పెద్ద నోట్ల రద్దుతో నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో పేషెంట్లు అవస్థలు పడుతున్నారు.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. బిల్లులు చెల్లిస్తేనే చికిత్స పొందిన పేషెంట్లను డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు అంటున్నారు. బిల్లు చెల్లింపులను నగదు రూపంలోగానీ, క్రెడిట్ కార్డులను మాత్రమే స్వీకరిస్తామని చెప్పడంతో పేషెంట్లు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. డెబిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తామని చెప్పినా.. ఆ కార్డులకు స్వైప్ మిషన్ తమ వద్ద లేదని నిమ్స్ సిబ్బంది సమాధానం ఇస్తున్నారు. దీంతో నిమ్స్ సిబ్బందితో పేషెంట్లు, వారి బంధువులు వాగ్వివాదానికి దిగుతున్నారు.
బ్యాంకుల వద్ద భారీ క్యూ లైన్లున్నాయి. డబ్బులు ఎక్కడినుంచి తీసుకొచ్చి చెల్లించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెబిట్ కార్డులను ఎందుకు అంగీకరించరని.. తమకున్న మార్గం అదేనని వారు వాపోయారు. నోట్ల రద్దుతో పాటు, కొత్తనోట్లు పూర్తిగా అందుబాటులోకి రాకపోవడంతో మార్కెట్ల వద్ద మాత్రమే కాదు ఆస్పత్రులలోనూ సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.