ఆస్పత్రుల్లో ఆ‘పరేషాన్’
► ‘మత్తు’ వైద్యులు లేక శస్త్రచికిత్సలకు బ్రేక్
► ఆపరేషన్ థియేటర్ల ముందు రోగుల పడిగాపులు
► గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లోనూ అదే తీరు
సాక్షి, సిటీబ్యూరో: సామాన్య ప్రజలు ఆపద వస్తే దేవుణ్ని.. ఆరోగ్యం పాడైతే వైద్యుణ్ని వేడుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి రోగుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శస్త్ర చికిత్సల్లో అతి ముఖ్యమైన ‘మత్తు’ ఇచ్చే వైద్యులు నగరంలోని ప్రభుత్వాస్పత్రుల్లో లేకపోవడంతో అత్యవసర ఆపరేషన్లు సైతం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓపక్క రోగులు చస్తున్నా ప్రభుత్వం మాత్రం ‘మత్తు’ వీడటం లేదు. రోగుల నిష్పత్తికి తగినంత మంది మత్తు మందు వైద్యులు లేకపోవడంతో అత్యవయసర శస్త్రచికిత్సల కోసం ఆస్పత్ర ుల్లో చేరిన రోగులకు ఆపరేషన్ థియేటర్ల వద్ద చేదు అనుభవమే ఎదురవుతోంది.
గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య పెరిగింది. అందుకు అనుగుణంగా పడకల సామర్థ్యం, సర్జన్స్, యూనిట్ల సంఖ్యా పెంచారు. అదే స్థాయిలో మత్తు వైద్యుల సంఖ్య మాత్రం పెంచలేదు. క్లిష్టమైన గుండె, మూత్రపిండాలు, కాలేయ, మెదడు, వెన్నుపూస సంబంధిత శస్త్రచికిత్సలే కాదు సాధారణ శస్త్రచికిత్సల కోసం కూడా రోజుల తరబడి ఆస్పత్రిలోనే నిరీక్షించాల్సి వస్తోంది. గత్యంతరం లేక కొంతమంది అక్కడే పడిగాపులు కాస్తుంటే.. మరికొం దరు అప్పుచేసి ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు.
హే గాంధీ..
సికింద్రాబాద్‌లోని ప్రతిష్టాత్మాక గాంధీ జనరల్ ఆస్పత్రిని 1998లో వెయ్యి పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పడకల సామర్థ్యాన్ని రెండు వేలకు పెంచారు. ఆపరేషన్ థియేటర్లను 12 నుంచి 31కి పెంచారు. ఇక్కడ రోజుకు సగటున 60-70 శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. 28 అనస్థీషియన్ పోస్టులకు 17 మంది వైద్యులే సేవలు అందిస్తున్నారు. సర్జన్లు, ఆపరేషన్ థియేటర్ల నిష్పత్తికి తగినంత మంది మత్తుమందు వైద్యులు లేరు. వెంటిలేర్‌పై ఉన్న రోగులు, ఏఎంసీ, ఆర్‌ఐసీయూలోని రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడం లేదు.
నిమ్స్‌లోనూ అంతే..
నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) అవుట్ పేషంట్ విభాగానికి రోజుకు 2300-2500 మంది రోగులు వస్తుంటారు. నిత్యం ఇక్కడ 1200 మంది చికిత్స పొందుతుంటారు. ఆస్పత్రిలో ప్రస్తుతం 18 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. రోజుకు సగటున 30-40 శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇలా అందరు కలుపుకుని 20 మంది మత్తు మందు వైద్య నిపుణులు ఉన్నారు. ఇక్కడ మరో ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగుల నిష్పత్తికి తగినంత మంది అనస్థీషియన్లు లేకపోవడంతో శస్త్రచికిత్సలు వాయిదా పడుతున్నాయి. న్యూరోసర్జరీ, కార్డియో థొరాసిక్, ఆర్థోపెడిక్, మూత్రపిండాలు, క్యాన్సర్ విభాగాల్లో సకాలంలో వైద్య సేవలు అందక రోగులు మృత్యువాత పడుతున్నారు.
ఉస్మానియాలో మరింత దారణం
ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో తొమ్మిది ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వీటిలో రోజుకు సగటున 50 శస్త్రచికిత్సలు జరుగుతాయి. 18 అనస్థీషియన్ పోస్టులకు ఐదు ఖాళీగా ఉన్నాయి. ఉన్నవారిలో కూడా రోజుకు ముగ్గురు, నలుగురు వైద్యులు సెలవుల్లో వెళ్తున్నారు. శస్త్రచికిత్సల సమయంలో అనస్థీషియన్ అందుబాటులోలేక వాయిదా పడుతున్నాయి. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయక పోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో రోగం నయం కాకపోగా మరింత ముదురుతోంది.