తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) శుక్రవారంనాడు అసెంబ్లీలో ప్రతి పాదించిన అనామతు బడ్జెట్ ప్రతిపాదనలు రెండున్నర మాసాల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నిక లలో చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి అనువుగానే ఉన్నాయి. సమగ్రాభివృద్ధి, సామాజికన్యాయం అనే రెండు లక్ష్యాలను సాధించడానికి ఉద్దేశించిన బడ్జెట్ ప్రతిపాదనల్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. 2019–20 బడ్జెట్ వ్యయం అంచనా రూ. 1,82,017 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ. 1,32,629 కోట్లు. ఎన్నికల హామీలకు అనుగుణంగా రైతులకు అగ్రతర ప్రాధాన్యం ఇచ్చారు. నిరు పేదవర్గాలకూ, నిరుద్యోగులకూ, దివ్యాంగులకూ సహాయం పెంచారు. 2018 డిసెంబర్ 11వ తేదీకి పూర్వం రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రూ. 6,000 కోట్లు ప్రత్యేకించారు. రుణాల మొత్తాన్ని నాలుగేళ్ళలో విడతలవారీగా మాఫీ చేయాలని సంకల్పం. రైతుబంధు పథకం కింద నిరుడు ఇచ్చిన ఎకరాకు పంటకు రూ. 4,000ను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ. 5,000లకు పెంచాలని ప్రతి పాదించారు. ఈ పథకం కోసం రూ. 1,200 కోట్లు కేటాయించారు. ఈ పథకంతోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రైతుపక్షపాతిగా పేరు వచ్చింది. ఏ కారణంగానైనా రైతు మరణించినట్లయితే అతని కుటుంబానికి రైతుబీమా పథకం కింద వెంటనే అయిదు లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. ఈ పథకం కొనసాగింపునకు రూ. 650 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద ఇప్పటికే 5,678 కుటుంబాలు సహాయం పొందాయని అనేక శాఖలతోపాటు ఆర్థిక శాఖ కూడా నిర్వహిస్తున్న కేసీఆర్ ప్రకటించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా అయిదు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఈటల రాజేంద్ర ఈసారి శాసనమండలిలో బడ్జెట్ ప్రసంగం చదివారు. రాష్ట్రంలోని రెండు వేల పంచా యతీలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో అన్ని వనరుల నుంచి మొత్తం రూ. 8,000 కోట్లు గ్రాంటుగా లభిస్తాయనీ, వచ్చే అయిదేళ్ళలో రూ. 40,000 గ్రాంట్లు వస్తాయనీ కేసీఆర్ చెప్పారు. నిరుద్యో గులకు చెల్లించే నెలసరి భృతిని రూ. 3,116 గా నిర్ణయించారు. ఇందుకోసం రూ. 1,810 కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపు ఏ ప్రాతిపదికన చేశారో, నిరుద్యోగులను ఎట్లా గుర్తించారో, రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో, ఎంతమందికి ఈ పథకం వర్తిస్తుందో ప్రభుత్వం స్పష్టం చేయవలసి ఉన్నది. దివ్యాంగుల పింఛను మొత్తాన్ని రూ. 1,500 నుంచి 3,016 లకు పెంచా లని ప్రతిపాదించారు. వ్యవసాయరంగానికీ, నీటిపారుదల రంగానికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరవాత కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. వివిధ రకాల పేదలకు ఇచ్చే ఆసరా పింఛన్ల మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ. 2,116కు పెంచారు. వృద్ధులకూ, వితంతువులకూ, బీడీ కార్మికులకూ, చేనేత కార్మికులకూ, కల్లుగీత కార్మికులకూ, బోదకాలు రోగపీడితులకూ, ఇతరులకూ వర్తించే ఆసరా పథకం అమలుకోసం రూ. 1,260 కోట్లు కేటాయించారు.
దేశంలో మరే రాష్ట్రం లోనూ ఇన్ని వర్గాలకు పింఛన్లు అందుతున్న దాఖలా లేదు. సంక్షేమానికి సంవత్సరంలో రూ. 43 వేల కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్రాలు తక్కువ. పుల్వామా ఉగ్రదాడిలో మర ణించిన జవాన్ల కుటుం బాలకు తలొక రూ. 25 లక్షల వంతున సాయం అందించాలన్న నిర్ణయం హర్షణీయమైనది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బీసీ విద్యార్థుల కోసం 119 గురుకుల పాఠశా లలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. ముస్లిం బాలలకూ, ఎస్‌సీ, ఎస్‌టీ బాల లకూ ఉద్దేశించిన గురు కుల పాఠశాలలు వెయ్యి దాకా ఉండటం విశేషం. ఆదాయవనరులు ఉన్నాయి కనుకా, పన్నుల వసూళ్ళు సక్రమంగా జరుగుతున్నాయి కనుకా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించి చెప్పిన పనులు చేయ గలుగుతున్నది. 2018–19 బడ్జెట్ వ్యయం సవరించిన అంచనాల ప్రకారం రూ. 353 కోట్ల మిగులు తేలింది. పన్నుల నుంచి రాబడి రూ. 94,776 కోట్లు. 2018–19 కంటే ఇది రూ. 22,000 కోట్లు అధికం. రియల్ ఎస్టేట్ నుంచి ప్రభుత్వ ఆదాయం పెరుగుతోంది. సేవారంగం సంతృప్తికరంగా వృద్ధి చెందుతోంది. వ్యవసాయ ఉత్పత్తులు పెరి గాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి వేల ఎకరాలకు అదనంగా నీటి వసతి కల్పించగలిగితే వ్యవ సాయరంగం నుంచి సత్ఫలితాలు ఆశించవచ్చు.
రైతుబంధు పథకంలోనే ఎక్కువ విస్తీర్ణం ఉన్న వారినీ, వ్యవసాయం చేయకుండా కౌలుకు ఇచ్చేవారినీ మినహాయించి, కౌలుదారులనూ, వ్యవసాయ కూలీలనూ ఆదుకునే ఆలోచన చేయాలి. దానివల్ల సామాజికన్యాయం అనే సూత్రం సార్థకం అవుతుంది. విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించినందుకు అభినందనీయమే. విద్యుత్తు కొను గోలు చేసే వ్యవస్థను మరింత హేతు బద్ధంగా సవరించినట్లయితే వ్యయం తగ్గించే అవకాశం ఉన్నదేమో పరిశీలించాలి. పరిశ్రమలకు ఇరవై నాలుగు గంటల విద్యుచ్ఛక్తి సరఫరా అవసరమే. వ్యవసాయరంగానికి పగలు సరఫరా చేస్తే సరిపోతుందేమో చూడాలి. ప్రభుత్వరంగంలో విద్య, వైద్య రంగాలకు ఇతోధికంగా ప్రోత్సాహం అందించి పేద ప్రజలను కార్పొరేట్ ఆసుపత్రుల బారి నుంచి రక్షించేందుకు కూడా ప్రభుత్వం పూనుకోవలసి ఉంది. ఈ రంగాలకూ ప్రాధాన్యం క్రమంగా తగ్గుతుండటం శోచనీయం. విద్యాశాఖ బడ్జెట్ 2018–19 కంటే 2019–20లో వెయ్యి కోట్ల రూపా యలు తగ్గించారు. గత అయిదేళ్ళలో మొత్తం బడ్జెట్ వ్యయంలో విద్యాశాఖకు కేటాయింపులు 10.88 శాతం నుంచి 6.78 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. వైద్యశాఖకు సైతం రూ. 5,536 కోట్లు మాత్రమే ప్రత్యేకించారు. ఈ రెండు రంగాలపైనా ప్రభుత్వం దృష్టి సారించవలసిన అగత్యం ఉన్నది. కొన్ని రాష్ట్రాలలో చేసినట్టు ఎన్నికలలో విజయంకోసం సకల హామీలూ ఇచ్చి తీరా అధికా రంలోకి వచ్చిన తర్వాత లబ్దిదారుల సంఖ్య కుదించడమో, చెల్లింపుల మొత్తాలను తగ్గించడమో చేయకుండా ఎన్నికల వాగ్దానాలను ఉన్నవి ఉన్నట్టు అమలు చేయడానికి ప్రయత్నించడమే తెలం గాణ బడ్జెట్‌లో చెప్పుకోదగిన ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment