సాక్షి, హైదరాబాద్: వివిధ రాష్ట్రాల్లో అక్కడి ఆసుపత్రుల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వైద్యాధికారులను ఆదేశించారు. నిమ్స్, ఎంఎన్‌జే ఆసుపత్రుల పనితీరును ఆయన గురువారం సమీక్షించారు. ప్రమాదవశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ల బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరపకపోవడం వల్ల, అవయవదానానికి అవకాశం లేకుండా పోతోందని, కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లాలోని టీచింగ్ ఆసుపత్రుల్లోనే బ్రెయిన్ డెడ్ నిర్ధారించగలిగితే, అవయవాలు సేకరించి, అవసరం ఉన్నవారికి శస్త్రచికిత్స జరిపి మార్పిడి ద్వారా ప్రాణం కాపాడటం సాధ్యమవుతుందన్నారు. ఒక్కరి నుంచి సేకరించిన అవయవాలు ఐదుగురి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుందని, జీవన్‌దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పెరగాలని ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేష్‌రెడ్డి, కమిషనర్ శ్వేతా మహంతి, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షి, నిమ్స్, ఎంఎన్‌జే డైరెక్టర్లు, అన్ని విభాగాల హెచ్‌వోడీలు పాల్గొన్నారు.
గతేడాది వంద అవయవ మార్పిడులు
వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలి. గతేడాది వంద అవయవ మార్పిడులు జరిగాయి. ఈ ఏడాది వందకుపైగా జరిగేలా చూడాలి. అత్యవసర విభాగంలో ఉన్న పేషెంట్లను స్టెబిలైజ్ చేసి వెంటనే ఆయా విభాగాలకు పంపాలి. కొత్తగా వచ్చే పేషెంట్ల కోసం పడకలు అందుబాటులో ఉండేలాలి. బెడ్ ఆక్యుపెన్సీ 77 శాతం ఉంది.. ఇది చాలా తక్కువ. ఓ వైపు పడకలు లేవని, 27శాతం బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు రిపోర్టులో ఎలా పేర్కొంటారు? బెడ్ ఆక్యుపెన్సీ వంద శాతం పెరగాలి.
మెరుగైన సేవలు అందించాలి
మొబైల్ స్క్రీనింగ్ శిబిరాలు జిల్లాల్లో ఎక్కువగా జరగాలి. కేన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారానికి 3 క్యాంపులు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలి. ఇటీవల ప్రారంభించిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు పూర్తిగా వినియోగించాలి. పాలియేటివ్ కేర్ సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలి. మొత్తం 300 పడకల కొత్త బ్లాక్ పనులు దాదాపుగా పూర్తి అయిన నేపథ్యంలో ఎక్విప్మెంట్ సరిపడా ఉండేలా చర్యలు తీసు కోవాలి.
ఇక్కడి పిడియాట్రిక్ పాలియేటివ్ దేశానికే ఆదర్శం. అడల్ట్ పాలియేటివ్ కేర్ విభాగంలో మరో 50 పడకలు అందుబాటులోకి వచ్చా యి. ఇవి కాకుండా రాష్ట్రంలో 33 పాలియేటివ్ కేర్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా అవసాన దశలో ఉన్నవారికి మెరుగైన సేవలు అందించాలి. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల్లో అధ్య యనం చేసి కొత్త విధానం రూపొందించాలి.
Comments
Please login to add a commentAdd a comment