను వైఎస్ జగన్ సున్నితంగా తిరస్కరించారు.
మరోవైపు ఆరోగ్యం క్షిణిస్తున్నా లెక్కచేయకుండా జగన్ దీక్ష కొనసాగిస్తున్నారు. తనకు సంఘీభావం తెలిపేందుకు రాష్టం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తున్నారు. జగన్ను కలిసి పలువురు నాయకులు మద్దతు తెలిపారు.