150వ సినిమాలో బాలు నటిస్తాడు: చిరంజీవి
హైదరాబాద్ : సినీనటుడు, కేంద్ర మాజీమంత్రి చిరంజీవి గురువారం ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా క్యాన్సర్తో బాధపడుతున్న బాలు అనే చిన్నారితో ముచ్చటించారు. ఆదిలాబాద్ కు చెందిన పదేళ్ల బాలు గత ఏడాదిగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. అతని ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు భరోసా ఇచ్చినా... బాలు మాత్రం ఈమధ్య కాలంలో దిగులుగా కనిపించాడు. ఏంటా అని వైద్యులు ఆరా తీస్తే...తన అభిమాన నటుడు చిరంజీవిని చూడాలని ఉందంటూ మనసులోని కోరికను బయటపెట్టాడు.
ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న చిరంజీవి ...ఇవాళ ఎంఎన్జే ఆస్పత్రికి వెళ్లి బాలును కలిశారు. అంతేకాకుండా అతని కోసం ఖరీదైన బోలెడు బహుమతులు తీసుకు వెళ్లారు. బాలు దగ్గర కూర్చొని చిరంజీవి కబుర్లు చెప్పారు. అలాగే ఇంద్ర సినిమాలోని...'మొక్కేకదా అని పీకేస్తే...పీక కోస్తా అంటూ బాలు చెప్పిన డైలాగ్ను మరోసారి అడిగి చెప్పించుకున్నారు. తనతో కలిసి డాన్స్ చేయాలని ఉందన్న బాలు కోరికను తీర్చుతానని చిరంజీవి హామీ ఇచ్చారు. తన 150వ సినిమాలో బాలు నటించే అవకాశం ఇస్తానని ఆయన చెప్పారు. తన కుమారుడి కోరిక మన్నించి చూసేందుకు వచ్చిన చిరంజీవికి ఈ సందర్భంగా బాలు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
కాగా నటుడు పవన్ కళ్యాణ్ కూడా ఇటీవలే క్యాన్సర్తో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీజ అనే చిన్నారిని ఖమ్మం వెళ్లి మరీ పరామర్శించి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే హీరో మహేష్ బాబు కూడా క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారులను కొంత సమయం గడిపి వారితో కబుర్లు చెప్పాడు.