సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 14 నుంచి 22 వరకు వరుసగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం అనంతరం.. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్, ఉపసభాపతి పద్మారావు గౌడ్, పలువురు మంత్రులు, విపక్ష ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించారు. మొహర్రం, గణేశ్ నిమజ్జనం తదితరాల నేపథ్యంలో ఈ నెల 10 నుంచి 13 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయాలని నిర్ణయించారు.
బీఏసీ సమావేశానికి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో పా టు, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హాజరయ్యారు. వీరితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి హాజరు కాగా, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ తర హాలో హైదరాబాద్‌లో ప్రత్యేక భవనం నిర్మించా లని భట్టి విక్రమార్క సూచించారు. నూతనంగా నిర్మించే అసెంబ్లీ భవన సముదాయంలో నిర్మిస్తా మని కేసీఆర్ తెలిపారు. అక్టోబర్‌లో రెవెన్యూ బిల్ పెట్టే అవకాశం ఉందని కేసీఆర్ వెల్లడించినట్లు తెలి సింది. కాగా వచ్చే బడ్జెట్ సమావేశాలను 21 రోజులపాటు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు.
22 వరకు అసెంబ్లీ సమావేశాలు..
వాయిదా అనంతరం తిరిగి 14న ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 22న ముగుస్తాయి. 14వ తేదీ మొదలు 22వ తేదీ వరకు రోజువారీగా చేపట్టాల్సిన అంశాలపై బీఏసీ చర్చించింది. 14, 15 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ కొనసాగించి, 15న ముఖ్యమంత్రి సమాధానం ఇస్తారు. 16న హౌసింగ్, సాంఘిక, గిరిజన, మహిళా, మైనార్టీ, స్త్రీ, శిశు, వికలాంగ సంక్షేమ శాఖల పద్దులపై సభ చర్చిస్తుంది. 17న మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల, విద్యుత్ అంశా లు, 18న రెవెన్యూ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రవాణా, హోం, వ్యవసాయం, అనుబంధ శాఖలు, పౌర సరఫరాల శాఖ పద్దులపై చర్చిస్తారు.
19న పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య, క్రీడలు, యువజన, వైద్య, ఆరోగ్య శాఖ పద్దులు, 20న కార్మిక, ఉపాధి, దేవాదాయ, అటవీ, పరిశ్రమలు, ఐటీ, ప్రభుత్వ రంగ సంస్థలపై చర్చ జరుగుతుంది. 21న పాలన, ప్రణాళిక, సమాచార శాఖ పద్దులు, సమావేశాల చివరి రోజు 22న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. 14 నుంచి 22 వరకు పలు బిల్లులను కూడా సభలో పెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 22న శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉగాండాలో జరిగే కామన్వెల్త్ దేశాల పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో పాల్గొనేందుకు బయలుదేరి వెళతారు.
నాలుగు రోజుల పాటు మండలి భేటీ..
ఈ నెల 11న శాసనమండలి స్పీకర్ ఎన్నిక తర్వాత శాసన మండలిని వాయిదా వేసి, తిరిగి 14, 15, 22 తేదీల్లో సమావేశాలు నిర్వహించాలని శాసన మండలి బీఏసీ నిర్ణయించింది. పద్దుల మీద శాసన మండలిలో చర్చ జరగనందున కేవలం నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment