సర్కారు దవాఖానాలో.. కేన్సర్‌కు త్రీడీ సర్జరీ!  | Telangana: MNJ Hospital Introduces High Tech 3D Laparoscopy Equipment | Sakshi
Sakshi News home page

సర్కారు దవాఖానాలో.. కేన్సర్‌కు త్రీడీ సర్జరీ! 

Published Mon, Aug 15 2022 1:59 AM | Last Updated on Mon, Aug 15 2022 9:55 AM

Telangana: MNJ Hospital Introduces High Tech 3D Laparoscopy Equipment - Sakshi

త్రీడీ ల్యాప్రోస్కోపిక్‌ ద్వారా సర్జరీ చేస్తున్న ఎంఎన్‌జే ఆస్పత్రి డాక్టర్లు 

ఆసిఫాబాద్‌కు చెందిన 60ఏళ్ల వ్యక్తికి కొన్నాళ్లుగా మూత్ర విసర్జనలో రక్తం వస్తోంది. సాధారణ చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. వివిధ పరీక్షలు చేసిన వైద్యులు ఆ వ్యక్తికి కేన్సర్‌ ఉన్నట్టు గుర్తించారు. సర్జరీ చేస్తే నయమవుతుందని చెప్పారు. కానీ లక్షల్లో ఫీజులు చెల్లించలేని బాధితుడు.. ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. కొద్దిరోజుల నుంచి ప్రయోగాత్మకంగా త్రీడీ ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీలు చేస్తున్న వైద్యులు.. బాధితుడిని అడ్మిట్‌ చేసుకుని విజయవంతంగా ఆపరేషన్‌ చేశారు. కొన్నాళ్లు అబ్జర్వేషన్‌ చేసి.. కేన్సర్‌ దాదాపుగా నయమైపోయిందని నిర్ధారించారు. 

సాక్షి, హైదరాబాద్‌: కేన్సర్‌ మహమ్మారి చికిత్సలలో ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ రీజనల్‌ కేన్సర్‌ సెంటర్‌ (ఎంఎన్‌జే కేన్సర్‌ హాస్పిటల్‌) విప్లవాత్మక ముందడుగు వేసింది. కేవలం ఒకట్రెండు ప్రైవేటు ఆస్పత్రులకే పరిమితమైన ఆధునిక త్రీడీ ల్యాప్రోస్కోపిక్‌ చికిత్సలను ప్ర యోగాత్మకంగా ప్రారంభించింది. ఇప్పటికే కొందరు పేషెంట్లకు ఈ విధానంలో విజయవంతంగా సర్జరీలు చేయగా.. త్వరలో పూర్తిస్థాయి త్రీడీ ల్యాప్రోస్కోపిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి సన్నద్ధమవుతోంది.  

వేగంగా.. మెరుగ్గా.. స్పష్టంగా.. 
కేన్సర్‌ చికిత్సలో సర్జరీ చేయడమనేది మూడో ప్రత్యామ్నాయం. వ్యాధి తీవ్రతను బట్టి తొలుత కెమో థెరపీ, రేడియో థెరపీ చికిత్సలు చేసి.. తర్వాతే సర్జరీకి సిద్ధమవుతారు. నిజానికి తొలి దశలోనే వ్యాధిని గుర్తించి, ఇతర అవయవాలకు వ్యాపించలేదని నిర్ధారించుకుంటే సర్జరీ నిర్వహించడం ఉత్తమమని వైద్యులు అంటున్నారు. ఇప్పటివరకు పెద్ద కోతతో సర్జరీ చేయడం, కేన్సర్‌ సోకిన భాగాన్ని తొలగించడంలో పూర్తిస్థాయి కచ్చితత్వం కష్టమవడం.. అటు వైద్యులకు, ఇటు రోగులకు సమస్యగా ఉండేది. బాధితులు కోలుకోవడం ఆలస్యమయ్యేది.

ల్యాప్రోస్కోపిక్‌ విధానం వచ్చాక కొన్నేళ్లుగా వేగంగా సర్జరీ చేసేందుకు, బాధితులు త్వరగా కోలుకునేందుకు వీలు కలిగింది. ఇప్పుడు అత్యాధునిక త్రీడీ ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతి వచ్చాక.. మరింత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. అత్యంత కచ్చితత్వంతో, వేగంగా, మెరుగ్గా సర్జరీని పూర్తి చేసే వీలుంటోంది. ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి ఈ త్రీడీ ల్యాప్రోస్కోపిక్‌ విధానాన్ని అందిపుచ్చుకుంది. 

అత్యాధునిక మెషీన్ల కొనుగోలుపై దృష్టి 
త్రీడీ ల్యాప్రోస్కోపిక్‌ సర్జరీలకు అవసరమయ్యే పరికరాల కొనుగోలుపై ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి దృష్టిపెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న మూడు కంపెనీలతో చర్చించి, కొటేషన్లు తీసుకుంది. ఆయా పరికరాలను ప్రయోగాత్మకంగా వినియోగించి, స్పష్టత వచ్చిన తర్వాతే కొనుగోలు చేస్తామని పేర్కొంది. ఈ మేరకు రెండు జర్మనీ తయారీ మెషీన్లు, ఒక అమెరికన్‌ కంపెనీ మెషీన్‌తో ఆస్పత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 20 కేసులకు సంబంధించి ట్రయల్స్‌ పూర్తయ్యాయని.. వీటిలో మెరుగైన మెషీన్‌ను కొనుగోలు చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. 

రోబో టెక్నాలజీ వినియోగం కోసమూ.. 
వైద్య రంగంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆ ఆధునిక టెక్నాలజీనీ వినియోగించాలని ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి నిర్ణయించింది. కేన్సర్‌ చికిత్సలో తోడ్పడే రోబో టెక్నాలజీ వినియోగంపై వైద్యులు అధ్యయనం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ, పరికరాల ఏర్పాటుకు కనీసం రూ.30 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అందే నిధులతో వాటిని సమకూర్చుకోవాలని భావిస్తున్నారు. 

కొత్త విధానాలపై శిక్షణ అవసరం 
శస్త్రచికిత్సల్లో ల్యాప్రోస్కోపిక్‌ విధానం చాలా ఏళ్ల నుంచే ఉన్నా.. ప్రస్తుతం త్రీడీ ఇమేజింగ్‌ సాయంతో మరింత అభివృద్ధి చెందింది. దీనితో చికిత్స సులభతరం కావడంతో పాటు రోగి కోలుకునే సమయం బాగా తగ్గుతోంది. మన దగ్గర వైద్యులకు కోత పద్ధతిలో నేరుగా చూసి సర్జరీలు చేసే నైపుణ్యమే ఉంది. వారికి ల్యాప్రోస్కోపిక్‌ విధానంపై అవగాహన పెరగాలి. డిజిటల్‌ డిస్‌ప్లేలో అవయవాలను గమనిస్తూ.. పరికరాల సాయంతో సర్జరీ చేసేలా శిక్షణ ఇవ్వాలి. ఈ సవాళ్లను అధిగమిస్తే అద్భుతాలు చేయవచ్చు.
– డాక్టర్‌ రమేశ్‌ మాటూరి, ప్రొఫెసర్, సర్జికల్‌ ఆంకాలజీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement