MNJ hospital
-
హైదరాబాద్ MNJ క్యాన్సర్ హాస్పిటల్లో....
-
అధ్యయనం చేయండి.. అనుసరించండి..
సాక్షి, హైదరాబాద్: వివిధ రాష్ట్రాల్లో అక్కడి ఆసుపత్రుల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వైద్యాధికారులను ఆదేశించారు. నిమ్స్, ఎంఎన్‌జే ఆసుపత్రుల పనితీరును ఆయన గురువారం సమీక్షించారు. ప్రమాదవశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ల బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరపకపోవడం వల్ల, అవయవదానానికి అవకాశం లేకుండా పోతోందని, కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని టీచింగ్ ఆసుపత్రుల్లోనే బ్రెయిన్ డెడ్ నిర్ధారించగలిగితే, అవయవాలు సేకరించి, అవసరం ఉన్నవారికి శస్త్రచికిత్స జరిపి మార్పిడి ద్వారా ప్రాణం కాపాడటం సాధ్యమవుతుందన్నారు. ఒక్కరి నుంచి సేకరించిన అవయవాలు ఐదుగురి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుందని, జీవన్‌దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పెరగాలని ఆదేశించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, డీఎంఈ రమేష్‌రెడ్డి, కమిషనర్ శ్వేతా మహంతి, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షి, నిమ్స్, ఎంఎన్‌జే డైరెక్టర్లు, అన్ని విభాగాల హెచ్వోడీలు పాల్గొన్నారు. గతేడాది వంద అవయవ మార్పిడులు వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలి. గతేడాది వంద అవయవ మార్పిడులు జరిగాయి. ఈ ఏడాది వందకుపైగా జరిగేలా చూడాలి. అత్యవసర విభాగంలో ఉన్న పేషెంట్లను స్టెబిలైజ్ చేసి వెంటనే ఆయా విభాగాలకు పంపాలి. కొత్తగా వచ్చే పేషెంట్ల కోసం పడకలు అందుబాటులో ఉండేలాలి. బెడ్ ఆక్యుపెన్సీ 77 శాతం ఉంది.. ఇది చాలా తక్కువ. ఓ వైపు పడకలు లేవని, 27శాతం బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు రిపోర్టులో ఎలా పేర్కొంటారు? బెడ్ ఆక్యుపెన్సీ వంద శాతం పెరగాలి. మెరుగైన సేవలు అందించాలి మొబైల్ స్క్రీనింగ్ శిబిరాలు జిల్లాల్లో ఎక్కువగా జరగాలి. కేన్సర్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వారానికి 3 క్యాంపులు నిర్వహించి వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలి. ఇటీవల ప్రారంభించిన మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు పూర్తిగా వినియోగించాలి. పాలియేటివ్ కేర్ సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలి. మొత్తం 300 పడకల కొత్త బ్లాక్ పనులు దాదాపుగా పూర్తి అయిన నేపథ్యంలో ఎక్విప్మెంట్ సరిపడా ఉండేలా చర్యలు తీసు కోవాలి. ఇక్కడి పిడియాట్రిక్ పాలియేటివ్ దేశానికే ఆదర్శం. అడల్ట్ పాలియేటివ్ కేర్ విభాగంలో మరో 50 పడకలు అందుబాటులోకి వచ్చా యి. ఇవి కాకుండా రాష్ట్రంలో 33 పాలియేటివ్ కేర్ సెంటర్లు ఉన్నాయి. వీటి ద్వారా అవసాన దశలో ఉన్నవారికి మెరుగైన సేవలు అందించాలి. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల్లో అధ్య యనం చేసి కొత్త విధానం రూపొందించాలి. -
సర్కారు దవాఖానాలో.. కేన్సర్‌కు త్రీడీ సర్జరీ!
ఆసిఫాబాద్‌కు చెందిన 60ఏళ్ల వ్యక్తికి కొన్నాళ్లుగా మూత్ర విసర్జనలో రక్తం వస్తోంది. సాధారణ చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లారు. వివిధ పరీక్షలు చేసిన వైద్యులు ఆ వ్యక్తికి కేన్సర్ ఉన్నట్టు గుర్తించారు. సర్జరీ చేస్తే నయమవుతుందని చెప్పారు. కానీ లక్షల్లో ఫీజులు చెల్లించలేని బాధితుడు.. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. కొద్దిరోజుల నుంచి ప్రయోగాత్మకంగా త్రీడీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీలు చేస్తున్న వైద్యులు.. బాధితుడిని అడ్మిట్ చేసుకుని విజయవంతంగా ఆపరేషన్ చేశారు. కొన్నాళ్లు అబ్జర్వేషన్ చేసి.. కేన్సర్ దాదాపుగా నయమైపోయిందని నిర్ధారించారు. సాక్షి, హైదరాబాద్: కేన్సర్ మహమ్మారి చికిత్సలలో ఎంఎన్‌జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రీజనల్ కేన్సర్ సెంటర్ (ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్) విప్లవాత్మక ముందడుగు వేసింది. కేవలం ఒకట్రెండు ప్రైవేటు ఆస్పత్రులకే పరిమితమైన ఆధునిక త్రీడీ ల్యాప్రోస్కోపిక్ చికిత్సలను ప్ర యోగాత్మకంగా ప్రారంభించింది. ఇప్పటికే కొందరు పేషెంట్లకు ఈ విధానంలో విజయవంతంగా సర్జరీలు చేయగా.. త్వరలో పూర్తిస్థాయి త్రీడీ ల్యాప్రోస్కోపిక్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి సన్నద్ధమవుతోంది. వేగంగా.. మెరుగ్గా.. స్పష్టంగా.. కేన్సర్ చికిత్సలో సర్జరీ చేయడమనేది మూడో ప్రత్యామ్నాయం. వ్యాధి తీవ్రతను బట్టి తొలుత కెమో థెరపీ, రేడియో థెరపీ చికిత్సలు చేసి.. తర్వాతే సర్జరీకి సిద్ధమవుతారు. నిజానికి తొలి దశలోనే వ్యాధిని గుర్తించి, ఇతర అవయవాలకు వ్యాపించలేదని నిర్ధారించుకుంటే సర్జరీ నిర్వహించడం ఉత్తమమని వైద్యులు అంటున్నారు. ఇప్పటివరకు పెద్ద కోతతో సర్జరీ చేయడం, కేన్సర్ సోకిన భాగాన్ని తొలగించడంలో పూర్తిస్థాయి కచ్చితత్వం కష్టమవడం.. అటు వైద్యులకు, ఇటు రోగులకు సమస్యగా ఉండేది. బాధితులు కోలుకోవడం ఆలస్యమయ్యేది. ల్యాప్రోస్కోపిక్ విధానం వచ్చాక కొన్నేళ్లుగా వేగంగా సర్జరీ చేసేందుకు, బాధితులు త్వరగా కోలుకునేందుకు వీలు కలిగింది. ఇప్పుడు అత్యాధునిక త్రీడీ ల్యాప్రోస్కోపిక్ పద్ధతి వచ్చాక.. మరింత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. అత్యంత కచ్చితత్వంతో, వేగంగా, మెరుగ్గా సర్జరీని పూర్తి చేసే వీలుంటోంది. ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి ఈ త్రీడీ ల్యాప్రోస్కోపిక్ విధానాన్ని అందిపుచ్చుకుంది. అత్యాధునిక మెషీన్ల కొనుగోలుపై దృష్టి త్రీడీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీలకు అవసరమయ్యే పరికరాల కొనుగోలుపై ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి దృష్టిపెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న మూడు కంపెనీలతో చర్చించి, కొటేషన్లు తీసుకుంది. ఆయా పరికరాలను ప్రయోగాత్మకంగా వినియోగించి, స్పష్టత వచ్చిన తర్వాతే కొనుగోలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు రెండు జర్మనీ తయారీ మెషీన్లు, ఒక అమెరికన్ కంపెనీ మెషీన్‌తో ఆస్పత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 20 కేసులకు సంబంధించి ట్రయల్స్ పూర్తయ్యాయని.. వీటిలో మెరుగైన మెషీన్‌ను కొనుగోలు చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రోబో టెక్నాలజీ వినియోగం కోసమూ.. వైద్య రంగంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆ ఆధునిక టెక్నాలజీనీ వినియోగించాలని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి నిర్ణయించింది. కేన్సర్ చికిత్సలో తోడ్పడే రోబో టెక్నాలజీ వినియోగంపై వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ, పరికరాల ఏర్పాటుకు కనీసం రూ.30 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అందే నిధులతో వాటిని సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. కొత్త విధానాలపై శిక్షణ అవసరం శస్త్రచికిత్సల్లో ల్యాప్రోస్కోపిక్ విధానం చాలా ఏళ్ల నుంచే ఉన్నా.. ప్రస్తుతం త్రీడీ ఇమేజింగ్ సాయంతో మరింత అభివృద్ధి చెందింది. దీనితో చికిత్స సులభతరం కావడంతో పాటు రోగి కోలుకునే సమయం బాగా తగ్గుతోంది. మన దగ్గర వైద్యులకు కోత పద్ధతిలో నేరుగా చూసి సర్జరీలు చేసే నైపుణ్యమే ఉంది. వారికి ల్యాప్రోస్కోపిక్ విధానంపై అవగాహన పెరగాలి. డిజిటల్ డిస్ప్లేలో అవయవాలను గమనిస్తూ.. పరికరాల సాయంతో సర్జరీ చేసేలా శిక్షణ ఇవ్వాలి. ఈ సవాళ్లను అధిగమిస్తే అద్భుతాలు చేయవచ్చు. – డాక్టర్ రమేశ్ మాటూరి, ప్రొఫెసర్, సర్జికల్ ఆంకాలజీ -
హైదరాబాద్ ఆస్పత్రుల్లో తీవ్రమైన రక్తం కొరత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం కొరత తీవ్రంగా ఉంది. నగరంలోని అన్ని ప్రధానాస్పత్రులతో పాటు బ్లడ్ బ్యాంకులలోనూ ప్రస్తుతం సరిపడా రక్త నిల్వలు లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. పలు కారణాలతో దాతలు రక్తం దానం చేయడానికి ముందుకు రావడం లేదు. ► అన్ని స్థాయిల విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తుండడం, ఎండలు పెరగడం, వైరస్ భయాల వంటి కారణాలతో ఇప్పుడు రక్తదానం చేసే వారు కరువయ్యారు. ► ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఆయా ఆస్పత్రుల్లోని బ్లడ్ బ్యాంకులకు చేరుకున్న క్షతగాత్రులకు, సర్జరీ బాధితులకు, తలసేమియా రోగులకు ప్రాణసంకటం ఏర్పడింది. ► బంధువుల్లో ఎవరైనా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే కానీ...ఆయా బాధితులకు అవసరమైన గ్రూప్ రక్తం దొరకని దుస్థితి నెలకొంది. నిలోఫర్‌లో సర్జరీలు వాయిదా నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో రక్తం లేని కారణంగా శుక్రవారం అత్యవసర విభాగంలో నిర్వహించాల్సిన సర్జరీలు వాయిదా పడ్డాయి. సకాలంలో రోగులకు అవసరమైన రక్తం దొరక్క అటు రోగి బంధువులు, ఇటు వైద్యాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు గాంధీ ఆసుపత్రికి పరుగులు పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. బి పాజిటివ్ 4 ప్యాక్డ్ సెల్స్, ఏడు ప్లాటింగ్ ప్యాక్చర్స్ (క్రయోన్స్) పాకెట్లను ఒక్కొక్కటి రూ.650 వెచ్చించి గాంధీ ఆసుపత్రి నుంచి తీసుకువచ్చారు. రక్తాన్ని తెచ్చేంత వరకు రోగి, వైద్యులు ఆపరేషన్ థియేటర్లో వేచి చూశారు. నిత్యం నిలోఫర్ ఆసుపత్రిలో ఏదో ఒక రకమైన బ్లడ్ గ్రూపు కొరత ఉంటోంది. రోగులు బ్లడ్ బ్యాంక్‌కు వెళ్లడం, అక్కడ రక్తం దొరక్క ఇబ్బందులు పడటం సర్వసాధారణమైపోతోంది. దాతలు ముందుకు రావడం లేదు కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి రక్తదాన శిబిరాలు నిర్వహించలేక పోయాం. ఇటీవల నిర్వహిస్తున్నా..ఒకరిద్దరికి మించి ముందుకు రావడం లేదు. ఎండలకు భయపడి దాతలు కూడా ముందుకు రావడం లేదు. పరీక్షల సమయం కావడంతో కాలేజీ విద్యార్థులు కూడా రక్తదానానికి ఇష్టపడటం లేదు. ముఖ్యంగా ‘ఒ’ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ దొరకడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి కూడా కనీస సేవలు అందించ లేకపోతున్నాం. – లక్ష్మీరెడ్డి, అధ్యక్షురాలు, బ్లడ్‌బ్యాంక్స్ అసోసియేషన్ బ్లడ్ బ్యాంక్‌లన్నీ తిరిగాను మాకు తెలిసిన వ్యక్తి ఒకరు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాం. పరీక్షించిన వైద్యులు ఐదు యూనిట్ల రక్తం ఎక్కించాలని చెప్పారు. వైద్యులు రాసిచ్చిన చీటి పట్టుకుని నగరంలోని ప్రముఖ బ్లడ్ బ్యాంకులన్నీ తిరిగాం. అయినా దొరకలేదు. చివరకు మా బంధువుల్లో అదే గ్రూప్‌కు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి రక్తం తీసుకోవాల్సి వచ్చింది. – సీహెచ్.లక్ష్మి, బడంగ్పేట్ -
రాష్ట్రంలో రెండు కేన్సర్ వైద్య కేంద్రాలు
♦ రూ.200 కోట్లతో ఆదిలాబాద్, వరంగల్‌లలో ఏర్పాటుకు యోచన ♦ కేంద్ర ఆర్థిక సహకారంతో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ప్రాంతీయ కేన్సర్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. దీనికి సంబంధించి వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోంది. ఆదిలాబాద్, వరంగల్‌లలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఒక్కో కేంద్రానికి రూ.100 కోట్ల చొప్పున ఖర్చవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో ఈ ప్రాంతీయ కేన్సర్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణరుుంచినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎంఎన్‌జేపై పెరిగిన ఒత్తిడి తెలంగాణ, ఏపీలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రే కీలకంగా మారింది. ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి రోజుకు 500 మందికి పైగా రోగులు వస్తుంటారు. ఏడాదికి లక్ష మందికిపైగా రోగులు చికిత్సానంతర వైద్యం కోసం వస్తుంటారు. మరోవైపు కేన్సర్ వ్యాధి బాధితుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. దీంతో ఎంఎన్‌జే ఆస్పత్రిలో పడకల సంఖ్య, వైద్య సిబ్బంది సరిపోక.. వైద్య సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతు న్నారుు. ఈ నేపథ్యంలో కేంద్ర సహకారంతో వరంగల్, ఆదిలాబాద్‌లలో ప్రాంతీయ కేన్సర్ వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో అందే సేవలన్నీ కూడా వాటిలో అందిస్తే.. రోగులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. స్క్రీనింగ్ సహా కేన్సర్ నిర్ధారణ పరీక్షలు ప్రాంతీయ కేంద్రాల్లో చేయడం వల్ల ఎంఎన్‌జేపై ఒత్తిడి తగ్గించే అవకాశం ఉంటుంది. పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ప్రస్తుతం ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిలో 266 మంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. పడకల సంఖ్య రెట్టింపు స్థాయిలో పెరుగుతుండటంతో అదనంగా 288 పోస్టులు అవసరమని ఎంఎన్‌జే అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం 100 పోస్టులనే మంజూరు చేసినట్లు తెలిసింది. ఇందులో 50 డాక్టర్, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. మిగతా 50 పోస్టుల్లో నర్సులు, రేడియో థెరఫిస్టులు, ఇతర పారామెడికల్ సిబ్బంది పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీచేసే అవకాశముంది. -
ఎంఎన్‌జే ఆసుపత్రికి స్వయంప్రతిపత్తి
► నిమ్స్ స్థాయిలో అభివృద్ధి చేయాలని సర్కార్ నిర్ణయ ► మాసబ్‌ట్యాంక్ సమీపంలో ఐదెకరాల్లో విస్తరణకు పచ్చజెండా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న కేన్సర్ నియంత్రణకుగాను వైద్య సౌకర్యాలు, మౌలిక సదుపాయాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మక మెహిదీ నవాజ్ జంగ్(ఎంఎన్‌జే) కేన్సర్ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరచాలని, దానికి పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తి ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. నిమ్స్‌కు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం వల్ల అది కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిమ్స్‌లాగే ఎంఎన్‌జేను కూడా తీర్చిదిద్దాలని యోచిస్తోంది. స్వయంప్రతిపత్తి వల్ల ఆసుపత్రి డెరైక్టర్ అధికారాల మేరకు అవసరమైనప్పుడు పోస్టులను భర్తీ చేసుకోవచ్చు. వైద్య విద్య సంచాలకుల(డీఎంఈ) పెత్తనం పోతుంది. యూనివర్సిటీలాగా దీన్ని తీర్చిదిద్దుకోవడానికి వీలవుతుంది. ఆంకాలజీలో ఎండీ, ఎంఎస్ కోర్సులను ప్రత్యేకంగా నెలకొల్పుకునే వెసులుబాటు ఉంటుంది. అవసరాన్ని బట్టి సొంత కోర్సులకూ రూపకల్పన చేసుకోవచ్చు. కేన్సర్‌పై ప్రత్యేక పరిశోధనాకేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదెకరాల్లో విస్తరణ.. ఎంఎన్‌జే ఆసుపత్రి విస్తరణ కోసం మాసబ్‌ట్యాంక్ పరిధిలోని ఐటీఐ, నర్సింగ్ కాలేజీల కు చెందిన ఐదెకరాల స్థలాన్ని దానికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ స్థలంలో ప్రత్యేకంగా పది బ్లాక్‌లను నిర్మిస్తారు. అం దులో ఒకటి ప్రత్యేకంగా మహిళలకు కేటాయిస్తారు. కేన్సర్ వైద్య విద్య కోసం మరో బ్లాక్ ఉంటుంది. అత్యాధునిక వైద్య విద్య తరగతి గదులనూ నిర్మిస్తారు. ఎంఎన్‌జేకు రాష్ట్ర బడ్జెట్లో రూ.28 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. స్వయంప్రతిపత్తి వస్తే రూ.50 కోట్ల బడ్జెట్ పెరిగే అవకాశముంది. కేంద్రం నుంచి ప్రతీ ఏడాది రూ.70 కోట్ల మేరకు గ్రాంట్లు విడుదలవుతాయి. పడకల సంఖ్య 250 నుంచి 500 పెంచుకునేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. మరోవైపు 100 వైద్య, ఇతర పారామెడికల్ పోస్టులు మం జూరు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ కేన్సర్ కేంద్రంగా, రెండు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటకలకు కీలకంగా ఉన్న ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రికి రోజూ 500 మందికిపైగా రోగులు వస్తుంటారు. ఏడాదికి లక్షమంది రోగులు ఫాలోఅప్ వైద్యానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో స్వయంప్రతిపత్తి, విస్తరణ వల్ల ఎంఎన్‌జే స్వరూపమే మారిపోతుందని ఆ సంస్థ డెరైక్టర్ డాక్టర్ జయలత ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. -
150వ సినిమాలో బాలు నటిస్తాడు: చిరంజీవి
హైదరాబాద్ : సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి గురువారం ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న బాలు అనే చిన్నారితో ముచ్చటించారు. ఆదిలాబాద్ కు చెందిన పదేళ్ల బాలు గత ఏడాదిగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అతని ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు భరోసా ఇచ్చినా... బాలు మాత్రం ఈమధ్య కాలంలో దిగులుగా కనిపించాడు. ఏంటా అని వైద్యులు ఆరా తీస్తే...తన అభిమాన నటుడు చిరంజీవిని చూడాలని ఉందంటూ మనసులోని కోరికను బయటపెట్టాడు. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న చిరంజీవి ...ఇవాళ ఎంఎన్‌జే ఆస్పత్రికి వెళ్లి బాలును కలిశారు. అంతేకాకుండా అతని కోసం ఖరీదైన బోలెడు బహుమతులు తీసుకు వెళ్లారు. బాలు దగ్గర కూర్చొని చిరంజీవి కబుర్లు చెప్పారు. అలాగే ఇంద్ర సినిమాలోని...'మొక్కేకదా అని పీకేస్తే...పీక కోస్తా అంటూ బాలు చెప్పిన డైలాగ్‌ను మరోసారి అడిగి చెప్పించుకున్నారు. తనతో కలిసి డాన్స్ చేయాలని ఉందన్న బాలు కోరికను తీర్చుతానని చిరంజీవి హామీ ఇచ్చారు. తన 150వ సినిమాలో బాలు నటించే అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు. తన కుమారుడి కోరిక మన్నించి చూసేందుకు వచ్చిన చిరంజీవికి ఈ సందర్భంగా బాలు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా నటుడు పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలే క్యాన్సర్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజ అనే చిన్నారిని ఖమ్మం వెళ్లి మరీ పరామర్శించి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే హీరో మహేష్ బాబు కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులను కొంత సమయం గడిపి వారితో కబుర్లు చెప్పాడు.